Tollywood: ‘ఆర్సీ 15’, ‘ఎన్బీకే 107’, ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’.. తెరపైకి కొత్త టైటిళ్లు?

‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ, ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేశ్‌బాబు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తర్వాత రామ్‌చరణ్‌ ఏ సినిమాలో నటిస్తున్నారనే.......

Published : 28 May 2022 11:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ, ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేశ్‌బాబు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తర్వాత రామ్‌చరణ్‌ ఏ సినిమాలో నటిస్తున్నారనే విషయం ఎప్పుడో తెలిసింది. వాటికి సంబంధించి.. దర్శకుడు, సంగీత దర్శకుడు, కథానాయిక వివరాలు తెలిసినా టైటిల్‌ ఏంటో చెప్పకుండా ఆయా చిత్ర బృందాలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. సరైన సయమంలో వాటిని ప్రకటించేందుకు వేచిచూస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఇదే టైటిల్‌’ అంటూ ఇప్పటికే ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో పేరు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టగా.. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయమై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడేదాకా ఎదురుచూడాల్సిందే. అసలు తాజాగా తెరపైకొచ్చిన ఆ ఆసక్తికర టైటిళ్లు ఏంటంటే?

ఆర్సీ 15

రామ్‌చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఆర్సీ 15’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు. రాజకీయ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘సర్కారోడు’ అనే పేరు పెట్టారని గతంలో వినిపించింది. ఇప్పుడు ‘అధికారి’ అనే టైటిల్‌ తెరపైకొచ్చింది.

ఎన్బీకే 107

‘ఎన్బీకే 107’ వర్కింగ్‌ టైటిల్‌తో బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అన్నగారు’ అనే పేరు పెట్టినట్టు ఇటీవల వినిపించింది. కానీ, ‘జై బాలయ్య’ అనే పేరుకే చిత్ర బృందం పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది.

ఎస్‌ఎస్‌ఎంబీ 28

దర్శకుడు త్రివిక్రమ్‌- కథానాయకుడు మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మూడో చిత్రం ఇటీవల పట్టాలెక్కింది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రానికీ తమనే సంగీత దర్శకుడు. హారికా అండ్‌ హాసిని బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. ఈ ప్రాజెక్టుకు ‘పార్థు’ అనే పేరు దాదాపు ఖరారైనట్టు టాక్‌ వినిపించగా ఇప్పుడు ‘అర్జునుడు’ అనే టైటిల్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని