Sarkaaru Noukari Movie Review: రివ్యూ: సర్కారు నౌకరి.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది?

Sarkaaru Noukari Movie Review; గాయని సునీత తనయుడు ఆకాశ్‌ గోపరాజు, భావన జంటగా నటించిన ‘సర్కారు నౌకరి’ మూవీ మెప్పించిందా?

Updated : 01 Jan 2024 10:33 IST

Sarkaaru Noukari Movie Review; చిత్రం: సర్కారు నౌకరి; నటీనటులు: ఆకాశ్‌ గోపరాజు, భావన, తనికెళ్ల భరణి, మధులత, మహదేవ్‌, సాయి శ్రీనివాస్‌ తదితరులు; సంగీతం: శాండిల్య బొబ్బిలి, సురేశ్‌బొబ్బిలి(నేపథ్య సంగీతం); ఎడిటింగ్‌: రాఘవేంద్ర వర్మ; నిర్మాత: కె.రాఘవేంద్రరావు; సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్‌; బ్యానర్‌:ఆర్‌.కె. టెలిషో ప్రై.లి.; విడుదల: 01-01-2024

కొత్త ఏడాది తెలుగు చిత్ర‌సీమ ఓ నూతన హీరో సినిమాతో ప్రారంభ‌మైంది. ఆ చిత్రమే గాయ‌ని సునీత త‌న‌యుడు ఆకాశ్‌ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న స‌ర్కారు నౌక‌రి. ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు నిర్మించిన చిత్రం కావ‌డం.. ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టంతో ఈ సినిమాపై కాస్త అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ చిత్ర క‌థేంటి? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి అందించింది? తెలుసుకుందాం ప‌దండి..

క‌థేంటంటే:  మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన కుర్రాడు గోపాల్ (ఆకాశ్‌ గోప‌రాజు). అతడికి త‌ల్లిదండ్రులు లేరు. క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న సొంత మండ‌లానికి హెల్త్ ప్ర‌మోట‌ర్‌గా వ‌స్తాడు. ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. ఊరూరా తిరిగి కండోమ్‌లు పంచ‌డం అత‌ని ప‌ని. త‌న ఫ్రెండ్ స‌హాయంతో పెద్ద‌ల్ని ఒప్పించి స‌త్య (భావ‌న‌)ను పెళ్లి చేసుకుంటాడు. ఆరంభంలో త‌న భ‌ర్త‌ది స‌ర్కారు నౌక‌రి అని స‌త్య ఎంతో పొంగిపోతుంది.  కానీ, ఆ త‌ర్వాత అత‌ను చేసే ప‌ని తెలిసి అస‌హ్యించుకోవ‌డం మొద‌లు పెడుతుంది. కండోమ్‌లు పంచుతున్న గోపాల్‌ను ఊరి వాళ్లంతా ర‌క‌ర‌కాలుగా హేళ‌న చేయ‌డ‌మే కాక.. వాళ్ల కుటుంబాన్ని అంట‌రాని వాళ్లుగా చూడ‌ట‌మే దీనికి కార‌ణం. దీంతో ఆ అవ‌మానాలు త‌ట్టుకోలేక భ‌ర్త‌ను ఆ ఉద్యోగం మానేయ‌మ‌ని పోరు పెడుతుంది. కానీ, దానికి గోపాల్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో స‌త్య పుట్టింటికి వెళ్లిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  త‌న ఉద్యోగం కోసం గోపాల్ భార్య‌ను కూడా ఎందుకు కాద‌నుకున్నాడు? ఊరి వాళ్లు హేళ‌న చేస్తున్నా హెల్త్ వ‌ర్క‌ర్‌గానే ఎందుకు ప‌ని చేయాల‌నుకున్నాడు? ఎయిడ్స్‌ను నియంత్రించేందుకు అత‌నెలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు?  ఈ క్ర‌మంలో ఎదుర్కొన్న స‌వాళ్లేంటి? అస‌ల‌త‌ని గ‌త‌మేంటి? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా సాగిందంటే:  కొల్లాపూర్‌లో 1996లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌ల్ని ఆధారంగా చేసుకొని ద‌ర్శ‌కుడు ఈ క‌థ సిద్ధం చేసుకున్నాడు. అప్ప‌ట్లో ఎయిడ్స్ మ‌హ‌మ్మారి విస్తృతంగా ఉండేది. బతుకు దెరువు కోసం విదేశాల‌కు వెళ్లిన వాళ్ల‌లో చాలా మంది పెద్ద రోగంపై అవ‌గాహ‌న లేక దాని బారిన ప‌డి.. మృత్యువాత ప‌డ్డారు. ఇక మ‌రోవైపు గ్రామాల్లో ఎయిడ్స్ వ్యాధితో మ‌ర‌ణించిన కుటుంబాల్ని వెలివేయ‌డం,  వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించే హెల్త్ వ‌ర్క‌ర్ల‌ను చిన్న చూపు చూడ‌టం బాగా క‌నిపించేది. ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ స‌ర్కారు నౌక‌రీలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. నిజానికి ఇలాంటి క‌థ‌తో ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు థియేట‌ర్‌లో కూర్చోబెట్టాలంటే దాన్ని షుగ‌ర్ కోటింగ్ వేసి.. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే స‌ర్కారు నౌక‌రిలో క‌నిపించ‌దు. ఫ‌లితంగానే తెర‌పై సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడికి ఇదొక ఆర్ట్ ఫిల్మ్‌లా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున తీసిన ఎయిడ్స్ ప్ర‌చార చిత్రంలా తోస్తుంది.  గోపాల్ పెళ్లి ఎపిసోడ్‌తో ఈ సినిమా ఆస‌క్తిక‌రంగానే మొద‌ల‌వుతుంది. అత‌ను ఊళ్లలో ఏర్పాటు చేసిన డ‌బ్బాల్లో కండోమ్‌లు వేయ‌డం.. ఈ క్ర‌మంలో అధికారులు, ఊరి వాళ్ల నుంచి త‌ను ఎదుర్కొనే స‌మ‌స్య‌లు.. అవేంటో తెలియ‌క పిల్ల‌లు వాటిని బుడ‌గ‌ల్లా చేసుకొని ఆడుకోవ‌డం వంటి స‌న్నివేశాలు న‌వ్వులు పంచుతాయి.  స‌త్య‌కు త‌న భ‌ర్త చేసే ప‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి క‌థ‌లో సంఘర్షణ మొద‌ల‌వుతుంది (Sarkaaru Noukari review in telugu).

ద్వితీయార్ధానికి వ‌చ్చే స‌రికి సినిమాలో నాట‌కీయ‌త మ‌రింత ఎక్కువ‌వుతుంది. కొల్లాపూర్‌లో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువై వ‌రుస మ‌ర‌ణాలు సంభవించ‌డం.. ఈక్ర‌మంలో గోపాల్ త‌న మిత్రుడ్ని కూడా కోల్పోవ‌డం.. దీంతో ఏదేమైనా దీనిపై ప్ర‌జ‌ల్లో ఎలాగైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని న‌డుం బిగించ‌డం..  మ‌రోవైపు తన భార్య‌కు దూర‌మై అత‌ను ప‌డే వేద‌న ఇలా సినిమా అంతా భావోద్వేగ‌భ‌రితంగా సాగుతుంది. ఇక గోపాల్ గ‌తం.. ప‌తాక స‌న్నివేశాల్లో అత‌ను చెప్పే సంభాష‌ణ‌లు కాస్త మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటాయి(Sarkaaru Noukari movie review). అయితే ఈ క‌థ‌న‌మంతా పాత చిత్రాల త‌ర‌హాలో మ‌రీ మెలోడ్రామాలా సాగ‌డం.. ముగింపు ఊహ‌ల‌కు అందే విధంగా ఉండ‌టం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు.

ఎవ‌రెలా చేశారంటే:  ప‌ల్లెటూరి కుర్రాడిగా గోపాల్ పాత్ర‌లో చాలా స‌హ‌జంగా క‌నిపించాడు. ఆద్యంతం భావోద్వేగ‌భ‌రిత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. స‌త్య పాత్ర‌లో భావ‌న చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఊరి స‌ర్పంచ్ పాత్ర‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి న‌టించారు. కానీ, ఆయ‌న అనుభ‌వాన్ని ద‌ర్శ‌కుడు స‌రిగా ఉప‌యోగించుకోలేక‌పోయారు. ఆ పాత్ర‌ను ఏదో అలంకార ప్రాయంగా మార్చేసుకున్నారు. బ‌ల‌గం సుధాక‌ర్ రెడ్డి, సాహితి దాస‌రి, మ‌హ‌దేవ్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ ఈత‌రానికి పెద్ద‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చు. అయితే ఆయ‌న త‌ను అనుకున్న క‌థను నిజాయితీగా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. దానికి కాస్త వినోదం.. క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి ఉంటే ఫ‌లితం వేరుగా ఉండేది. 90ల వాతావ‌ర‌ణాన్ని చ‌క్క‌గా తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌లిగాడు. పాట‌లు పెద్దగా ఆకట్టుకోవు. నేప‌థ్య సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

బ‌లాలు:

+ క‌థా నేప‌థ్యం
+ అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే కొన్ని ఫ‌న్నీ సీన్స్‌
+ క‌థ‌లోని భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు:
- క‌థని న‌డిపించిన‌ తీరు..
- ప్ర‌ధ‌మార్ధంలో కొన్ని సన్నివేశాలు, ముగింపు

చివ‌రిగా: స‌ర్కారు నౌక‌రి.. ప్ర‌య‌త్నం మెప్పించేదే కానీ అల‌రించేది కాదు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని