Salaar: ‘కేజీయఫ్‌’ బాటలోనే ‘సలార్‌’.. నీల్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఒకటి కాదు రెండు!

Salaar: ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ టీజర్‌ విడుదలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది.

Updated : 06 Jul 2023 10:11 IST

భారీ పంచ్‌డైలాగ్‌లు లేవు.. నటీనటులను అందరినీ చూపించలేదు.. కానీ, 1 నిమిషం 46 సెకన్ల  పాటు సాగిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ టీజర్‌తో ‘సలార్‌’పై (Salaar teaser)  అంచనాలను పెంచేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel). ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పృథ్వీరాజ్‌ సుకుమార్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ‘సలార్‌ రెండు భాగాలుగా రానుందా’ అని గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి టీజర్‌ ద్వారా స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ (Salaar Part 1: Ceasefire) అని పేర్కొంటూ సెప్టెంబరు 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ‘పార్ట్‌-2’ కూడా ఉంటుందని ప్రభాస్‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

‘కేజీయఫ్‌’ బాటలోనే..

అప్పట్లో ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌’ అంటూ ఒక్క డైలాగ్‌తో ‘కేజీయఫ్‌2’ (KGF2) ట్రైలర్‌ విడుదల చేసి, పార్ట్‌-1ను మించి సీక్వెల్‌  ఉంటుందన్న అంచనాలను రెట్టింపు చేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. మూవీ విడుదలైన తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ‘సలార్‌’కు కూడా ఒక సింపుల్‌ ఇంగ్లీష్‌ డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ..’ (Salaar teaser)అంటూ ప్రభాస్‌ను ఎలివేట్‌ చేస్తూ అన్ని భాషలకూ కలిపి విడుదల చేసిన సింగిల్‌ టీజర్‌ సినిమాపై మంచి హైప్‌ తీసుకొచ్చింది. ఇక ‘కేజీయఫ్‌’ సినిమా ఆసాంతం గోల్డ్‌ మైన్స్‌లో సాగుతుండగా, ‘సలార్‌’ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుందని టాక్‌. ఆ సినిమాలో మాదిరిగానే ఇది కూడా డార్క్‌ థీమ్‌లో చిత్రీకరించడం విశేషం.  ‘కేజీయఫ్‌’లో లేచిన దుమ్ముకే బాక్సాఫీస్‌ల్లో కాసులు పండగా.., ‘సలార్’లో దుమ్ముకు రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇందులోనూ విలన్స్‌కు కొదవలేదా?

‘సింహం.. పులి.. చిరుత.. ఏనుగు చాలా ప్రమాదకరం..’ ఇది ‘సలార్‌’ (Salaar) టీజర్‌లో టీనూ ఆనంద్‌ చెప్పే డైలాగ్‌.  దీనిని బట్టి చూస్తే సినిమాలో ప్రతినాయకులు ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ‘కేజీయఫ్‌’లోనూ ఒకరికి మించి ఒకరు ప్రతినాయకులు ఉన్నారు. దాదాపు ప్రతి పాత్ర నెగెటివ్‌ షేడ్‌లోనే సాగుతుంది. రెండో పార్ట్‌లో ఏకంగా అధీర పాత్రలో సంజయ్‌దత్‌ను తీసుకొచ్చారు. ‘సలార్‌’లోనూ అదే మాస్టర్‌ ప్లాన్‌ను ప్రశాంత్‌ నీల్‌ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే వరదరాజ మన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, రాజ మన్నార్‌ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. శ్రియారెడ్డి పాత్ర ఏంటనేది సస్పెన్స్‌. పార్ట్‌-1కు సంబంధించి వీళ్లు ఖాయం. మరి రెండో భాగంలోనూ వీళ్లు కొనసాగుతారా? లేదా? అధీర పాత్రలా మరో బలమైన క్యారెక్టర్‌ ఉంటుందా? అన్నది ఆసక్తికరం. మరి డైలాగ్‌లో చెప్పినట్లు ‘సలార్‌’లో ఉండే ఆ సింహం.. పులి.. చిరుత.. ఏనుగు ఎవరనేది   తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌..

‘సలార్‌’ (Salaar) ప్రకటించినప్పటి నుంచి సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అది ఈ మూవీ ‘కేజీయఫ్‌’కు కొనసాగింపుగా ఉంటుందా? లేదా? ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వస్తుందా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ‘చదరంగం ఆటలో అందరినీ దాటుకొని రాజును వేసేస్తే ఆట ముగుస్తుంది. పావుల్ని మళ్లీ జోడిస్తే, కొత్త ఆట మొదలు.. అదే నీతి, అవే నియమాలు.. కొత్త రాజు.. ఇక్కడ తలలు శాశ్వతం కాదు.. కిరీటాలు శాశ్వతం’ అని రాఖీ ఒక డైలాగ్‌ చెబుతాడు. ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆట అదే.. నియమాలు అవే.. అప్పుడు రాజు స్థానంలో రాఖీ ఉంటే, ఇప్పుడు ప్రభాస్‌ వస్తున్నాడు. పైగా ఆ సినిమాకు, ‘సలార్‌’(Salaar2)కూ కొన్ని సారూప్యతలు కూడా కనపడుతున్నాయి. డార్క్‌ థీమ్‌లో సాగడం.. ‘కేజీయఫ్‌2’లోని ఒక పాత్ర మెడలో ఉన్న లాకెట్‌లాంటిదే ప్రభాస్‌ మెడలోనూ ఉండటం.. ఇది కూడా రెండు భాగాలుగా వస్తుండటం.. ‘కేజీయఫ్‌’లో రాఖీ షిప్‌ మునిగిపోయిన సమయం తెల్లవారుజామున 5.12 గంటలు.. అదే సమయానికి ‘సలార్‌’ టీజర్‌ను విడుదల చేయటం... ఇవన్నీ సినిమాకు కొనసాగింపా? నీల్‌ సినిమాటిక్‌ యూనివర్సా? అన్న ప్రశ్నలు సగటు ప్రేక్షకుడిని తొలిచేస్తున్నాయి.

ప్రతీకార కథ కాదు కదా!

‘సలార్‌’ గురించి సామాజిక మాధ్యమాల వేదికగా మరో కథ ప్రచారంలో ఉంది. దీన్నొక ప్రతీకార కథతో తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. కొన ఊపిరితో ఉన్న స్నేహితుడికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కథానాయకుడు ఏం చేశాడు? ఎలాంటి వారిని ఎదుర్కొన్నాడు? వంటి ఆసక్తికర కథాంశాలతో ‘సలార్‌’ను తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. అంటే ‘కేజీయఫ్‌2’లో అంతర్లీనంగా ‘సలార్‌’ పాత్ర దాగి ఉంటుందా?తొలుత అధీరాను ఎదిరించిన ‘ఫర్మాన్‌’ స్నేహితుడే ‘సలార్’గా కనిపిస్తాడా?లేక ‘ఉగ్రం’(కన్నడ)కు నేపథ్యాన్ని మార్చి చూపించబోతున్నారా?ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ప్రశాంత్‌ నీల్‌ ఏం చెప్పబోతున్నారో చూడాలి. పైగా దీని తర్వాత ఎన్టీఆర్‌తో నీల్‌ ఒక సినిమా చేయాలి? అది కూడా డార్క్‌ థీమ్‌. అంటే ఇది ఇప్పట్లో ముగిసే విషయం కాదు.

ఈసారి పార్ట్‌-2 త్వరగా వస్తుందా?

‘కేజీయఫ్1’ వచ్చిన తర్వాత ‘కేజీయఫ్‌2’ (KGF2) రావడానికి దాదాపు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ‘సలార్‌’ కూడా రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ సెప్టెంబరు 28న విడుదల కానుంది.  మరి పార్ట్‌-2 ఎప్పుడా? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ‘కేజీయఫ్‌2’ కు ప్రధాన అడ్డంకి కరోనా. ఆ కారణంగా షూటింగ్‌ చాలా రోజులు జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ప్రభాస్‌ సినిమాలు వరుసగా ఉన్నాయి. ఇప్పటికే ‘పార్ట్‌-2’కు సంబంధించిన చాలా సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. రామోజీఫిల్మ్‌ సిటీలో దాదాపు 14 సెట్స్‌ వేసి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తొలి భాగానికి వచ్చిన స్పందన బట్టి స్క్రిప్ట్‌లో స్వల్ప మార్పులతో ‘సలార్‌2’ ఉండవచ్చు. అన్నీ కుదరితే 2024లో ‘సలార్‌2’ (Salaar2) వచ్చేస్తుంది. ఎందుకంటే ‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ (Prabhas) ఓ మాట చెప్పారు. ‘ఏడాది రెండు సినిమాలు అభిమానులకు ఇవ్వాలనుకుంటున్నా. కుదిరితే మూడు కూడా ఇస్తా. వేదికలపై తక్కువ మాట్లాడి సినిమాలు ఎక్కువ చేస్తా’ అన్నారు. అంటే వచ్చే ఏడాది ‘ప్రాజెక్ట్‌-కె’ ఎలాగూ విడుదలవుతుంది. దీంతో పాటు ‘సలార్‌-2’ ఖాయమనే సంకేతాలను ప్రభాస్‌ అప్పుడే ఇచ్చేశారు. ఆదిపురుష్ నెగెటివ్ టాక్‌తో సతమతమవుతున్న ప్రభాస్ అభిమానులకు సలార్ టీజర్ కాస్త ఊరట. ప్రభాస్ ను కూడా పూర్తిగా చూపించి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఏదేమైనా ‘ఆదిపురుష్‌’ గాయాలకు ‘సలార్‌’ మందు వేస్తుందా? కాలమే సమాధానం చెబుతుంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని