Adipurush: బుల్లితెరపై మరోసారి రామాయణం సీరియల్‌.. ‘ఆదిపురుష్‌’ ఎఫెక్టేనా..!

రామాయణం అనగానే గుర్తొచ్చేది రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్‌. ఇప్పుడు ఈ ధారావాహిక మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Updated : 28 Jun 2023 18:19 IST

హైదరాబాద్‌: ‘ఆదిపురుష్‌’..  ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఇందులోని డైలాగులు, పాత్రల వేషధారణలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని సినిమా తీయాలనుకునే ముందు దాని ఆధారంగా రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్‌ను ఓసారి చూడాల్సిందంటూ ఎంతోమంది కామెంట్స్‌ చేశారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సీరియల్‌ ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 

‘ఆదిపురుష్‌’ (Adipurush) విడుదల తర్వాత ఆ సినిమాలోని పాత్రలను రామాయణం సీరియల్‌లోని పాత్రలతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ ధారావాహికను మరోసారి టెలికాస్ట్‌ చేయాలని కోరుతూ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో షెమారూ టీవీ ఛానల్‌ ఓ నిర్ణయం తీసుకుంది. జులై 3 నుంచి రామాయణం సీరియల్‌ను రీ టెలికాస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్లు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. అయితే తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌ ఈ పోస్ట్‌ను తొలగించింది.

రామాయణం సీరియల్‌ రీ టెలికాస్ట్‌ అవ్వడం ఇది రెండో సారి కావడం విశేషం. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ ప్రసారమయ్యేది. ఆ తర్వాత కొవిడ్‌ సమయంలో ఇది రీ టెలికాస్ట్‌ అయింది. 2020లో మార్చి 28 నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రసారమైంది. అప్పుడు ఏకంగా దీన్ని 7.7కోట్ల మంది వీక్షించారు. ఇక ఈ సీరియల్‌ ప్రేక్షకాదరణతో పాటు ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటిసారి ప్రసారమైనప్పుడే అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. మరి ‘ఆదిపురుష్‌’ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణంలో రాముడిగా అరుణ్ గోవిల్ (Arun Govil) - సీతగా దీపికా చిక్లియా నటించారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో సునీల్‌ లహ్రీ (Sunil Lahri) తన నటనతో అందరినీ ఆకర్షించారు. ఇక తాజాగా ఓంరౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్‌’లో రాముడిగా ప్రభాస్‌ (Prabhas) సీతగా కృతిసనన్‌ కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాపై రామాయణం సీరియల్‌ నటులంతా ఆసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని