Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్‌’ ఎలా ఉందంటే?

Published : 15 Mar 2024 08:47 IST

Razakar Movie Review in telugu; చిత్రం: ర‌జాకార్‌; న‌టీన‌టులు:  బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి; నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి; ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌; విడుద‌ల తేదీ: 15-03-2024

తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన సినిమా ‘ర‌జాకార్‌’. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమాలో తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? (Razakar Movie Review) అందులో వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా?

క‌థేంటంటే: భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా హైద‌రాబాద్ సంస్థానం మాత్రం నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మ‌క‌రంద్ దేశ్ పాండే) ఏలుబ‌డిలో ఉన్న రోజుల‌వి. దేశంలోని అన్ని రాజ్యాల‌ను.. సంస్థానాల‌ను భార‌త్‌లో విలీనం చేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. కానీ, నిజాం ప్ర‌భువు మాత్రం అందుకు స‌సేమిరా అంటాడు. త‌మ ద‌గ్గ‌రున్న ర‌జాకార్లు అనే ప్రైవేటు సైన్యం స‌హ‌కారంతో హైద‌రాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే దేశంగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటాడు. దీనికోసం ర‌జాకార్ల చీఫ్ ఖాసిం రిజ్వీ (రాజ్ అర్జున్‌).. అప్ప‌టి నిజాం ప్ర‌ధాని లాయ‌క్ అలీ ఖాన్ (జాన్ విజ‌య్‌) ఓ పెద్ద కుట్ర‌కు తెర‌లేపుతారు.  త‌మ రాజ్యంలోని హిందువుల‌ను బ‌ల‌వంతంగా మ‌త‌మార్పిడులు చేయించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఉర్దూని అధికార భాష‌గా ప్ర‌క‌టిస్తూ.. తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠి త‌దిత‌ర భాష‌ల‌పై నిషేధం విధిస్తారు. అలాగే ఇష్టారీతిన చిత్ర‌విచిత్ర‌మైన ప‌న్నులు విధిస్తూ ప్ర‌జ‌ల్ని దారుణంగా హింసిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారికి ఎదురు తిరిగిన ఎన్నో ఊళ్లలో దారుణ మార‌ణ హోమం సృష్టిస్తారు. అయితే అప్ప‌టి భార‌త హోంమంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్ (రాజ్ స‌ప్రు) నిజాం దురాగ‌తాలు తెలుసుకుని హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో విలీనం చేసేందుకు పోలీస్ చ‌ర్య‌కు సిద్ధ‌ప‌డ‌తారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  నిజాం ప్ర‌భువు నుంచి స్వాతంత్ర్యం సాధించే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌జ‌లు ఎలాంటి పోరాటం చేశారు? వాళ్ల‌ను అణ‌గ‌దొక్కేందుకు ర‌జాకార్లు ఎలాంటి అకృత్యాల‌కు పాల్ప‌డ్డారు? (Razakar Movie Review) భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోలీస్ చ‌ర్య ఫ‌లితాన్నిచ్చిందా?లేదా? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే:  ప్ర‌పంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ఎంతో ప్ర‌త్యేక స్థానం ఉంది. అప్ప‌ట్లో నిజాం ప‌రిపాల‌న‌లో హైద‌రాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచ‌కాలు, అకృత్యాలు జ‌రిగాయి.. గ్రామాల్లో ర‌జాకార్లు ఎంత‌టి దురాగ‌తాల‌కు  పాల్ప‌డ్డారు.. వారిని ఎదిరించి పోరాడే క్ర‌మంలో ప్ర‌జ‌లే సాయుధులై క‌ద‌న రంగంలోకి దూకిన తీరు.. ఈ క్ర‌మంలో వీర‌మ‌ర‌ణం పొందిన వేలాది యోధుల క‌థ‌లు.. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇప్ప‌టికీ స‌జీవం. చరిత్ర పుట‌ల్లో దాగిన ఆ నెత్తుటి క‌థ‌ల్నే ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు యాట‌ స‌త్య‌నారాయ‌ణ‌. టైటిల్ కార్డ్స్‌తో తెలంగాణ చ‌రిత్ర‌ను ప‌రిచ‌యం చేసి.. స్వాతంత్ర్యానంత‌రం దేశంలోని ప‌రిస్థితుల్ని.. అప్ప‌టి హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం ప‌రిపాల‌న‌ను చూపిస్తూ నేరుగా అస‌లు క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఇక అక్క‌డి నుంచి ర‌జాకార్ల దుశ్చ‌ర్య‌ల‌ను ఒక్కొక్కటిగా ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆస‌క్తిక‌రంగా ముందుకు న‌డిపించారు. అప్ప‌ట్లో త‌బ్లిగ్ ఫ‌ర్మానా పేరుతో ర‌జాకార్లు ప్ర‌జ‌ల్ని బ‌ల‌వంతంగా మ‌త‌మార్పిడి చేయించిన తీరు.. తెలుగు భాష మాట్లాడుతున్నార‌న్న అక్క‌సుతో బ‌డుల్లో పిల్ల‌ల‌పై వారు చేసిన దారుణాలు.. ఊళ్లలో మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల‌పై ర‌జాకార్లు, వాళ్ల ప్ర‌తినిధుల అఘాయిత్యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తూ ప్ర‌థమార్ధం సాగుతుంది. అయితే దీంట్లో ప్ర‌త్యేకంగా హీరోలంటూ ఎవ‌రూ క‌నిపించ‌రు. ఎందుకంటే ప్ర‌తి ప‌ది ప‌దిహేను నిమిషాల‌కు ఒక‌సారి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర తెర‌పైకి వ‌చ్చి త‌న‌దైన పోరాట స్ఫూర్తిని చూపించి మాయ‌మ‌వుతుంటుంది. ఇవ‌న్నీ తెలంగాణ సాయుధ పోరాట చ‌రిత్రలో ఉన్న వీరగాథ‌లే. (Razakar Movie Review) అయితే అవ‌న్నీ తెలిసిన క‌థ‌లే అయినా తెర‌పై చూసిన‌ప్పుడు రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్ల‌లో ర‌జాకార్ల అకృత్యాలు చూస్తున్నప్పుడు వాళ్లు క‌నిపిస్తే నిజంగా మ‌న‌మే తిర‌గ‌బ‌డాల‌న్నంత ఆవేశం క‌లిగించేలా ఉంటాయి.

పథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే బైరాన్‌ప‌ల్లె వాసుల సాయుధ పోరాటం.. ప‌ర‌కాల జెండా ఉద్య‌మం.. ఈశ్వ‌ర‌య్య-గండ‌య్య గ్యాంగ్ నిజాం ప్ర‌భువుపై చేసే బాంబ్ ఎటాక్ ఎపిసోడ్‌.. అన్నీ ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ప్ర‌థమార్ధ‌మంతా తెర వెనుక ఉండి చ‌ర్చ‌లు జ‌రుపుతూ కూర్చున్న‌ట్లు ఉన్న స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్ పాత్ర ప్రీక్లైమాక్స్‌లో తెర‌పైకి వ‌చ్చి నిజాం రాజ్యంలోకి అడుగుపెట్ట‌డంతో  క‌థ‌కు ఊపొస్తుంది. ఈ క్ర‌మంలో ఖాసీం రిజ్వీకి ప‌టేల్ ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ హైలైట్‌. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. కానీ, ఆ ఎపిసోడ్‌ను మ‌రీ అంత ఆస‌క్తిక‌రంగా చూపించ‌లేక‌పోయార‌నిపిస్తుంది. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర ఎంతో కీల‌కం. కానీ, సినిమాలో మాత్రం భార‌త సైన్యం రంగంలోకి దిగ‌గానే వాళ్లు ఉద్య‌మం నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొన్న‌ట్లు చూపించారు. అదంత స‌హేతుకంగా అనిపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: ఈ సినిమాలో ప్ర‌త్యేకంగా ఫ‌లానా పాత్రే కీల‌కం అని చెప్ప‌డానికేం లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, కాసిం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోవ‌డ‌మే కాదు.. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా కాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప‌లికిన తీరు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ త‌ను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు.(Razakar Movie Review) టెక్నిక‌ల్‌గా ఈ సినిమాకి మంచి మార్కులే ప‌డ‌తాయి. 1947-48నాటి తెలంగాణ వాతావర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌డంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప‌డిన క‌ష్టం తెర‌పై ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది.  అలాగే ఈ విష‌యంలో గ్రాఫిక్స్ వ‌ర్క్ కూడా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. బ‌తుక‌మ్మ పాటతో పాటు ప్ర‌థమార్ధంలో వ‌చ్చే మ‌రో గీతం స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది. నేప‌థ్య సంగీతం క‌థ‌కు బ‌లాన్నిచ్చింది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + క‌థ‌, స్ర్కీన్‌ప్లే
  • + ప్ర‌ధాన తారాగ‌ణం న‌ట‌న‌
  • + చ‌రిత్ర‌లోని ఘ‌ట‌న‌ల్ని ఆవిష్కరించిన తీరు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - తెలిసిన క‌థ కావ‌డం..
  • - మితిమీరిన హింస‌
  • చివ‌రిగా: నాటి పోరాటానికి అద్భుత తెరరూపం ‘ర‌జాకార్‌’ (Razakar Movie Review)
  • చివరిగా: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని