My Name Is Shruthi Movie Review: రివ్యూ: ‘మై నేమ్ ఈజ్ శృతి’.. స్కిన్‌ మాఫియాను హన్సిక ఎలా ఎదుర్కొంది?

హన్సిక ప్రధానపాత్రలో నటించిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఎలా ఉందంటే..

Updated : 17 Nov 2023 10:32 IST

My Name Is Shruthi Review Telugu.చిత్రం: మై నేమ్ ఈజ్ శృతి,  నటీనటులు: హన్సిక, ముర‌ళీశ‌ర్మ, న‌రేన్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, ప్రవీణ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు ఛాయాగ్ర‌హ‌ణం: కిశోర్ బోయిడ‌పు, క‌ళా ద‌ర్శ‌క‌త్వం:  గోవింద్, సంగీతం: మార్క్ కె రాబిన్‌, కూర్పు: చోటా.కె.ప్రసాద్, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్,  సంస్థ‌:  వైష్ణ‌వి ఆర్ట్స్‌, విడుద‌ల‌: 17 న‌వంబ‌ర్ 2023

ఈ వారం నాయికా ప్ర‌ధాన‌మైన సినిమాలు రెండు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి... `మై నేమ్ ఈజ్ శృతి`.  తెలుగులో ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కుల‌తో క‌లిసి న‌టించిన హ‌న్సిక (Hansika). ఇందులో కీల‌క పాత్ర పోషించారు. ఆమె చాలా రోజుల త‌ర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. మ‌రి ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: శృతి (హ‌న్సిక‌) యాడ్ ఏజెన్సీలో ఉద్యోగి. చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోవ‌డంతో తాత, అమ్మ పెంప‌కంలో పెద్ద‌దవుతుంది. చరణ్ ( సాయి తేజ)తో ప్రేమలో ఉన్న ఆమె జీవితం అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఎమ్మెల్యే గురుమూర్తి  (న‌రేన్‌) ముఠా వ‌ల‌లో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో కీలకమైన గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ శృతికి తెలుస్తాయి (My Name Is Shruthi Review Telugu). ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేమిటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెన‌క ఎవ‌రున్నారు? ఎవరెవరు ఇందులో భాగం అయ్యారు?  ఈ ముఠాపై శృతి పోరాటం ఎలా సాగింద‌నేది తెర‌పై చూడాల్సిందే.
   
ఎలా ఉందంటే: మాన‌వ అవ‌యవాలతో వ్యాపారం నేప‌థ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కొద్దిమంది స్వార్థం కోసం అవ‌య‌వాల‌తో ఎలా వ్యాపారం చేస్తున్నారో, వాటి వెన‌క చీక‌టి కోణాన్ని స్పృశిస్తూ ఇదివ‌ర‌కు సినిమాల్ని రూపొందించారు. నేర నేప‌థ్యం, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ అంశాల మేళ‌వింపుగా రూపొందే క‌థ‌లే అవ‌న్నీ. `మై నేమ్ ఈజ్ శృతి` కూడా ఆ తాను ముక్కే. ఇందులో చ‌ర్మంతో కూడా వ్యాపారం చేస్తార‌నే కొత్త అంశాన్ని చూపించారు. అయితే దాని వెన‌క వ్య‌వ‌హారాన్ని లోతుగా, హృద్యంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. కానీ, ఆ అంశం చుట్టూ ఓ క్రైమ్ డ్రామాని మ‌లిచి థ్రిల్ పంచే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌న్నివేశాలు ద్వితీయార్ధంలోనే కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ప్ర‌థ‌మార్ధం మాత్రం సాదాసీదాగానే సాగిపోతుంది. ఆరంభంలోనే స్కిన్ గ్రాఫ్టింగ్ ప్ర‌స్తావ‌న‌తో క‌థ‌ని మొద‌లుపెట్టినా, ఆ త‌ర్వాత పాత్ర‌ల ప‌రిచ‌యానికీ, క‌థా నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించడానికే ఎక్కువ స‌న్నివేశాలు ప‌రిమితం అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సస్పెన్స్ అంశాలను ప్రశ్నలుగా వదులుతూ కథని ముందుకు నడిపించారు. ఏడాది త‌ర్వాత‌, ఆరు నెల‌ల ముందు అంటూ.. ముక్క‌లు ముక్క‌లుగా క‌థ‌ని చెప్ప‌డంతో ప్రేక్ష‌కుడు ఒక ప‌ట్టాన క‌థా ప్ర‌పంచంలో లీనం కాలేడు.

ద్వితీయార్ధం త‌ర్వాతే ఆ స‌న్నివేశాల‌కి ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది. చివ‌రి 20 నిమిషాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. ముఖ్యంగా మ‌లుపులు మెప్పిస్తాయి. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త ఆరంభం నుంచే క‌లిగేలా ఇలాంటి క‌థ‌ల్ని మ‌ల‌చాలి. ఆ బిగి చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగాలి. కానీ ఈ సినిమా విష‌యంలో అది క‌నిపించ‌దు. ఆరంభ స‌న్నివేశాల్లోనే బ‌లం లేదు. చివ‌ర్లో మ‌లుపులు ప‌ర్వాలేద‌నిపించినా, అవి కూడా లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. అత్యాధునికమైన టెక్నాల‌జీ యుగంలో క‌థానాయిక ప్ర‌ద‌ర్శించే ఆ మాత్రం తెలివి తేట‌ల్ని పోలీసులు క‌నుక్కోలేక‌పోతారా? అనే సందేహం వ‌స్తుంది. కానీ, ఉన్నంత‌లో ఆ స‌న్నివేశాలే మెప్పిస్తాయి. అమాయ‌కుల జీవితాల‌తో చెల‌గాట‌మాడే నేర నేప‌థ్యం ఈ క‌థకి ఉన్నా, ఆ స‌న్నివేశాల‌తో భావోద్వేగాల్ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌య్యాడు. ఏ స‌న్నివేశాలు కానీ, ఏ పాత్ర గానీ జాలి క‌లిగించ‌క‌పోవ‌డంతో సినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు (My Name Is Shruthi Review Telugu).

ఎవ‌రెలా చేశారంటే: శృతిగా హ‌న్సిక మోత్వాని మంచి న‌ట‌న‌నే ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌థ‌మార్ధంలో కుటుంబం, ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మ‌లుపుల‌తో కూడిన స‌న్నివేశాల్లోనూ ఆమె అభిన‌యం మెప్పిస్తుంది. పూజా రామ‌చంద్ర‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగించే యువ‌తిగా ఆమె పాత్ర‌లో ఒదిగిపోయింది. ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా అల‌రించిన ప్రేమ ఇందులో  వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపిస్తుంది. కానీ ఆ పాత్రలో బ‌లం లేదు. ప్రేమ‌కి పెద్ద‌గా న‌టించే ఆస్కారం దొర‌క‌లేదు. న‌రేన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు(My Name Is Shruthi Review). ముర‌ళీశ‌ర్మ‌, జయ‌ప్ర‌కాశ్, ప్రవీణ్  అల‌వాటైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. మార్క్ కె.రాబిన్ సంగీతం, కిశోర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు ఓ కొత్త అంశాన్ని స్పృశించినా, స్కిన్ మాఫియా గురించి మ‌రింత లోతుగా వెళ్ల‌లేక‌పోయారు. క‌థ‌ని కూడా ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.  

బ‌లాలు
+ హ‌న్సిక న‌ట‌న
+ ద్వితీయార్ధంలో మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు
- ప్ర‌థ‌మార్ధం
- కొర‌వ‌డిన భావోద్వేగాలు

చివ‌రిగా: మై నేమ్ ఈజ్ శృతి..  మలుపులు మెప్పిస్తాయి.(My Name Is Shruthi Review Telugu)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని