Rajamouli: రాజమౌళితో నెట్‌ఫ్లిక్స్‌ బిగ్‌ ప్లాన్‌?

ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli) కేవలం పేరు కాదు. అదొక బ్రాండ్‌. ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేశారు.

Published : 12 Jul 2022 15:41 IST

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli) కేవలం పేరు కాదు. అదొక బ్రాండ్‌. ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. తాజాగా ‘ఆర్ఆర్‌ఆర్‌’తో మరోసారి రూ.1000 కోట్ల క్లబ్‌తో తానేంటో నిరూపించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రాజమౌళితో కలిసి పనిచేయాలని భావిస్తోందట. ఇందులో భాగంగా ఓ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ విషయమై రాజమౌళిని సంప్రదించగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. దీనిపై ఇటు రాజమౌళి బృందం, అటు నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ అధికారికంగా స్పందించలేదు.

గతంలో ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించింది. అయితే, కొన్ని రోజులకే ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో మేకింగ్‌ లేదని.. ఆ మొత్తం స్క్రిప్ట్, తెరకెక్కించిన సన్నివేశాలను పక్కన పెట్టేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్‌ నిపుణులు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళిని నెట్‌ఫ్లిక్స్‌ సంప్రదించిందన్న వార్తలతో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. మరి అన్నీ కుదిరితే రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్‌ ఏంటి?ఏ కథతో ముందుకొస్తారు? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరోవైపు మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం కథ, కథనాలపై కసరత్తులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈలోపు రాజమౌళి కొన్ని రోజులు నెట్‌ప్లిక్స్‌ ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని