చిత్రసీమలో నాకు గాడ్‌ ఫాదరెవరూ లేరు!

బాలీవుడ్‌ కథానాయకుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ రావ్‌ ‘లవ్‌ అండ్‌ సెక్స్ ఔర్ దోఖా’ ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌’, ‘స్త్రీ’ ‘లవ్‌ సోనియా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పిచారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది, ఎఫ్‌టీఐఐలో నటనలో శిక్షణ తీసుకొని ఎటువంటి నేపథ్యంలో లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

Published : 07 Mar 2021 01:19 IST

న్యూదిల్లీ: బాలీవుడ్‌ కథానాయకుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ రావ్‌ ‘లవ్‌ అండ్‌ సెక్స్ ఔర్ దోఖా’ ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌’, ‘స్త్రీ’ ‘లవ్‌ సోనియా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది, ఎఫ్‌టీఐఐలో నటనలో శిక్షణ తీసుకొని ఎటువంటి నేపథ్యంలో లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అలాంటి రాజ్‌కుమార్‌ రావ్‌ ఈరోజు బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. హన్సల్‌ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ‘షాహిద్‌’ చిత్రంలో లాయర్‌గా నటించి, ఆ పాత్రకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘రూహి’ చిత్రంలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. మార్చి 11న విడుదల కానుంది.

తాజాగా ఆయన తన సినీ జీవితం గురించి మాట్లాడుతూ..‘‘నా సినీ ప్రయాణం ఇలా సాగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఎలాంటి సినిమా నేపథ్యంగా లేకుండా ఇక్కడి వరకూ వచ్చా. ఇక్కడ నాకు గాడ్‌ఫాదర్‌ అంటూ ఎవరూ లేరు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చా. వచ్చేటప్పుడు చాలా తక్కువ డబ్బులు తెచ్చుకున్నా. ఇదంతా ఓ కలలా జరిగింది. కానీ, దీని గురించి కూర్చొని ఆలోచించలేదు. విభిన్నమైన పాత్రల్లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాత్రలు వస్తున్నంత కాలం ఇంకా రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తా. ముఖ్యంగా నేను చేసే వృత్తిని ప్రేమిస్తా. దాని కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడను. గత సినిమాల కంటే భిన్నంగా చేయాలని మాత్రమే ఆలోచిస్తుంటా’’

‘‘హార్రర్‌ చిత్రాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉన్నాయి. వాటిలో గత ఏడాదిలో అక్షయ్‌ నటించిన ‘లక్ష్మి’ చిత్రం ఒకటి. ఈ ఏడాదిలో తెరపైకి రానున్న ‘అతిథి భూతో భవ’, ‘ఫోన్‌ బూత్‌’, ‘బూత్‌ పోలీస్‌’, ‘భూల్‌ భులయ్యా2’ వంటి చిత్రాలు బాక్సాఫీసు దగ్గర రాణిస్తాయని నమ్ముతున్నా. భారతీయ చిత్రసీమ ప్రతిష్ఠను మరింత పెంచేలా చిత్రాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు అనుగుణంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. థియేటర్లకు వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంతైనా థియేటర్లో సినిమా చూస్తే వచ్చే అనుభూతే వేరు. ఇలాంటి ఆనందం మరెక్కడా లభించదని’’ తెలిపారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావ్ ‘బదాయి దో’ అనే చిత్రం చేస్తున్నారు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్ కథానాయికగా నటిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని