Taali Review: రివ్యూ: తాలీ.. ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితాసేన్‌ నటించిన సిరీస్‌ ఎలా ఉంది?

Taali Review in telugu: బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘తాలీ’. ఓటీటీ ‘జియో సినిమా’లో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 16 Aug 2023 09:54 IST

Taali Review in telugu; వెబ్‌సిరీస్‌: తాలీ: నటీనటులు: సుస్మితా సేన్‌, కృతిక డియో, ఐశ్వర్య నర్కర్‌, అంకుర్‌ భాటియా, నందు మాధవ్‌ తదితరులు; స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: క్షితిజ్‌ పట్వర్థన్‌; ఎడిటింగ్‌: ఫైజల్‌; సినిమాటోగ్రఫీ: రాఘవ్‌ రామదాస్‌; నిర్మాత: అర్జున్‌ సింగ్‌ బరన్‌, కార్తీక్‌ డీ నిషాందర్‌, సులేమాన్‌ నదియావాలా; డైరెక్టర్‌: రవి జాదవ్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: జియో సినిమా

బయోపిక్స్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే సినిమాలే కాకుండా పలువురు దర్శక, నిర్మాతలు ఆ నేపథ్యంలోనూ వెబ్‌సిరీస్‌లూ రూపొందిస్తున్నారు. అలా.. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం న్యాయం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్‌ జీవితాధారంగా దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కించిన సిరీస్‌ ‘తాలీ’. బాలీవుడ్‌ ప్రముఖ నటి సుస్మితా సేన్‌ (Sushmita Sen) ప్రధాన పాత్రధారి. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ‘జియో సినిమా’ (Jio Cinema)లో విడుదలైంది. మరి, ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఇందులో ఏయే అంశాలు ప్రస్తావించారంటే?(Taali Review)

ఇదీ కథ: గణేశ్‌ (కృతిక).. ఓ పోలీసు అధికారి తనయుడు. బాల్యంలోనే అమ్మాయిగా మారాలని కోరుకుంటాడు. ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’ అని టీచర్‌ ప్రశ్నిస్తే అమ్మను అవుతానని సమాధానం చెప్పి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. గణేశ్‌ నేరుగా చెప్పకపోయినా కుటుంబ సభ్యులకు విషయం అర్థమవుతుంది. కొన్ని నెలలకు అతడి తల్లి మరణిస్తుంది. ‘నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే ఈ ఇంట్లో ఉండు. లేదంటే వెళ్లిపో’ అని గణేశ్‌ తండ్రి కొడుక్కి తేల్చి చెబుతాడు. తండ్రి మాట కాదని గణేశ్‌ సుమారు 15 ఏళ్ల వయసులో పుణె నుంచి ముంబయికి వెళ్తాడు. సర్జరీ ద్వారా మహిళగా మారి.. గౌరి (సుస్మితా సేన్) అని పేరు పెట్టుకుంటాడు. గౌరి తాను అనుకున్నట్లు అమ్మగా ఎలా మారింది? దేశంలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు తెచ్చే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అనేది తెరపై చూడాల్సిందే (Taali Review).

ఎలా ఉందంటే: కల్పిత కథల విషయంలో దర్శకులకు స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉంటుంది. బయోపిక్స్‌ విషయంలో ఆ వెసులుబాటు ఉండదు. ఉన్నది ఉన్నట్లు చూపించాలి. లేదా వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించాలి. అప్పటికే చాలామందికి తెలిసిన కథకావడంతో స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచాలి. సవాల్‌తో కూడిన ఈ ప్రయాణంలో రవి జాదవ్‌, క్షితిజ్‌ పట్వర్థన్‌ విజయాన్ని సాధించారు. ట్రాన్స్‌జెండర్‌ మనోభావాల్ని తెరపైకి తీసుకొచ్చి, ప్రేక్షకుల్ని ఆలోచింపజేశారు. పురుషుడు.. మహిళగా మారడం, ట్రాన్స్‌జెండర్‌ల వ్యవహార శైలి ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించాయి. ఈ సిరీస్‌ కూడా అదే తరహాలో సాగినా సమానత్వం కోసం ట్రాన్స్‌జెండర్‌ చేసిన న్యాయం పోరాటం ఆకట్టుకుంటుంది. ‘ఈ కథ నా పయనం గురించి.. అవమానం నుంచి చప్పట్ల వరకు’ అంటూ గౌరి పాత్ర తన కథ గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమవుతుందీ సిరీస్‌. ఆరు ఎపిసోడ్లలో సాగుతుంది. గణేశ్‌ బాల్యం, కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూనే దర్శకుడు నేరుగా అసలు పాయింట్‌ని తొలి ఎపిసోడ్‌లోనే టచ్‌ చేశారు. పురుషులు, మహిళలతో సమానంగా ట్రాన్స్‌జెండర్లకూ సమాన హక్కులుండాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన గౌరి గెలుస్తుందా, లేదా? అన్న ఉత్కంఠ రేకెత్తించారు. ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసే క్రమంలో మళ్లీ.. గౌరి ‘ఫ్లాష్‌బ్యాక్‌’ తెరపైకి వస్తుంది. కోర్టు నేపథ్యంలో ప్రస్తుతాన్ని, ఇంటర్వ్యూ నేపథ్యంలో గతాన్ని చూపించిన తీరు బాగుంది. అయితే, కోర్టు ఆవరణలో ఓ అడ్వకేట్‌ గౌరిపై ఇంకు చల్లడం, అందుకు గౌరి పోలీసులను ఆశ్రయించడం తదితర సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి (Taali Review).

అత్యున్నత న్యాయస్థానం ఏ తీర్పు వెలువరిస్తుందోనన్న ఆసక్తిని కొనసాగిస్తూనే గణేశ్‌/గౌరి ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ట్రాన్స్‌జెండర్లను అవమానించే వారికి గౌరి బుద్ధి చెప్పడం, అనాథ పిల్లలను చేరదీయడం, అమెరికాలోని ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీ కాలేజ్‌లో ప్రసంగించేందుకు వెళ్లడం.. ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో పరిణామ క్రమాన్ని ఆవిష్కరించారు. తొలి నాలుగు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగినా 5, 6వ ఎపిసోడ్లలో వేగం పుంజుకుంటుంది. ఒకేషాట్‌లో.. గణేశ్‌.. గౌరిగా మారాననే ఆనందంలో ఉండగా.. కొడుకు చనిపోయాడంటూ తండ్రి పిండం పెట్టడం భావోద్వేగానికి గురిచేస్తుంది. ‘నేను చప్పట్లు కొట్టను. కొట్టించుకుంటాను’లాంటి సంభాషణలు గౌరి లక్ష్యాన్ని సుస్పష్టం చేశాయి. మగ, ఆడ, ట్రాన్స్‌జెండర్‌.. ఇలా లింగం ఏదైనా అభివృద్ధిలో పథంలో నడుస్తుంటే శత్రువులు ఏర్పడతారనే విషయాన్నీ ప్రస్తవించారు. ‘నువ్వు కష్టాలివ్వు భగవంతుడా! నేను సులువు చేస్తాను. ఒక ఎడారినివ్వు పువ్వుల తోట చేస్తాను. ఎంత పెద్ద పర్వతాన్నైనా తీసుకురా.. నేనందులో సొరంగాన్ని సృష్టిస్తాను. నువ్వు ఎన్నో లక్షల మెరుపులతో దాడి చేయ్‌. నేను దాన్ని వెలుతురు చేస్తాను’ అనే క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్‌ ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ తదితర భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది (Taali Review).

ఎవరెలా చేశారంటే: సుస్మితా సేన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుభవం ఉన్న నటి. కానీ, ఇలాంటి పాత్రను అంగీకరించడం, అందులో ఒదిగిపోవడం సాహసమే. ఇది సుస్మితా సేన్‌ షో అనొచ్చు. ట్రాన్స్‌జెండర్‌గా నటించేందుకు ఆమె ఎంత హోమ్‌వర్క్‌ చేశారో తెరపై స్పష్టంగా కనిపించింది. గణేశ్‌గా కృతిక డియో, తండ్రిగా నందు యాదవ్‌, ఇతర పాత్రధారులు చక్కగా నటించారు. విజువల్స్‌ బాగున్నాయి. కథాగమనంలో వచ్చే పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం మంచి మూడ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది. రవి జాదవ్‌ టేకింగ్‌ మెప్పిస్తుంది.

  • బ‌లాలు
  • + సుస్మితా సేన్‌ న‌ట‌న‌
  • + కథా నేపథ్యం
  • + 5, 6వ ఎపిసోడ్లు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు 
  • చివ‌రిగా: ఈ గౌరికి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు (Taali Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

శ్రీగౌరి సావంత్‌ గురించి కొన్ని విశేషాలు: 2019లో ఎన్నికల సంఘం ఆమెను మహారాష్ట్రకు ప్రచార కర్తగా నియమించింది. సఖి చార్‌ చౌగీ అనే ఎన్జీవో సంస్థను నెలకొల్పింది. ట్రాన్స్‌జెండర్లకు కౌన్సిలింగ్‌, సురక్షిత శృంగారం గురించి అవగాహన కల్పిస్తుందీ సంస్థ. సీనియర్‌ ట్రాన్స్‌జెండర్లు, నిరాశ్రయులైన చిన్నారుల కోసం ‘అజ్జీ చ ఘర్‌’అని స్థాపించింది. గెస్ట్‌ స్పీకర్‌గా ఆమెకు ‘టెడ్‌ఎక్స్‌’ ఆహ్వానం అందగా ‘ఐఐఎం- కాశీపుర్‌’లో ప్రసంగించి, ఎందరిలోనో స్ఫూర్తినింపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని