Naa Saami Ranga Review: రివ్యూ: ‘నా సామిరంగ’: నాగార్జున మాస్‌ జాతర ఎలా ఉందంటే..!

నాగార్జున మాస్‌ అవతార్‌లో కనిపించిన నా సామిరంగ ఎలా ఉందంటే!

Updated : 14 Jan 2024 14:12 IST

Naa Saami Ranga Review; చిత్రం: నా సామిరంగ, నటీనటులు: నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్, మిర్నా మేనన్, రుక్సర్‌ థిల్లాన్, షబ్బీర్‌ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్‌ రావు, మహేశ్‌ తదితరులు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ బిన్ని, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, విడుదల తేదీ: 14-01-2024

నాగార్జునకు (Nagarjuna) సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజన్‌. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’, వంటి విజయవంతమైన చిత్రాలన్నీ పండగ బరిలోనే ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈసారి ‘నా సామిరంగ’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయమవుతున్నారు. పాటలు, ప్రచార చిత్రాలు ఆదరణ దక్కించుకోవడంతో విడుదలకు ముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ ‘నా సామిరంగ’ కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది..?(naa saami ranga movie review)

కథేంటంటే: కిష్టయ్య (నాగార్జున) అనాథ. అంజి (అల్లరి నరేశ్‌) తల్లి అతడిని చేరదీస్తుంది. అప్పటి నుంచి వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరికీ ఊరి ప్రెసిడెంట్‌ పెద్దయ్య (నాజర్‌) అండగా నిలబడతాడు. కిష్టయ్య 12ఏళ్ల వయసులోనే వరాలు (ఆషికా రంగనాథ్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. చదువుల కోసం పట్టణానికి వెళ్లిపోయిన ఆమె.. 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది. (Naa Saami Ranga Review in telugu) తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య. సరిగ్గా అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేశ్‌) తన కూతుర్ని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్‌)కు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. అయితే.. వీళ్ల ప్రేమను అర్థం చేసుకొని పెద్దయ్య ఆ  సంబంధాన్ని వదులుకుంటాడు. కానీ, తన కూతుర్ని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు ససేమిరా అంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? అంజిపై దాసు పగ పెంచుకోవడానికి కారణమేంటి? ఈ కథలో భాస్కర్‌ (రాజ్‌తరుణ్‌) - కుమారి (రుక్సార్‌)ల ప్రేమకథతో ఏర్పడ్డ సంఘర్షణ ఏంటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే: ఇది విజయవంతమైన మలయాళ చిత్రానికి రీమేక్‌. కానీ, ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా.. కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా మలచడంలో రచయిత ప్రసన్న కుమార్‌, దర్శకుడు విజయ్‌ బిన్నీ విజయం సాధించారు. స్నేహం.. ప్రేమ.. విధేయత.. ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న కథ ఇది. నిజానికి ఈ తరహా సినిమాలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. కానీ, దీన్ని 1980ల నాటి కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేసి కొత్తదనం అద్దారు. అది ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతి పంచింది. మాస్‌ యాక్షన్‌ అంశాలు.. నాగార్జున సందడి.. అంజి, వరాలు పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రధాన పాత్రల చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. భాస్కర్‌ను కాపాడే క్రమంలో వచ్చే ఓ చక్కటి యాక్షన్‌ ఎపిసోడ్‌తో నాగ్‌ పరిచయ సన్నివేశం ఆకట్టుకుంటుంది. (Naa Saami Ranga Review) కిష్టయ్య - వరాలు ప్రేమకథను భాస్కర్‌కు అంజి చెప్పడంతో సినిమా రొమాంటిక్‌ టచ్‌తో మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. దాసు పాత్ర కథలోకి ప్రవేశించినప్పటి నుంచే సంఘర్షణ మొదలవుతుంది. ఓ అదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్‌తో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు బాగుంది. కిష్టయ్య - అంజిల హత్యకు దాసు ప్రణాళిక రచించడంతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్‌ కోణంలో పరుగులు తీస్తుందని అనిపించినా, కేవలం కిష్టయ్య పాత్రకు ఎలివేషన్‌లా చూపించారు. అంజిపై దాసు దాడి చేసే ఎపిసోడ్‌తోనే మళ్లీ కథలో పుంజుకుంటుంది. ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా భావోద్వేగభరితంగా మారుతుంది. ఇక క్లైమాక్స్‌లో నాగ్‌ యాక్షన్‌ హంగామా ఆయన అభిమానులకు కనులవిందుగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: గ్రామీణ నేపథ్యంలో సాగే కిష్టయ్య లాంటి పాత్రలు పోషించడం నాగార్జునకు కొట్టిన పిండి. అది మరోసారి తెరపై కనిపించింది. ఆ పాత్రలో నాగ్‌ కనిపించిన తీరు.. ఆయన గెటప్‌.. కోనసీమ యాసలో పలికిన సంభాషణలు.. అన్నీ ప్రేక్షకులతో ‘నా సామిరంగ’ అనిపించేట్లే ఉంటాయి. ఇంటర్వెల్‌ ఫైట్‌లో ఆయన శివ స్టైల్‌లో మరోసారి సైకిల్‌ చైన్‌ పట్టుకున్న తీరు.. తనపైకి దూసుకొస్తున్న ఆయుధాలతో బీడీలు వెలిగించిన విధానం.. అన్నీ మాస్‌ ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే మూమెంట్సే. అంజి పాత్రలో నరేశ్‌ ఒదిగిన తీరు బాగుంది. గాలి శీను తరహాలో ఆయనకు గుర్తుండిపోయే మరో పాత్రిది. వరాలుగా ఆషికా చాలా అందంగా కనిపించింది. అలాగే చక్కటి నటనను కనబరిచింది. ఆమెకు.. నాగ్‌కూ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. (Naa Saami Ranga Review) షబ్బీర్‌ విలనిజం బాగుంది. నాజర్, రాజ్‌తరుణ్, మిర్నా, రుక్సార్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఈ కథలో కొత్తదనం లేదు. అలాగే బలమైన సంఘర్షణ కనిపించదు. దర్శకుడిగా విజయ్‌కు ఇది తొలి చిత్రమైనా దీన్నొక చక్కటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా సిద్ధం చేయడంలో చాలా వరకు విజయవంతమయ్యాడు. నాగార్జునను ప్రేక్షకులు మెచ్చేలా చూపించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను డిజైన్‌ చేసిన విధానం బాగుంది. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. శివేంద్ర ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + నాగార్జున, అల్లరి నరేశ్‌ల నటన
  • + యాక్షన్‌ ఎపిసోడ్స్‌
  • + పాటలు
  • బలహీనతలు:
  • - కొత్తదనం లేని కథ
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: ఈ పండక్కి మాస్‌ ప్రేక్షకులకు ‘నా సామిరంగ’ (Naa Saami Ranga Review)
  • గమనిక: సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని