Rashmika: రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!

రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం..

Updated : 05 Apr 2024 11:04 IST

‘కిర్రాక్ పార్టీ’తో ఇండస్ట్రీలోకి వచ్చి ‘ఛలో’తో టాలీవుడ్‌కు హలో చెప్పింది రష్మిక (Rashmika Mandanna). ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సవాళ్లతో కూడిన పాత్రల్లోనైనా అలవోకగా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రనైనా.. ‘యానిమల్’లో గీతాంజలి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పించే ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా ఆమె సొంతం చేసుకున్న కొన్ని ఘనతలను చూద్దాం..

అక్కడ వేడుకలకు హాజరైన తొలి సెలబ్రిటీ..

ఇటీవల టోక్యోలో జరిగిన క్రంచీ రోల్‌ అనిమే అవార్డులకు రష్మిక హాజరైంది. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చూపించారు. దీంతో పాటు మరో అరుదైన ఘనత కూడా ఆమె సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం. దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు.

ఆ బ్రాండ్‌ అడ్వకేట్‌గా ఎంపికైన తొలి భారతీయురాలు..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన ఒనిట్సుకా టైగర్‌ ఫ్యాషన్‌ సంస్థకు ‘బ్రాండ్‌ అడ్వకేట్‌’గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్‌ భారతీయురాలు తానేనని స్వయంగా వెల్లడించి ఆనందం వ్యక్తం చేసింది. గతేడాది నిర్వహించిన ‘మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌’లోనూ ఈ సుందరి హోయలొలికించింది.

ఫోర్బ్స్ లిస్టులో అగ్ర స్థానం..

ఈ ఏడాది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది. దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది.

ఆ అవార్డులకు ఇండియా నుంచి ఏకైక నటి..

తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల అరుదైన ఘనతను సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఇండియా నుంచి మన రష్మిక మందన్న నిలిచింది.

సోషల్ మీడియాలోనూ సరిలేని రికార్డు..

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్‌ దక్కించుకుంది.

ఇక మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది రష్మిక. ఇప్పటి వరకు ఇదే జాబితాలో ఆమె తొమ్మిది సార్లు అవార్డు అందుకుంది. మరికొన్ని నెలల్లో ‘పుష్ప2’తో మరోసారి మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమైన రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని