Miss Perfect: రివ్యూ: మిస్‌ పర్‌ఫెక్ట్‌.. లావణ్య త్రిపాఠి నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

అభిజీత్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన ఈ సిరీస్‌ రివ్యూ మీ కోసం..

Published : 03 Feb 2024 02:14 IST

Miss Perfect Web Series Review; వెబ్‌సిరీస్‌: మిస్‌ పర్‌ఫెక్ట్‌; నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజీత్‌, అభిజ్ఞ, హర్ష వర్ధన్‌, ఝాన్సీ, మహేశ్‌ విట్టా, హర్ష్‌ రోషన్‌ తదితరులు; మ్యూజిక్: ప్రశాంత్‌ ఆర్‌. విహారి; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల; సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి; నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; డైరెక్షన్‌: విశ్వక్‌ ఖండేరావ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహానంతరం ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ (Miss Perfect)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆమె, అభిజీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో విడుదలైంది. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ కథేంటి? ఎలా ఉందంటే? (Miss Perfect Web Series Review)..

ఇదీ కథ: లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) దిల్లీలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌. వర్క్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చి, శాంతి నిలయం అపార్ట్‌మెంట్‌లో గదిని అద్దెకు తీసుకుంటుంది. కొన్ని రోజులకే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో లావణ్య ఇంట్లో పనిచేసే జ్యోతి (అభిజ్ఞ) పనిలోకి రాదు. తాను రాలేనన్న విషయాన్ని పక్క పోర్షన్‌లో ఉండే రోహిత్‌ (అభిజీత్‌)కు చెప్పమనడంతో లావణ్య అతడి ఇంటికి వెళ్తుంది. అక్కడ అపరిశుభ్రతను చూసి తట్టుకోలేక వెంటనే ఆ హౌజ్‌ను క్లీన్‌ చేస్తుంది. ఈ క్రమంలో తెలియకుండానే లావణ్య, రోహిత్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ వ్యవహారమంతా పని మనిషి జ్యోతికి తెలియదు. తనను పని నుంచి తీసేయడంతో తన స్థానంలో వచ్చిన లక్ష్మి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ సీక్రెట్‌ని జ్యోతి ఎలా బయపెట్టింది?అసలు విషయం తెలిశాక రోహిత్‌ స్పందనేంటి? మనసిచ్చిన లక్ష్మినే కావాలనుకున్నాడా? అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడా? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: అతిశుభ్రతను, ఉసిరికాయ పచ్చడిని అమితంగా ఇష్టపడే ఓ అమ్మాయి. రొటీన్‌ జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కునే అబ్బాయి. వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ ఈ ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’. దానికి కొవిడ్‌ నేపథ్యాన్ని ముడిపెట్టారు. లాక్‌డౌన్‌ నాటి పరిస్థితులు, ఓసీడీ కాన్సెప్ట్‌పై ఇప్పటికే పలు చిత్రాలొచ్చాయి. అవి చూసిన వారికి ఇందులో కొత్తగా ఏం కనిపించదు. టైటిల్‌ను బట్టి హీరోయిన్‌ క్యారెక్టర్‌.. అన్నింటిలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుందని అర్థమవుతుంది. అది ఏ రేంజ్‌లో ఉంటుందనే సన్నివేశంతో సిరీస్‌ని ప్రారంభించారు. అది ప్రభావం చూపదు. సైకాలజిస్టుతో లావణ్య తన గురించి వివరించే సీన్‌ ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. కట్‌ చేస్తే, కథ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రిలీఫ్‌ కలుగుతుంది. శాంతి నిలయం వాతావరణం, సెక్యూరిటీ (మహేశ్‌ విట్టా) లావణ్య తండ్రి (హర్ష వర్ధన్‌), ఆయన ఇష్టపడిన రాజ్యలక్ష్మి (ఝాన్సీ), జ్యోతి, ఆమె సోదరుడు కార్తిక్‌ (హర్ష్‌ రోష్‌).. ఇలా కీలక పాత్రలు తెరపైకి వస్తాయి. లావణ్య.. రోహిత్‌కు పరిచయమవడం నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. లాక్‌డౌన్‌ కావడంతో జ్యోతి ఇంటికే పరిమితమవడం, రోజూ లావణ్యకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించడం, నచ్చకపోయినా ఆమె.. రోహిత్‌ ఇంటికెళ్లడం, శుభ్రం చేయడం, తర్వాత ఇద్దరూ మాటల్లో పడిపోవడం.. ఇలా సరదాగా సాగే స్టోరీలో జ్యోతి సింగర్‌ కావాలనే సీరియస్‌ అంశాన్ని జోడించడం ఆకట్టుకోదు. లాక్‌డౌన్‌ కాన్సెప్ట్‌తోనే మరింత ఫన్‌ జనరేట్‌ చేసి ఉంటే బాగుండేది. హర్షవర్ధన్‌, ఝాన్సీ లవ్‌ట్రాక్‌ కూడా బోర్‌ కొడుతుంది. తనను పనిలోంచి తీసేశాడని రోహిత్‌పై కోపంగా ఉండే జ్యోతి.. సోదరుడు కార్తిక్‌తో కలిసి లక్ష్మి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో మంచి నవ్వులు పంచుతారు. ముఖ్యంగా.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌నంటూ కార్తిక్‌ చేసే హంగామా ఆకట్టుకుంటుంది. (Miss Perfect Web Series Review).

ఇది పెద్ద మలుపులు ఉన్న స్టోరీ కాదు. ఎప్పటికైనా లక్ష్మి.. లావణ్య అనే నిజం బయటపడుతుందని ప్రేక్షకుడికి ముందే తెలుస్తుంది. రోహిత్‌ ఎలా స్పందించాడనేదే ఇక్కడ ఆసక్తికరం. ఆ రహస్యాన్ని రివీల్‌ చేసిన విధానం, హీరో రియాక్ట్‌ అయిన తీరు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ ఊహకు తగ్గట్లే ఉంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు. ఒక్కోదాని నిడివి 20 నిమిషాలపైనే ((Miss Perfect Web Series Review).

ఎవరెలా చేశారంటే?: లావణ్య/లక్ష్మిగా లావణ్య త్రిపాఠి నటన ‘పర్‌ఫెక్ట్‌’. రెండు షేడ్స్‌లో ఆకట్టుకుంటారు. రోహిత్‌ పాత్రకు అభిజీత్‌ సెట్‌ అయ్యారు. వీరితోపాటు అభిజ్ఞకు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువ ఉంది. గజ్వేల్‌ అమ్మాయిగా ఎంటర్‌టైన్‌ చేస్తారు. హర్ష్‌ రోషన్‌, మహేశ్‌ విట్టా కామెడీ గిలిగింతలు పెడుతుంది. హర్ష వర్ధన్‌, ఝాన్సీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నీషియన్ల విషయానికొస్తే.. ప్రశాంత్‌ ఆర్.విహారి నేపథ్య సంగీతంతో మ్యాజిక్‌ చేశారు. ఆదిత్య సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్‌ రవితేజ గిరిజాల సిరీస్‌ని ఇంకా ట్రిమ్‌ చేయాల్సి ఉంది. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం ఓకే. ఆయనకు ఇదే తొలి వెబ్‌సిరీస్‌. ‘స్కైలాబ్‌’ చిత్రంతో మెగాఫోన్‌ పట్టారు (Miss Perfect Web Series Review).

ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?: వెబ్‌సిరీస్‌ల విషయంలో చాలామందికి కలిగిన సందేహం ఇదే. కుటుంబంతో చూసేందుకు ఈ సిరీస్‌ ‘పర్‌ఫెక్ట్‌’ ఎంపిక. ఎలాంటి ట్విస్ట్‌లు, యాక్షన్‌, థ్రిల్‌ అంశాలు కాకుండా సరదాగా కాలక్షేపం చేయాలంటే ఈ సిరీస్‌ను ప్రయత్నించొచ్చు.

  • బ‌లాలు
  • + లావణ్య త్రిపాఠి నటన
  • + కామెడీ 
  • బ‌ల‌హీన‌త‌లు
  • - అక్కడక్కడ సాగదీత
  • - హర్షవర్ధన్‌, ఝాన్సీ పాత్రలను అవసరానికి మించి చూపించడం
  • చివ‌రిగా: ఈ ‘మిస్‌’ కొన్ని నవ్వులకే పర్‌ఫెక్ట్‌! (Miss Perfect Web Series Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని