Save The Tigers Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌

save the tigers web series review: డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 27 Apr 2023 17:02 IST

Save The Tigers Review; వెబ్‌సిరీస్‌: సేవ్‌ ది టైగర్స్‌; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు; సంగీతం: అజయ్‌ అర్సద; సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్‌; ఎడిటింగ్‌: శ్రవణ్‌ కాతికనేని; నిర్మాతలు: మహి.వి.రాఘవ, చిన్నా వాసుదేవరెడ్డి; క్రియేటర్స్‌: మహి.వి.రాఘవ, ప్రదీప్‌ అద్వైతం; దర్శకత్వం: తేజ కాకుమాను; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

సినిమాలకు దీటుగా వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటిని కూడా వివిధ జానర్ల వారీగా దర్శక-నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. అయితే, వచ్చిన సమస్యల్లా వాటికి సెన్సార్‌ ఉండకపోవడమే. దీంతో ఇంటిల్లీపాదీ కూర్చొని చూసి ఆస్వాదించాల్సిన సిరీస్‌లు యువతకు మాత్రమే పరిమితమైపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ అలరించేలా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లు తక్కువే. అలాంటి పరిస్థితుల్లో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’. ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సినిమాలను తీసిన దర్శకుడు మహి.వి.రాఘవ, ప్రదీప్‌ మాడుగుల కలిసి దీనిని రూపొందించారు. మరి ఈ సిరీస్‌ యువతతో పాటు ఫ్యామిలీని కూడా మెప్పిస్తుందా?(save the tigers web series review) ఇంతకీ ఈ ‘సేవ్‌ ది టైగర్స్‌’ దేని గురించి?

కథేంటంటే: ఇది ముగ్గురు భార్యా బాధితుల కథ. గంటా రవి (ప్రియదర్శి), రాహుల్‌ (అభినవ్‌ గోమటం), విక్రమ్‌ (చైతన్య కృష్ణ)లు మద్యం సేవించి కారు నడుపుకొంటూ వచ్చి పోలీసులకు పట్టుబడతారు. కోర్టులో జరిమానా కట్టి కారు తీసుకెళ్లాల్సిందిగా సీఐ (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) వారికి చెబుతాడు. కోర్టుకు వెళ్తే, మందు తాగిన విషయం భార్యకు తెలుస్తుందని విక్రమ్‌ భయపడుతుంటాడు. ఆ సీఐ కూడా భార్య అంటే భయపడే వ్యక్తి అని తెలియడంతో తాము కూడా అలాంటి వాళ్లమేనని తమ కథ చెప్పడం మొదలు పెడతారు. గంటా రవి బోరబండలో పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య హైమవతి (సుజాత)కు బస్తీలో ఉండటం ఇష్టం ఉండదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. రైట‌ర్ కావాల‌నే ఆలోచ‌న‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటాడు రాహుల్ (అభిన‌వ్ గోమ‌టం). రచయితగా ఏ ప్రయత్నమూ చేయకుండా సమయం వృథా చేస్తుంటాడు. అయితే, ప్రేమించిన కారణంగా వైద్యురాలైన అతడి భార్య మాధురి (పావ‌ని గంగిరెడ్డి) అన్నింటినీ భరిస్తుంది. (save the tigers web series review) విక్రమ్‌ (చైత‌న్య కృష్ణ) ఓ యాడ్ ఏజెన్సీలో ప‌నిచేస్తుంటాడు. భార్య రేఖ (దేవ‌యాని) లాయర్‌. భ‌ర్త చేసే ప్రతి ప‌నిలో త‌ప్పుల్ని వెతుకుతుంటుంది. మరోవైపు ఆఫీస్‌లోనూ బాస్‌ రామ్మోహ‌న్ (హర్షవర్థన్‌) ఒత్తిడి వల్ల విక్రమ్‌ తీవ్ర ఇబ్బందులు పడుతుంటాడు. ఈ ముగ్గురు అసలు స్నేహితులుగా ఎలా మారారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? భార్యల వల్ల వీరు ఇబ్బందులు పడ్డారా? లేక వీరి వల్లే వాళ్ల భార్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయా?  వీరి మందు తాగి పోలీసులకు ఎందుకు పట్టుబడాల్సి వచ్చింది? తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: భార్య-భర్తల గొడవలు, గిల్లికజ్జాలు, ఒకరిపై ఒకరు ఫన్నీగా ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. సహజంగా హాస్యాన్ని పండించే ఇలాంటి కథలు ప్రేక్షకులకు సైతం వినోదాన్ని పంచుతాయి. ఈ పాయింట్‌నే తీసుకుని సమాజంలో నేటి పరిస్థితులు ప్రతిబింబించేలా ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌ను తీర్చిదిద్దడంలో క్రియేటర్స్‌ మహి.వి.రాఘవ, ప్రదీప్‌.. దర్శకుడు తేజ కాకుమాను విజయం సాధించారు. గంటా రవి, విక్రమ్‌, రాహుల్‌ పోలీసులకు తమ కథ చెప్పడంతో సిరీస్‌ను మొదలు పెట్టిన దర్శకుడు ఒక్కో జంట నేపథ్యాన్ని, వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను చూపిస్తూ వాటి నుంచే ఫన్‌ జనరేట్‌ అయ్యేలా రాసుకున్న తీరు మెప్పిస్తుంది. మొదటి ఎపిసోడ్‌ నుంచి చివరి వరకూ ఆద్యంతం నవ్వులు పంచేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. మిడిల్‌ క్లాస్‌ మనుషుల జీవితాల్లో జరిగే సాధారణ సన్నివేశాల నుంచే హస్యం పండించారు.(save the tigers web series review) ముఖ్యంగా ప్రియదర్శి, అభినవ్‌ గోమటం కామెడీ టైమింగ్‌ బాగుంది. జోర్దార్‌ సుజాత-ప్రియదర్శిల మధ్య వచ్చే సన్నివేశాలు మాస్‌ను మెప్పించేలా ఉంటే, అభినవ్‌ గోమటం- పనిమనిషి రోహిణిల మధ్య సీన్స్‌ అయితే, సరదాగా ఉంటాయి. లోదుస్తుల ప్రకటన కోసం స్క్రిప్ట్‌ రాసుకునే సమయంలోనూ, జిమ్‌ చేస్తూ చేయి పట్టేసినప్పుడు ఆస్పత్రిలోనూ వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక భార్యభర్తల బంధంపై జరిగే టెలివిజన్‌ షోలు, ప్రకటనలపై న్యూస్‌ ఛానెళ్లు నిర్వహించే చర్చా వేదికలను స్పూఫ్‌ చేసిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి.

ఒకవైపు హాస్యాన్ని పంచుతూనే మరోవైపు అంతర్లీనంగా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు దర్శక-రచయితలు. తల్లిదండ్రులు చేసే పనిని స్నేహితులతో చెప్పుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని గంటా రవి భార్య ద్వారా అతడి కూతురికి చెప్పే సీన్స్‌ భావోద్వేగంగా సాగుతాయి. అలాగే పెద్దలు ఎలా మాట్లాడితే పిల్లలు కూడా అలాగే అలవాటు పడతారని గంటా రవి కుమారుడి పాత్రను ఉదాహరణగా చూపించిన తీరు బాగుంది. ఇక అమ్మాయిలు తండ్రి అంటే ఎందుకంత ప్రేమగా ఉంటారో విక్రమ్‌ కుమార్తె ద్వారా ఓ సన్నివేశంలో చెప్పించిన తీరు మెప్పిస్తుంది. ఎప్పుడూ సైలెంట్‌గా ప్రతిదానికి నవ్వుతూ సమాధానం ఇచ్చే విక్రమ్‌ మద్యం తాగి నినాదాలు చేసే వీడియోను చూసిన అతడి కుమార్తె ‘నాన్న నువ్వు ఇలాగే చాలా కూల్‌గా ఉన్నావ్’ అంటూ మెచ్చుకునే సీన్‌ భలే ఉంటుంది. అయితే, ఎపిసోడ్స్‌ గడుస్తున్న కొద్దీ, అవే సన్నివేశాలు రిపీట్‌ అవుతున్నాయా? అన్న భావన అక్కడక్కడా కలుగుతుంది.(save the tigers web series review) ఎందుకంటే భార్యభర్తల మధ్య ఒకే తరహా గిల్లికజ్జాలు, చిన్న చిన్న గొడవలు పునరావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. సిరీస్‌కు కొనసాగింపును ఇచ్చారు కానీ, సరైన ముగింపును ఇవ్వలేదు. కామెడీ స్కిట్స్‌ను ముగించడానికి ఒకరినొకరు కొట్టుకుంటూ చిందరవందర చేస్తారు. ఈ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. మరి ‘సేవ్‌ ది టైగర్స్‌2’లో ఎలాంటి వినోదాన్ని పంచుతారో చూడాలి. ఈ వీకెండ్‌లో ఏదైనా సరదా వెబ్‌సిరీస్‌ చూడాలంటే ‘సేవ్‌ ది టైగర్స్‌’ కచ్చితంగా ప్రయత్నించవచ్చు. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.

ఎవరెలా చేశారంటే: ప్రియదర్శి-జోర్దార్‌ సుజాత, అభినవ్‌ గోమటం-పావన గంగిరెడ్డి, చైతన్య కృష్ణ-దేవయాని జోడీలు ఆయా పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ భార్య-భర్తల పాత్రలే కనిపిస్తాయి తప్ప నటులు కనిపించలేదు. అభినవ్ గోమటంతో కలిసి పని మనిషి పాత్రలో రోహిణి నవ్వులు పంచారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా వెబ్‌సిరీస్‌ బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ప్రతి ఎపిసోడ్‌ 30 నిమిషాలకన్నా తక్కువ ఉండేలా చూసుకున్నారు. (save the tigers web series review) ఒకరిపై ఒకరు ఆధిపత్యం, అహం, అనుమానం ఉంటే భార్య భర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని మూడు జంటల కథ ద్వారా హాస్యం పంచేలా మహి.వి.రాఘవ, ప్రదీప్‌ చక్కగా రాసుకున్నారు. దాన్నే ఫన్నీగా తేజ కాకుమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు: + నటీనటులు; + హాస్యం; + రచన, దర్శకత్వం

బలహీనతలు: - అక్కడక్కడా రిపీట్‌గా అనిపించే కొన్ని సీన్స్‌; - చివరి ఎపిసోడ్‌

చివరిగా: వినోదాలను పంచే ‘సేవ్‌ ది టైగర్స్‌’..(save the tigers web series review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు