Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలా ఉందంటే?

Updated : 11 Mar 2024 19:03 IST

Merry Christmas review; చిత్రం: మెర్రీ క్రిస్మస్‌; తారాగణం: విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌, ల్యూక్‌ కెన్నీ, రాధికా శరత్‌కుమార్‌, బేబీ మహేశ్వరీ శర్మ తదితరులు; సంగీతం: ప్రీతమ్‌ (పాటలు), డానియల్‌ బి. జార్జ్‌ (నేపథ్య సంగీతం); కూర్పు: పూజ; ఛాయాగ్రహణం: మధు నీలకందన్; నిర్మాతలు: రమేశ్‌ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్‌ రౌత్రాయ్‌; దర్శకత్వం: శ్రీరామ్‌ రాఘవన్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన చిత్రాల్లో ‘మెర్రీ క్రిస్మస్‌’ (Merry Christmas) ఒకటి. కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Merry Christmas OTT Platform)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పండగ పేరుతో రూపొందిన ఈ ప్రాజెక్టులో ఏం చూపించారు? ఎలా ఉంది? (Merry Christmas movie review in telugu)..

కథేంటంటే?: ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత.. క్రిస్మస్‌ సందర్భంగా ముంబయిలోని సొంతింటికి తిరిగి వస్తాడు. తన తల్లి లేదన్న విషయం తెలిసి, బాధపడతాడు. ఇంట్లో ఒంటరిగా ఉండలేక హోటల్‌కు వెళ్లిన అతడికి.. అక్కడున్న మరియా (కత్రినా కైఫ్‌), ఆమె కూతురు యానీ (బేబీ మహేశ్వరీ శర్మ)లతో ఓ విషయం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఓ థియేటర్‌లోనూ ఆల్బర్ట్‌, మరియా అనుకోకుండా ఎదురుపడతారు. తర్వాత, వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. పండగ కావడంతో మరియా.. ఆల్బర్ట్‌ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది. వారు ఇంట్లోకి రాగానే మరియా భర్త జెరోమ్‌ (ల్యూక్‌ కెన్నీ) శవమై కనిపిస్తాడు. దీంతో, ‘నేనిక్కడ ఉండడం నీకు సేఫ్‌ కాదు’ అంటూ ఆల్బర్ట్‌ మరియా నివాసం నుంచి వెళ్లిపోతాడు. మళ్లీ వీరు ఎలా కలుసుకున్నారు? ఆల్బర్ట్‌ గతమేంటి? జెరోమ్‌ది హత్యా, ఆత్మహత్యా? అన్నది మిగతా కథ (Merry Christmas Review).

ఎలా ఉందంటే?: ఒక కథ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. సమాజంలో చోటుచేసుకునే కొన్ని ఘటనలూ అంతే. ఓ కోణంలో ఆలోచించే వారికి పాజిటివ్‌, మరో కోణంలో ఆలోచించే వారికి నెగెటివ్‌గా అనిపించొచ్చు. ఈ సినిమా కాన్సెప్ట్‌ కూడా అలాంటిదే. అర్థం చేసుకునేవారికి అర్థంచేసుకున్నంత. ఓ మిక్సీ జార్‌లో చట్నీ, మరో మిక్సీ జార్‌లో మెడిసిన్‌ గ్రైండ్‌ అవడం చూపిస్తూ ఫస్ట్‌ షాట్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు. ప్రారంభం ఓకేగానీ అసలు కథని చెప్పేందుకు చాలా సమయం తీసుకున్నారు. ఆల్బర్ట్‌- మరియా పరిచయం, ఒకరికొకరు తమ గతాన్ని పంచుకోవడంతోనే సగం సినిమా పూర్తవుతుంది. ముందుగా ఇది ‘లవ్‌స్టోరీ ఏమో’ అని అనిపించినా తర్వాత థ్రిల్లర్‌ అని అర్థమవుతుంది. ఫ్రెంచ్‌ నవల లా మాంటే- ఛార్జ్‌ ఆధారంగా రూపొందించిన కథ ఇది. దీంతో, హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. ఆల్బర్ట్‌ ఏం పని చేసేవాడు? మరియా ఏం చేస్తుంటుంది? ఆమె భర్త జెరోమ్‌ ఎలాంటివాడు? తదితర ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీలు కాస్త రిలీఫ్‌. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది (Merry Christmas movie review in telugu).

జెరోమ్‌ మర్డర్‌ మిస్టరీ చుట్టూ సెకండాఫ్‌ తిరుగుతుంది. అతడిని హత్య చేసిందెవరా? అనే ఉత్కంఠను కొనసాగిస్తూ కొత్త క్యారెక్టర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో ఆల్బర్ట్‌ ఎలాగైతే మరియా ఇంటికి వెళ్తాడో.. సెకండాఫ్‌లో మరో పాత్రధారి వెళ్తాడు. తొలుత ఆల్బర్ట్‌కు అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైందో తర్వాత వెళ్లిన వ్యక్తికీ అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఈ క్రమంలో చూసిందే మళ్లీ చూస్తున్నామా? అనే భావన కలుగుతుంది. పోలీసులు జెరోమ్‌ హత్య కేసును ఛేదించే విధానం కూడా పేలవంగా ఉంటుంది. క్లైమాక్స్‌ను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు (Merry Christmas Review). బ్యాక్‌ స్టోరీలు మినహా కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. ఒకప్పటి ముంబయి వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు.

ఎవరెలా చేశారంటే?: చాలా తక్కువ పాత్రలతో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌లకే స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువ. ఆల్బర్ట్‌గా రెండు విభిన్న కోణాల్లో విజయ్‌ సేతుపతి మెప్పిస్తారు. కత్రినా కైఫ్‌ ఓకే. డైలాగ్స్‌ లేకపోయినా బేబీ మహేశ్వరీ శర్మ అభినయంతో ఆకర్షిస్తుంది. రాధికా ఆప్టే అతిథిగా మెరుస్తుంది.  రాధికా శరత్‌ కుమార్‌ (తమిళ్‌ వెర్షన్‌) పోలీసు కానిస్టేబుల్‌ పాత్రకు న్యాయం చేశారు. ‘బద్లాపూర్‌’, ‘అంధాధున్‌’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌కు థ్రిల్లర్‌ స్టోరీలు చెప్పడంలో మంచి పేరుంది. ఇందులో మరియా పాత్రను కేంద్ర బిందువుగా చేసుకుని ‘క్రిస్మస్‌’కు తనదైన శైలిలో అర్థం చెప్పే ప్రయత్నం చేశారు (Merry Christmas movie review in telugu). 

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఇందులో అసభ్య పదజాలం, సన్నివేశాలు లేవు. ఎలాంటి సందేహం లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

  • బలాలు
  • + క్లైమాక్స్‌
  • + విజయ్‌ సేతుపతి నటన
  • బలహీనతలు
  • - ప్రథమార్ధం
  • కొన్ని సాగదీత సన్నివేశాలు
  • చివరిగా: ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం (Merry Christmas Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని