Pulimada Review telugu: రివ్యూ: పులిమడ.. మలయాళం థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Pulimada Movie Review In Telugu: జోజు జార్జ్‌, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్‌ ‘పులిమడ’ ఎలా ఉందంటే?

Published : 23 Nov 2023 15:29 IST

Pulimada movie review in telugu: చిత్రం: పులిమడ; నటీనటులు: జోజు జార్జ్‌, ఐశ్వర్యరాజేశ్‌, చంబన్‌ వినోద్‌ జోసే, లిజోమోల్‌ జోసే, జాఫర్‌, జానీ ఆంటోనీ, చంద్ర మేనన్‌ తదితరులు; సంగీతం: ఇషాన్‌ దేవ్‌(పాటలు), అనిల్‌ జాన్సన్‌ (నేపథ్యం); సినిమాటోగ్రఫీ: వేణు; ఎడిటింగ్‌: ఏకే సజన్‌; నిర్మాత: రాజేష్‌ దామోదరన్‌, సిజో వడక్కన్‌; రచన, దర్శకత్వం: ఏకే సజన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

క భాషలో విజయవంతమైన సినిమాలను ఓటీటీ వేదికలు ఇతర భాషల్లోనూ అనువదించి ప్రేక్షకులను అందిస్తున్నాయి. అలా ఈ వారం కాస్త ఆసక్తి రేపిన చిత్రం ‘పులిమడ’ (pulimada). థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందడం, జోజూ జార్జ్‌, ఐశ్వర్యరాజేష్‌లు కలిసి నటించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈసినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

కథేంటంటే: విన్సెంట్‌ (జోజు జార్జ్‌) సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. 40 ఏళ్లు వయసు వచ్చినా వివాహం కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో కారణంతో చెడిపోతూ ఉంటాయి. ఎట్టకేలకు ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని, నిశ్చితార్థం చేసుకుంటాడు. అయితే, వివాహం జరిగే రోజున ఆ అమ్మాయి వేరొకరితో వెళ్లిపోతుంది. దీంతో విన్సెంట్‌ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతాడు. అదే రోజున విన్సెంట్‌ ఉండే అటవీ ప్రాంతంలో ఓ పులి సంచరిస్తూ ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తారు. వివాహం ఆగిపోయిన కోపంతో ఎవరో ఒక అమ్మాయితో ఆ రాత్రి గడపాలని విన్సెంట్ నిశ్చయించుకుని తిరుగుతున్న క్రమంలో మాహిష్మతి జార్జ్‌ (ఐశ్వర్య రాజేష్‌) కనపడుతుంది. కారు ఆగిపోవడంతో అడవి మధ్యలో సాయం కోసం చూస్తుంటుంది. తాగిన మైకంలో అక్కడకు వచ్చిన విన్సెంట్‌ సాయం చేస్తానని చెప్పి, మాహిష్మతిని ఇంటికి తీసుకెళ్తాడు. ఆమెపై అత్యాచారానికి యత్నిస్తాడు. అయితే, తాగిన మందు దిగిన తర్వాత లేచి చూసేసరికి మాహిష్మతి హత్యకు గురై ఉంటుంది. (pulimada review in telugu) దీంతో విన్సెంట్‌ భయపడిపోతాడు. మరి మాహిష్మతి ఎలా చనిపోయింది? అందుకు కారణం ఎవరు? ఈ కేసు నుంచి విన్సెంట్‌ ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: మలయాళ చిత్రాలు అనగానే మంచి కథ, కథనాలు ఉన్న సబ్జెక్ట్‌లే గుర్తుకు వస్తాయి. చిన్న చిన్న ఎలిమెంట్స్‌తో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లర్‌లు అలరిస్తాయి. ఈ విషయంలో ‘పులిమడ’ ఆమడ దూరంలోనే ఆగిపోయింది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ పక్కన పడితే అసలు కథ, కథనాలే ఈ సినిమాకు ప్రధానలోపం. చాలా చిన్న సబ్జెక్ట్‌ను తీసుకుని దాన్ని గంటా 45 నిమిషాల సినిమాగా తీయడంలో దర్శకుడు ఏకే సజన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. విన్సెంట్‌ పెళ్లి చూపుల హడావిడితో సినిమా మొదలవుతుంది. ఊరి చివరి అతని ఇల్లు, పెళ్లి కోసం సిద్ధమవడం, బంధువుల హంగామాతో ఆరంభ సన్నివేశాలు చకచకా నడుస్తూ ఉంటాయి. మరోవైపు పులి ఊళ్లోకి వచ్చిందన్న వార్తతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కథానాయకుడు పెళ్లి జరుగుతుండగా పులి వల్ల ఏదైనా సమస్య వస్తుందా? అని ఉత్కంఠగా సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి నిరాశే ఎదురువుతుంది. ఇంతలోనే వధువు వేరొకరితో వెళ్లిపోవడం, తీవ్ర మనస్థాపానికి గురైన విన్సెంట్‌ కోపంతో గంజాయి, మద్యం తాగుతూ పెళ్లికి వచ్చిన బంధువులపై విరుచుకుపడే సన్నివేశాలు చాలా బోరింగ్‌ ఉంటాయి.

ఇవన్నీ ఒకవైపు సాగుతూనే మరోవైపు అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మద్యం మత్తులో ఉన్న విన్సెంట్‌ అమ్మాయి కోసం బండి తీసుకుని ఊళ్లో తిరుగుతుండటంతో కథానాయకుడికి పులి ఎదురవుతుందేమోనని ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో మాహిష్మతి జార్జ్‌ కనపడుతుంది ఆమెను లొంగదీసుకోవాలని తన ఇంటికి తీసుకెళ్లడంతో కథ ఆసక్తికర మలుపు తిరిగిందనిపిస్తుంది. కానీ, అందుకు భిన్నంగా మాహిష్మతి హత్యకు గురవడంతో ఒక రొటీన్‌ క్రైమ్‌ కథగా మారుతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి ‘పులి’ పేరుతో చేసిన హడావుడిని చూసి, ఏదో జరుగుతుందని అనుకుంటే, ఆ పులి విన్సెంట్‌ ముందుకు అలా వచ్చి ఓ పది సెకన్లు కనిపించి వెళ్లిపోతుంది. ఆ పులి ఎందుకు వచ్చిందో..? విన్సెంట్‌ను ఏమీ చేయకుండా ఎందుకు వెళ్లిపోయిందో..? ప్రేక్షకుడికి అర్థం కాదు. చివరిలో వచ్చే ట్విస్ట్‌ కొత్తగా ఏమీ అనిపించదు. సినిమా అంతా చూసిన తర్వాత కథానాయకుడు విన్సెంట్‌కు వివాహం కాకపోవడంతో కారణం తరచి చూస్తే నవ్వు వస్తుంది. విన్సెంట్‌ ఇంటి బయట బాత్రూమ్‌ ఉంటుంది. (pulimada review in telugu) ఇంట్లో బాత్రూమ్‌ కట్టమని పెళ్లికూతురు అడిగితే ‘మా నాన్న వద్దన్నారు. నాకూ ఇష్టం లేదు’ అంటాడు. క్లైమాక్స్‌ ఇంట్లో బాత్రూమ్‌ ఉన్నట్లు చూపిస్తారు. అంటే విన్సెంట్ వివాహానికి వాస్తు దోషం కారణమా? అని నవ్వుకోకతప్పదు. అంతదానికి మధ్యలో పులి హడావుడి ఎందుకో దర్శకుడికే తెలియాలి. ఇంతకీ ‘పులిమడ’అంటే అర్థం ఏంటో తెలుసా? ‘పులి ఉండే ప్రదేశం’

ఎవరెలా చేశారంటే: జోజు జార్జ్‌ ఎంచుకునే కథలు, చిత్రాల్లో కాస్త వైవిధ్యం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ‘ఇరాట్ట’తో ఆయన మరింత దగ్గరయ్యారు. మరి అలాంటి నటుడు ‘పులిమడ’ ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. నటనపరంగా ఆయనకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. పెళ్లి చెడిపోయినప్పుడు ఆయన పలికించే హవభావాలు, కోపం, అసహనం అన్నీ కళ్లతో పలికించారు. ఇక కథల ఎంపిక విషయంలోనూ ఐశ్వర్య రాజేష్‌ది ప్రత్యేకశైలి. మరి ఈ కథను ఏం విని ఒప్పుకొన్నారో ఆమెకే తెలియాలి. ఒకరకంగా సినిమా సగం అయిపోయిన తర్వాత కానీ ఆమె పాత్ర కనిపించదు. మిగిలిన నటీనటులు ఎవరూ తెలుగు వాళ్లకు తెలియదు. (pulimada review in telugu) సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాను కాస్త నిలబెట్టాయి. రచన, ఎడిటింగ్‌ అన్నీ దర్శకుడు ఏకే సజన్‌ చూసుకున్నారు. కానీ, కథ, కథనాలతో ఏమాత్రం మెప్పించలేకపోయారు.

ఫ్యామిలీతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అయితే, ఇదేదో  థ్రిల్లర్‌ మూవీ అనుకుని మాత్రం ‘పులిమడ’ చూస్తామంటే నిరాశ తప్పదు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • + నటీనటులు
  • బలహీనతలు
  • - కథ, కథనాలు
  • - దర్శకత్వం
  • - థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ లేకపోవడం
  • చివరిగా : ‘పులిమడ’.. అటు పులి ఇటు థ్రిల్‌ లేని గడబిడ...(Pulimada review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష  సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని