ఈ భూమ్మీద క్రూరమైన ప్రదేశమది: మునిగిపోయిన టైటానిక్‌ దగ్గరకు 33 సార్లు వెళ్లిన జేమ్స్‌ కామెరూన్‌

James Cameron: టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతం గురించి లెజెండరీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదొక ప్రమాదకరమైన ప్రాంతంగా అభివర్ణించారు.

Updated : 23 Jun 2023 07:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron). పరిచయం అక్కర్లేని పేరు. ‘అవతార్‌’, ‘అవతార్2’ సహా ఎన్నో భారీ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఆయన తీసిన చిత్రాల్లో ‘టైటానిక్‌’ (Titanic) ఎవర్‌గ్రీన్‌. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ ప్రమాదానికి గురై ఎలా సముద్రగర్భంలో కలిసిపోయిందో భావోద్వేగభరితంగా చూపించారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్‌ సముద్రంలో మునిగిపోయిన ‘టైటానిక్‌’ షిప్‌ ప్రాంతాన్ని (Titanic wreckage site) ఇప్పటివరకూ 33సార్లు సందర్శించారు. 13వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు.

సముద్రగర్భంలో ఆచూకీ లభించకుండా పోయిన టైటాన్‌ (Titan Submarine) కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్‌’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన సందర్భంగా ఆ సాహసయాత్ర అనుభూతిని గతంలో జేమ్స్‌ కామెరూన్‌ పంచుకున్నారు. ‘ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది ఒకటి’ అని టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు జేమ్స్‌ కామెరూన్‌. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే తనకెంతో ఆసక్తి అని, అందుకే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. అంతేకాదు సముద్రగర్భం ఇతివృత్తంగా ‘ఎక్స్‌పెడిషన్‌: బిస్‌మర్క్‌’, ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ ది అబేస్‌ అండ్‌ ఏలియన్స్‌ ఆఫ్‌ ది డీప్‌’ డ్యాకుమెంటరీల చిత్రాలను తీశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న ‘టైటానిక్‌’ మూవీ తీయడం వెనుక ఉన్న ఆసక్తికర నిజాన్ని కూడా జేమ్స్‌ కామెరూన్‌ చెప్పుకొచ్చారు. ‘‘ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న ఆకాంక్షతోనే ‘టైటానిక్‌’ తెరకెక్కించా. అంతేకానీ ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ కారణంతోనే సబ్‌మెరైన్‌లో సముద్ర గర్భంలో ప్రయాణించా. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి పెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్‌ ఎవరెస్ట్‌లాంటిది. ఒక డైవర్‌గా దాన్ని మరింత బాగా చూపించాలనుకున్నా. అందుకే చాలాసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించాను. ఇక సినిమా నిర్మాణాన్ని నేను సాహసయాత్రగా భావిస్తాను. ఇలాంటి సినిమాల నిర్మాణాల కోసం నిరంతరం కృషిచేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇక నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ కోసం కామెరూన్‌ ఎవరూ చేయని సాహసం చేశారు. ప్రపచంలోనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం పసిఫిక్‌ సముద్రంలోని మెరైనా ట్రెంచ్‌ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లారు. ‘ఈ ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతానికి నేను వెళ్లాను. అప్పుడు ఈ గ్రహంపై నేనొక్కడే ఉన్నానా? అనిపించింది. అక్కడ మనుషులెవరూ ఉండరు. ఏదైనా జరిగితే రక్షించేవారే అసలే ఉండరు’’ అని ఆ అనుభూతిని పంచుకున్నారు. జేమ్స్‌ కామెరూన్‌ 1995లో తొలిసారి ఓ రష్యన్‌ సబ్‌మెరైన్‌లో ప్రయాణించి టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. ప్రస్తుతం మునిగిపోయిన టైటాన్‌ గురించి కామెరూన్‌ ఎక్కడా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని