Sammathame: కథల్ని అలా చెప్పడమూ ఓ పద్ధతే!

‘‘మనందరిలోనూ సున్నితమైన భావోద్వేగాలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటా. చల్లగాలికి బైక్‌ మీద వెళితే ఎంత ఆహ్లాదరకంగా ఉంటుందో... అలాంటి సినిమాల్ని తీయడమే నాకిష్టం’’ అన్నారు యువ దర్శకుడు గోపీనాథ్‌ రెడ్ఢి ‘సమ్మతమే’ చిత్రంతో పరిచయమైన దర్శకుడీయన.

Updated : 29 Jun 2022 09:24 IST

‘‘మనందరిలోనూ సున్నితమైన భావోద్వేగాలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటా. చల్లగాలికి బైక్‌ మీద వెళితే ఎంత ఆహ్లాదరకంగా ఉంటుందో... అలాంటి సినిమాల్ని తీయడమే నాకిష్టం’’ అన్నారు యువ దర్శకుడు గోపీనాథ్‌ రెడ్ఢి ‘సమ్మతమే’ (Sammathame) చిత్రంతో పరిచయమైన దర్శకుడీయన. కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన ఆ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గోపీనాథ్‌ రెడ్డి(Gopinath Reddy) మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మన సినిమాల కథలు ఎక్కువగా డబ్బు, హత్యలు, కుట్రల చుట్టూనే తిరుగుతుంటాయి. దానికి భిన్నంగా సినిమా తీయాలనుకునే సున్నితమైన భావోద్వేగాలతో ఈ కథ రాసుకున్నా. యువతరం మా సినిమాని చూస్తారనుకున్నా. వాళ్లతోపాటుగా కుటుంబ ప్రేక్షకులూ చూస్తుండడం ఆశ్చర్యం కలిగించింది’’.

‘‘సినిమాని మలుపులు లేకుండా తీశారనే మాట వినిపించింది. నా దృష్టిలో ఓ కథని అలా చెప్పడమూ ఓ పద్ధతే. కథని ముందుకూ, వెనక్కి తిప్పుతూ చెబితే ప్రేక్షకుడు కథానాయకుడి పాత్రతో కనెక్ట్‌ కాలేడు. ఈ కథకి అతని భావోద్వేగాలే కీలకం కాబట్టి నేననుకున్న తరహాలోనే కథ చెప్ఫా ఈ చిత్రానికి నిర్మాత మా అమ్మే. మేం అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువే అయ్యింది. అయినా మేం పెట్టిన ప్రతీ రూపాయి తిరిగొచ్చింది. ఇకపై నేను దర్శకుడిగా ఏ సినిమా చేసినా, నిర్మాణంలోనూ మా పెట్టుబడి ఉంటుంది’’.

‘‘కిరణ్‌ అబ్బవరం(Kiran) నాకు సోదరుడితో సమానం. తను బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచీ మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. తనలోనూ రచయిత ఉన్నా మా ఇద్దరి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. దాన్ని ఒకరినొకరు గౌరవించుకుంటాం కాబట్టి రచన పరంగా ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. తదుపరి చిత్రం కోసం కథలు సిద్ధం చేసుకున్నా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని