Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్ సర్
Nenu student sir review; బెల్లంకొండ గణేష్, అవంతిక జంటగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’మూవీ ఎలా ఉందంటే?
Nenu student sir review; చిత్రం: నేను స్టూడెంట్ సర్; నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్ తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్; ఛాయాగ్రహణం: అనిత్ మధాడి; కథ: కృష్ణచైతన్య; మాటలు: కల్యాణ్ చక్రవర్తి; దర్శకత్వం: రాకేష్ ఉప్పలపాటి; నిర్మాత: సతీష్ వర్మ; విడుదల తేదీ: 02-06-2023
‘స్వాతిముత్యం’ సినిమాతో తొలి అడుగులోనే హీరోగా మెప్పించారు బెల్లంకొండ గణేష్. రెండో ప్రయత్నంగా ‘నేను స్టూడెంట్ సర్’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. తేజ శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి తెరకెక్కించిన చిత్రమిది. ‘నాంది’ వంటి హిట్ సినిమాని ఇచ్చిన సతీష్ వర్మ నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ స్టూడెంట్ అందుకున్నాడా? ఈ సినిమాతో గణేష్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా?
కథేంటంటే: సుబ్బు అలియాస్ సుబ్బారావు (బెల్లంకొండ గణేష్) ఫోరెన్సిక్ స్టూడెంట్. వివేకానంద యూనివర్సిటీలో చదువుతుంటాడు. తనకు యాపిల్ ఐఫోన్ అంటే చచ్చేంత ఇష్టం. దాని కోసం రాత్రింబవళ్లూ కష్టపడి.. రూ:90వేలు పోగేసి ఐఫోన్ 12సిరీస్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు పెట్టుకొని సొంత తమ్ముడిలా చూసుకుంటుంటాడు. ఓ రోజు కాలేజీలో జరిగిన విద్యార్థుల అల్లర్ల విషయంలో అందరితో పాటు సుబ్బును కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. ఆ సమయంలో వారు విద్యార్థులందరి నుంచి ఫోన్లు రికవరీ చేసుకుంటారు. ఆ తర్వాత తన ఫోన్ తిరిగి తీసుకునేందుకు స్టేషన్‌కు వెళ్లగా.. సుబ్బుకు ఫోన్ దొరకదు. దాన్ని స్టేషన్‌లోని పోలీసులే కొట్టేశారని అనుమానించిన సుబ్బు.. వారిపై కేసు పెట్టేందుకు పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్ (సముద్రఖని) వద్దకు వెళ్తాడు. కానీ, వాసుదేవన్ ఆ ఫిర్యాదు తీసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో.. తన ఫోన్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు మరో పథకం వేస్తాడు సుబ్బు. ఆ కమిషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్ (అవంతిక దస్సాని)కు దగ్గరై తన ఫోన్‌ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకుంటాడు సుబ్బు. అదే సమయంలో తన బ్యాంక్ ఖాతాకు రూ1.75కోట్లు జమవుతాయి. మరి సుబ్బును హత్య కేసులో ఇరికించిందెవరు? తన ఫోన్ పోవడానికి కమిషనర్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్ తిరిగి దొరికిందా? లేదా? శ్రుతితో అతని ప్రేమకథ ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: ట్రైలర్‌లో చూపించినట్లు ఇది పూర్తిగా ఐఫోన్ చుట్టూనే తిరిగే కథ మాత్రమే కాదు. ఇందులో ఆసక్తిరేకెత్తించే ఓ క్రైమ్ కోణం ఉంది. అన్ క్లయిమ్డ్ బ్యాంకు ఖాతాల మాటున జరిగే ఓ కుంభకోణాన్ని దీంట్లో టచ్ చేశారు. అలాగే నకిలీ ఐడీ ప్రూఫ్స్ సృష్టించి సామాన్యుల్ని కొన్ని ముఠాలు ఎలా బురిడీ కొట్టిస్తున్నాయన్నది చూపించారు. అయితే ఈ అంశాలన్నింటినీ ఒకదానితో ఒకటి చక్కగా ముడిపెట్టి ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడి అనుభవం సరిపోలేదు. ప్రథమార్ధమంతా సాగతీత వ్యవహారమే. విరామానికి ముందు కానీ అసలు కథ మొదలుకాదు. దీనికి ముందు వచ్చే హీరో పరిచయ సన్నివేశాలు.. అతని ఐఫోన్ చుట్టూ నడిపిన కథనం సహనానికి పరీక్ష పెడతాయి. ఓ మధ్య తరగతి కుర్రాడు.. తన ఐఫోన్ కోసం ప్రాణాలకు తెగించి కమిషనర్‌కు ఎదురెళ్లడం.. దాని కోసం అతని కూతుర్ని ప్రేమలో దింపాలని ప్రయత్నించడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. అలాగని నాయకానాయికల లవ్ ట్రాక్‌లోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు. కథానాయిక పాత్రను తీర్చిదిద్దిన తీరు ‘ప్రతిరోజూ పండగే’లోని ఏంజెల్ ఆర్నా పాత్రను గుర్తు చేస్తుంది. మధ్యలో కాలేజీ స్టూడెంట్స్ కమిషనర్‌ను ఎటాక్ చేసే ఎపిసోడ్ ఆసక్తిరేకెత్తిస్తుంది. విరామానికి ముందు హీరో కమిషనర్ గన్‌ను అడ్డం పెట్టుకొని తన ఫోన్‌ను రాబట్టాలని ప్రయత్నించడం.. అదే సమయంలో దాని వల్ల అతను ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. హత్య కేసును నుంచి బయట పడేందుకు సుబ్బు ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. అయితే కథలోని అసలు క్రైమ్ చుట్టూ అల్లుకున్న చిక్కుముడులను ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోలేదు దర్శకుడు. అన్ క్లయిమ్డ్ బ్యాంకు ఖాతాల వెనుక జరిగే స్కామ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. హీరో దాన్ని అడ్డం పెట్టుకొనే అసలు నేరస్థుల్ని పట్టుకొనే తీరు బాగుంటుంది. అయితే ముగింపు అంత సంతృప్తికరంగా అనిపించదు.
ఎవరెలా చేశారంటే: మధ్యతరగతి కుర్రాడిగా సుబ్బు పాత్రలో గణేష్ సెటిల్డ్‌గా నటించాడు. అయితే చాలా సన్నివేశాల్ని సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తోనే నెట్టుకొచ్చేశాడనిపిస్తుంది. శ్రుతి పాత్రలో అవంతికా అందంగా కనిపించింది. కానీ, నటన పరంగా ప్రతిభ చూపించే ఆస్కారం మాత్రం దొరకలేదు. సముద్రఖని పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు సినిమా మొత్తం ఈ పాత్ర కేంద్రంగానే తిరుగుతుందనిపిస్తుంది. నిజానికి ఆ పాత్రకు తెరపై ఆశించిన స్థాయి ప్రాధాన్యత దొరకలేదు. జబర్దస్త్ రాంప్రసాద్‌కు కొత్త తరహా పాత్ర దొరికింది కానీ.. నటన పరంగా ఏమాత్రం స్కోప్ దొరకలేదు. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్‌దీప్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. కృష్ణచైతన్య రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. చక్కటి స్క్రీన్‌ప్లేతో దాన్ని తీర్చిదిద్దుకోవడంలో పూర్తిగా తడబడ్డారు. దీనిపై దర్శకుడు రాకేష్ కూడా దృష్టి పెట్టనట్లనిపిస్తుంది. మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
- బలాలు
- + కథా నేపథ్యం
- + సముద్రఖని నటన
- + ద్వితీయార్ధంలోని మలుపులు
- బలహీనతలు
- - స్క్రీన్‌ప్లే
- - ప్రథమార్ధం
- చివరిగా: అక్కడక్కడా మెప్పించే స్టూడెంట్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’