The 100: గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?

ఆర్కే సాగర్‌ ప్రధాన పాత్రలో రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్‌ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్‌ రామ్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 27 Apr 2024 09:33 IST

ర్కే సాగర్‌ ప్రధాన పాత్రలో రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్‌ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్‌ రామ్‌ సంయుక్తంగా నిర్మించారు. మిషా నారంగ్‌ కథానాయిక. ధన్య బాలకృష్ణ, గిరిధర్‌, ఆనంద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను కొణిదెల అంజనా దేవి శుక్రవారం విడుదల చేశారు. సాగర్‌ ఈ సినిమాలో విక్రాంత్‌ అనే నిజాయతీ గల ఐపీఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆయన్ని మానవ హక్కుల కమిషన్‌ విచారించడంతో టీజర్‌ మొదలైంది. నగర శివార్లలో సామూహిక హత్యలు జరగడం.. పోలీసుల విచారణలో వారంతా రౌడీ షీటర్లని తేలడం.. వారి హత్యల వెనుక విక్రాంత్‌ హస్తమున్నట్లు అర్థమవడం.. ఇలా ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగిందీ ప్రచార చిత్రం. ఆఖర్లో ‘‘గెలవడమే గోల్‌ అయినప్పుడు ఆట ఎలా ఆడితే ఏంటి?’’ అంటూ సాగర్‌ చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో రానుంది.


కథ కుదిరిందా?

కాశం నీ హద్దురా’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు సుధా కొంగర. ఇప్పుడామె అదే సినిమాని అక్షయ్‌ కుమార్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది త్వరలో విడుదల కానుంది. దీని తర్వాత ఆమె కథానాయకుడు సూర్యతో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకొంత సమయం పట్టనుంది. అందుకే ఈ గ్యాప్‌లో మరో సినిమా పట్టాలెక్కించేందుకు సుధా ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని తాజాగా యువ కథానాయకుడు ధృవ్‌ విక్రమ్‌కు వినిపించినట్లు సమాచారం. ఆ స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆయన కూడా సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ విషయంలో స్పష్టత వచ్చాక ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ధృవ్‌ ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ క్రీడా నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు.


‘దీక్ష’ ప్రారంభం

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ దర్శకనిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్‌ కుమార్‌, భవ్యశ్రీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత రామకృష్ణగౌడ్‌ క్లాప్‌నివ్వగా, సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.  డా.యోగానంద కృష్ణమాచార్య గౌరవ దర్శకత్వం వహించారు. జేవీఆర్‌, గురురాజ్‌లు చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ‘‘కొంచెం విరామం తర్వాత మరో మంచి కథ కుదరడంతో దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నా. కథాబలం ఉన్న చిత్రమిది. పురస్కారాలూ వస్తాయి. దీక్ష, పట్టుదలతో ఏ పని చేసినా తప్పకుండా విజయం దక్కుతుందనే అంశం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. మే 1 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌తోపాటు, దుబాయ్‌లోనూ చిత్రీకరణ చేస్తాం. ఈ సినిమా తర్వాత క్రీడా నేపథ్యంలోనూ ఓ చిత్రం చేస్తాం. ఇకపై మా సంస్థలో వరుసగా సినిమాలు రూపొందుతాయి’’ అన్నారు. నటనకి అవకాశమున్న పాత్రల్ని పోషిస్తున్నామన్నారు నాయకానాయికలు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్‌, రచయిత మేడ ప్రసాద్‌, నిర్మాత గిరి తదితరులు పాల్గొన్నారు.


భారత్‌-పాక్‌ యుద్ధ నేపథ్యం

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధాల నేపథ్యంతో ఎన్ని చిత్రాలొచ్చినా ప్రేక్షకులు వాటిపై ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే కథాంశంతో ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ వస్తోంది. 1971లో భారత నావికాదళం పాకిస్థాన్‌ ఓడరేవు నగరం కరాచీపై చేసిన దాడి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. సన్‌షైన్‌ డిజీమీడియాతో కలిసి ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాణీలు ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ, అందుకు సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు. ‘1971 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో భారత నావికాదళం చేపట్టిన సాహోసోపేతమైన దాడి కథనంతో ఈ చిత్రం అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ చారిత్రక విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం’ అనే వ్యాఖ్యలు జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని