Chiranjeevi- Rajinikanth: రజనీ స్ఫూర్తితోనే చిరు రీఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద పోటీ..!

అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్‌ నటించిన చిత్రాలు ఒక్క రోజు తేడాతో బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందో చూద్దామా..

Published : 09 Aug 2023 13:16 IST

అగ్రకథానాయకులు చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలకానుండడంతో అంతటా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరు దక్కించుకుంటారోనన్న చర్చ సినీ అభిమానుల్లో మొదలైంది. ఈ ఇద్దరు టాప్‌ హీరోలు తమ తమ చిత్రాలతో పోటీ పడడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు కొన్ని రోజుల వ్యవధిలో బాక్సాఫీసు వద్ద సందడిచేశారు. ఆ వివరాలతోపాటు స్నేహపూర్వకంగా ఉండే వీరిద్దరు కలిసి నటించిన సినిమాలేంటో చూద్దాం..

1979లో మొదలైంది..

చిరు, రజనీ చిత్రాలు రోజుల వ్యవధిలో విడుదల కావటం 1979లో మొదలైంది. రజనీకాంత్‌, నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రల్లో దర్శకుడు నందమూరి రమేశ్‌ రూపొందించిన ‘టైగర్‌’ (Tiger) ఆ ఏడాది సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిరంజీవి హీరోగా దర్శకుడు కె. వాసు తెరకెక్కించిన ‘కోతలరాయుడు’ (Kothala Raayudu) సినిమా సెప్టెంబరు 15న విడుదలైంది. 

ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే!

అదే ఏడాది జనవరిలోనూ వీరి సినిమాల మధ్య పోటీ నెలకొంది. దర్శకుడు కొమ్మినేని శేషగిరి రావు తెరకెక్కించిన ‘తాయారమ్మ బంగారయ్య’ (Tayaramma Bangarayya) సినిమా ఆ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే, ఇందులో చిరు.. పూర్తిస్థాయి పాత్ర పోషించలేదు. కృష్ణ, రజనీకాంత్‌ కలిసి నటించిన ‘ఇద్దరూ అసాధ్యులే’ (Iddaru Asadhyule) జనవరి 25న రిలీజ్‌ అయింది. కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఇటు మోసగాడు.. అటు రామ్‌

శోభన్‌ బాబు, చిరంజీవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘మోసగాడు’ (Mosagadu) చిత్రం 1980 మే 22న విడుదలైంది. ఇందులో చిరంజీవి నెగెటివ్‌ రోల్‌ ప్లే చేశారు. కృష్ణ, రజనీకాంత్‌, చంద్రమోహన్‌ ప్రధాన పాత్రల్లో విజయ నిర్మల రూపొందించిన ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ (Ram Robert Rahim) అదే ఏడాది మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్‌గా రజనీ నటించారు. రెండు సినిమాలు ఆడియన్స్‌ను మెప్పించాయి.

రజనీకాంత్‌దే పైచేయి..

రజనీకాంత్‌ ఇమేజ్‌ని మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘నరసింహ’ (Narasimha). కె.ఎస్‌. రవికుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 1999 ఏప్రిల్‌ 10న విడుదలకాగా, చిరంజీవి నటించిన ‘ఇద్దరు మిత్రులు’ (Iddaru Mitrulu) ఏప్రిల్‌ 30న రిలీజైంది. కె. రాఘవేంద్రరావు దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.

మళ్లీ ఇన్నేళ్లకు.. 

సుమారు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన ‘జైలర్‌’ (Jailer) ఆగస్టు 10న విడుదల కానుంది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌, కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌తోపాటు రమ్యకృష్ణ, సునీల్‌, యోగిబాబు, వసంత్‌ రవి, మిర్నా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన ‘భోళాశంకర్‌’ (Bhola Shankar) ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. తమిళంలో విజయం అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీలో చిరు సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. సుశాంత్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్‌ తమన్నా నటించడం విశేషం.

ఈ హీరోలిద్దరూ కలిసి నటించిన చిత్రాలివే..

వృత్తిపరంగా వీరిద్దరి మధ్య ఎంత పోటీ ఉందో వ్యక్తిగతంగా అంత అనుబంధం ఉంది. ఎన్నో వేదికలపై ఇరువురు తమ స్నేహం గురించి పంచుకున్నారు. రజనీని చిరు ఇమిటేట్‌ చేసి, ప్రేక్షకులను అలరించిన సందర్భాలూ ఉన్నాయి. ‘కాళి’ (Kaali) అనే సినిమాలో రజనీకాంత్‌, చిరంజీవి తొలిసారి కలిసి నటించారు. ఐ.వి. శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజనీ టైటిల్‌ పాత్ర పోషించగా, జీకే అనే పాత్రను తమిళ వెర్షన్‌లో విజయ్‌కుమార్‌ పోషించారు. అదే పాత్రలో తెలుగులో చిరంజీవి నటించారు. 1980లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు ‘రణువ వీరన్‌’ (Ranuva Veeran)లో నటించారు. 1981లో విడుదలైందీ చిత్రం. ‘బందిపోటు సింహం’ పేరుతో తెలుగులో 1982లో రిలీజైంది.

రజనీ స్ఫూర్తితోనే చిరు రీఎంట్రీ!

మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చిరంజీవికి రజనీకాంత్‌ సీనియర్‌. చిరంజీవి శిక్షణ తీసుకుంటున్న సమయంలో రజనీ కూడా వచ్చి ఒకట్రెండు క్లాస్‌లు చెప్పారు. తాను నటుడిని కావడానికి రజనీ కూడా స్ఫూర్తి అని చిరు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే, ఒక్క విషయంలో రజనీ తనని మోసం చేశారని ‘రోబో’ విడుదల సందర్భంగా చిరంజీవి చమత్కరించారు. అన్ని రకాల సినిమాలు చేసేసిన రజనీ ఇక రాజకీయాల్లో వచ్చేస్తారని అనుకుని, తాను ముందుగా అడుగు పెడితే, రజనీ మాత్రం ‘రోబో’ చేసి తనని ఆశ్చర్యపరిచాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ మళ్లీ తాను సినిమా చేయాల్సి వస్తే, అందుకు రజనీకాంత్‌ ‘రోబో’ను స్ఫూర్తిగా తీసుకుని, సినిమాలు చేస్తానని చిరు అప్పట్లో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే రాజకీయాలను పక్కన పెట్టి ‘ఖైదీ నంబర్‌ 150’లో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ‘భోళా శంకర్‌’తో ‘జైలర్‌’కు పోటీ ఇస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని