Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్‌ తుడిచి.. ఇప్పుడు స్టార్‌గా నిలిచి.. రణ్‌బీర్‌ ప్రయాణమిదీ

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా రణ్‌బీర్‌పై ప్రత్యేక కథనం..

Updated : 30 Nov 2023 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడి తనయుడు సినిమా సెట్స్‌లో ఫ్లోర్‌ తుడిచాడంటే నమ్మగలరా? రాత్రి చిత్రీకరణ కోసం బల్బులు బిగించాడంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? సినీ నేపథ్యమున్నా ఈ పనులు చేసింది మరెవరో కాదు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor). తన కొత్త చిత్రం ‘యానిమల్‌’ (Animal) డిసెంబరు 1న విడుదలకానున్న సందర్భంగా రణ్‌బీర్‌ ‘ఫ్లోర్‌ క్లీన్’ చేయడం నుంచి ‘స్టార్‌’గా ఎదిగిన క్రమాన్ని గుర్తుచేసుకుందాం..

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..

రణ్‌బీర్‌ది సినీ నేపథ్య కుటుంబం. తండ్రి రిషి కపూర్‌ సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న నటుడు. తల్లి నీతూ సింగ్‌ సైతం నటి. తల్లిదండ్రులు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నా రణ్‌బీర్‌ మాత్రం నేరుగా హీరో అయిపోలేదు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాపై అవగాహన పెంచుకుని ఆ తర్వాత తెరంగేట్రం చేయాలనుకున్నారు. అలా పదో తరగతి పూర్తికాగానే ‘ఆ అబ్‌ లౌట్‌ చలే’ (1999)కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. (ఈ చిత్రానికి డైరెక్టర్‌ రిషి కపూర్‌) కొన్నాళ్ల తర్వాత న్యూయార్క్‌ వెళ్లి అక్కడ ఫిల్మ్‌మేకింగ్‌, యాక్టింగ్‌లో శిక్షణ పొందారు. ట్రైనింగ్‌లో ఉన్న సమయంలో రెండు షార్ట్‌ఫిల్మ్స్‌లో స్వీయ దర్శకత్వంలో నటించారు. ముంబయి నుంచి తిరిగి వచ్చాక ‘బ్లాక్‌’ (2005)కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా అది. ఆ సంగతులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ.. ‘‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఫ్లోర్‌ తుడవడం నుంచి సెట్స్‌లో బల్బులు బిగించడం వరకు అన్ని పనులూ చేశా. ప్రతి రోజు కొత్తగా ఎన్నో విషయాలు నేర్చుకునేవాణ్ని’’ అని తెలిపారు. రణ్‌బీర్‌ కష్టాన్ని, సినిమాపై ఆయనకున్న ఆసక్తిని గుర్తించిన భన్సాలీ ఆయన్ను హీరోగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇటు కథాబలమున్న చిత్రాలు.. అటు కమర్షియల్‌ సినిమాలు

అలా రణ్‌బీర్‌ నటించిన తొలి చిత్రం ‘సావరియా’. 2007లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైనా నటుడిగా రణ్‌బీర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఉత్తమ పరిచయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌సహా పలు అవార్డులు అందుకున్నారు. తర్వాత ‘బచ్నా యే హసీనో’, ‘వేకప్‌ సిద్’, ‘అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్‌ కహానీ’, ‘రాకెట్‌ సింగ్‌’ లాంటి రొమాంటిక్‌ కామెడీ డ్రామా స్టోరీలతో నవ్వులు పంచిన రణ్‌బీర్‌లోని అసలైన నటుడిని బయటపెట్టిన సినిమా ‘రాజ్‌నీతి’. ఓ రాజకీయ పార్టీ కార్యవర్గ సభ్యుడు సమర్‌ ప్రతాప్‌గా వైవిధ్యం ప్రదర్శించి కొత్త రణ్‌బీర్‌ని పరిచయం చేశారు. మరోసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు దక్కించుకున్నారు.

‘యానిమల్‌’ కోసం రణ్‌బీర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే!

‘రాక్‌స్టార్‌’లో సింగర్‌గా, ‘బర్ఫీ’లో చెవిటి, మూగవాడిగా ఒదిగిపోవడం, బయోపిక్‌ ‘సంజు’లో నటుడు సంజయ్‌ దత్‌ని తలపించడం ఆయనకే చెల్లింది. రణ్‌బీర్‌ కొత్తదనమే తన ఇంధనం అనుకుంటారు. పాత్రకు తగ్గట్లు శరీరాకృతి మార్చుకోవడానికి ఏమాత్రం సందేహించరు. అదే ఆయన్ను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిబెట్టింది. స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. ఓవైపు కథాబలమున్న చిత్రాలు చేస్తూనే మరోవైపు ‘యే జవానీ హై దివానీ’, ‘తు జూతీ మై మక్కార్‌’లాంటి సినిమాలతో కమర్షియల్‌ హిట్‌లూ అందుకున్నారు. మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్‌నూ ఎదుర్కొన్న రణ్‌బీర్‌ రీమేక్స్‌ చేయడానికి మాత్రం ఇష్టపడరు.

దేశంలోనే బెస్ట్‌ యాక్టర్‌!

పాన్‌ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన ఇప్పుడు ‘యానిమల్‌’తో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సుమారు 16 ఏళ్ల కెరీర్‌లో రణ్‌బీర్‌ తన ప్రతిభను చూపించుకునే సినిమాలు చాలా తక్కువ వచ్చాయని, వాటిలో యానిమల్‌ టాప్‌లో ఉంటుందని అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), రణ్‌బీర్‌ మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటుల్లో ఒకరని అగ్ర నటుడు మహేశ్‌ బాబు (Mahesh Babu) చెప్పడం గమనార్హం. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన చిత్రమే ‘యానిమల్‌’. రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు.తండ్రి, కొడుకుల అనుబంధం నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయి. 3:21 గంటల నిడివి ఉన్నా ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసింది ‘యానిమల్‌’ టీమ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు