Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Shaitaan Movie Review: అజయ్‌ దేవ్‌గణ్‌, జ్యోతిక, మాధవన్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

Updated : 09 Mar 2024 17:31 IST

Shaitaan Movie Review; చిత్రం: షైతాన్‌; నటీనటులు: అజయ్‌ దేవ్‌గణ్‌, ఆర్‌.మాధవన్‌, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్‌ రాజ్‌; సంగీతం: అమిత్‌ త్రివేది; సినిమాటోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి యక్కంటి; ఎడిటింగ్‌: సందీప్‌ ఫ్రాన్సిస్‌; రచన: కృషదేవ్‌ యాజ్ఞిక్‌ (వశ్‌); దర్శకత్వం: వికాశ్‌ భల్‌

వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌. వికాశ్‌భల్‌ దర్శకత్వంలో ఆయన నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘షైతాన్‌’(Shaitan). మాధవన్‌ నెగెటివ్‌ రోల్‌ చేయడం, ప్రచార చిత్రాలు విభిన్నంగా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను భయపెట్టిందా?

కథేంటంటే: కబీర్‌ (అజయ్‌ దేవగణ్‌) తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్తాడు. వెళ్లే దారిలో దాబా వద్ద వనరాజ్‌ (ఆర్‌.మాధవన్‌) పరిచయమవుతాడు. అయితే, అదేరోజు రాత్రి కబీర్‌ ఫామ్‌హౌస్‌కు వచ్చి తలుపుకొట్టి ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోయిందని ఛార్జర్‌ కావాలని అడుగుతాడు. అలా ఆ ఇంట్లోకి ప్రవేశించిన వనరాజ్‌.. కబీర్‌ కుమార్తె జాన్వీ (జాంకీ)ని హిప్నటైజ్‌ చేసి, తన వశం చేసుకుంటాడు. అప్పటినుంచి వనరాజ్‌ ఏం చెబితే జాన్వీ అదే చేస్తుంది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులపై దాడి చేయడానికి కూడా వెనుకాడదు. ఇంతకీ వనరాజ్‌ ఎవరు? కబీర్‌ కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? అతడి బారి నుంచి జాన్వీని కాపాడటానికి కబీర్‌, అతని కుటుంబం ఏం చేసింది?(Shaitaan Movie Review in telugu) తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌ మూవీలు వెండితెరకు కొత్తేమీ కాదు కానీ, ఆ కథకు సూపర్‌ నేచురల్‌ అంశాన్ని జోడించి, మూవీగా తీయడంలో దర్శకుడు వికాశ్‌భల్‌  విజయం సాధించాడు. కబీర్‌, అతడి కుటుంబాన్ని పరిచయం చేస్తూ మొదలైన కథ నెమ్మదిగా సాగుతుంది. ఫామ్‌హౌస్‌కు వనరాజ్‌ వచ్చిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో అందుకు అవసరమైన సన్నివేశాలతో కథను బిల్డప్‌ చేసుకుంటూ వెళ్లాడు. ఎప్పుడైతే జాన్వీని వనరాజ్‌ వశం చేసుకుంటాడో అప్పటినుంచే కథలో వేగం పెరుగుతుంది. అప్పటివరకూ తమతో సంతోషంగా కలిసి ఉన్న అమ్మాయి విపరీత చర్యలు చేస్తుండటంతో కబీర్‌, అతడి భార్య భయంతో వణికిపోతుంటారు. వనరాజ్‌ను ఏం చేద్దామనుకున్నా, తన మాటతో జాన్వీని శాసిస్తూ కబీర్‌, అతడి భార్య (జ్యోతిక) చేతులు కట్టేస్తాడు. దీంతో వాళ్లు కూడా చేసేదేమీ లేక నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోతారు. కబీర్‌ను ఇబ్బంది పెట్టడానికి జాన్వీతో వనరాజ్‌ చేసే చర్యలు కొన్ని అతిగా అనిపిస్తాయి. (Shaitaan Movie Review in telugu)  అసలు వనరాజ్‌ నుంచి ఆమె ఎలా బయటపడుతుందా? అని కబీర్‌ కుటుంబంతో పాటు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడినీ తీవ్ర ఉత్కంఠతో కుర్చీ అంచున కూర్చోబెట్టాడు దర్శకుడు.  ఇంటర్వెల్‌ సమయానికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి, ద్వితీయార్ధంపై మరింత ఆసక్తిని పెంచాడు. అయితే, ఆ తర్వాత సినిమా మరో స్థాయిలో ఉంటుందనుకుంటే, పూర్తిగా గాడి తప్పింది. హారర్‌ థ్రిల్లర్‌కు సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్‌ జోడించడంతో అప్పటివరకూ ఉత్కంఠతో సాగిన కథ పేలవంగా మారిపోతుంది. ఈ రెండు అంశాలను మేళవించిన తీరు అంతగా మెప్పించదు. వనరాజ్‌ చేసే చర్యలు మరీ జుగుప్సాకరంగా ఉంటాయి. ఈ క్రమంలో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో ప్రయత్నించే ‘దృశ్యం’ మూవీ ఛాయలు కనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. పతాక సన్నివేశాలు ఊహకు అందినట్లే సాగుతాయి. వనరాజ్‌ ఎందుకు కబీర్‌ ఫ్యామిలీని టార్గెట్‌ చేశాడన్నది మాత్రం తెరపై చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే: కబీర్‌గా అజయ్‌ దేవ్‌గణ్‌, అతడి భార్య పాత్రలో జ్యోతిక ఒదిగిపోయి నటించారు. కుమార్తెను కాపాడుకోవాలనుకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారి హావభావాలు మెప్పిస్తాయి. కబీర్‌ కుమార్తెగా జాన్వీ పాత్రలో జాంకీ బొదివాలా అద్భుతంగా నటించింది. వనరాజ్‌కు వశమైన యువతిగా తన నటనతో మైమరపించింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం మాధవన్‌. వైవిధ్యమైన పాత్ర వస్తే, ఆయన ఎలా నటిస్తారో వనరాజ్‌గా మరోసారి నిరూపించారు. ఆయనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. సినిమా చూస్తున్నంత సేపూ మాధవన్‌పై విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ‘దయచేసి ఆ అమ్మాయిని వేధించడం ఆపేయ్‌రా బాబూ’ అని గట్టిగా అరవాలనిపిస్తుంది. అంతలా ఆ పాత్ర మనల్ని ‘వశం’ చేసుకుంటుంది. (Shaitaan Movie Review in telugu)  సాంకేతికంగా సినిమా బాగుంది. అన్నీ అంశాలు చక్కగా కుదిరాయి. గుజరాతీ ఫిల్మ్‌ ‘వశ్‌’ను తీసుకుని, పెద్దగా మార్పుల జోలికిపోకుండా బాలీవుడ్‌ ప్రేక్షకుల పల్స్‌కు అనుగుణంగా కొద్ది మార్పులు చేశాడు వికాశ్‌ భల్‌. అయితే, హారర్‌ థ్రిల్లర్‌, సూపర్‌ నేచురల్‌ అంశాన్ని సరిగా కలపలేకపోయారు. అలాగే తెరపై దాన్ని అంత ప్రభావవంతంగా ఎగ్జిక్యూట్‌ చేయలేకపోయారు. ఫస్టాఫ్‌లో ఉన్న ఆసక్తి, ఉత్కంఠ ద్వితీయార్ధానికి వచ్చేసరికి సడలిపోయింది. అయితే, సమర్థ నటీనటుల కారణంగా ఆ ప్రభావం కొంతమేర తగ్గింది.

  • బలాలు
  • + నటీనటులు
  • + ప్రథమార్ధం
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: థ్రిల్లింగ్‌ ‘షైతాన్‌ ’ (Shaitaan Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని