Tillu Square Review: రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ మెప్పించిందా?

Updated : 29 Mar 2024 20:52 IST

Tillu Square Review; చిత్రం: టిల్లు స్క్వేర్‌; నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, మురళీధర్‌ గౌడ్, నేహా శెట్టి, ప్రిన్స్, నర్రా నాగేశ్వరరావు తదితరులు; కూర్పు: నవీన్‌ నూలి; సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల, అచ్చు రాజమణి, భీమ్స్‌; ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు; రచన, స్క్రీన్‌ప్లే: రవి ఆంథోని, సిద్ధు జొన్నలగడ్డ; దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌; నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య; విడుదల తేదీ: 29-03-2024

‘డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’ వచ్చేశాడు. ఈసారి ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్లలో చూపించిన కంటెంట్‌ ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా ఉండటం.. విడుదలకు ముందే పాటలు కూడా మంచి ఆదరణ దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ సీక్వెల్‌పైనా పడింది. మరి మరోసారి టిల్లు చేసిన సందడి సినీప్రియుల్ని నవ్వించిందా? (Tillu Square Review) తను ఈ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా?

కథేంటంటే: రాధిక (నేహాశెట్టి)తో పాత పంచాయితీ ముగిశాక టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) సొంతంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభిస్తాడు. పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ తనదైన శైలిలో సరదాగా జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) అనే మరో అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. వాళ్లిద్దరూ అనుకోకుండా ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాట కలుపుతాడు. అతడి మాటలు.. వ్యవహారశైలి నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే.. అదే రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. కట్‌ చేస్తే తెల్లారేసరికి గదిలో ఒక లెటర్‌ పెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో నెల తర్వాత లిల్లీ ఓ ఆస్పత్రిలో టిల్లుకు ఎదురుపడుతుంది. తను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఈలోపు మళ్లీ టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీ అతన్ని తన అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరడంతో తను అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అది రాధిక (నేహా శెట్టి) ఫ్లాట్‌. మరి అక్కడికి వెళ్లాక టిల్లుకు ఎదురైన సమస్య ఏంటి? రాధిక, లిల్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దుబాయ్‌ నుంచి వస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ షేక్‌ మహబూబ్‌ (మురళీశర్మ)కు ఈ కథకు ఉన్న లింకేంటి? (Tillu Square Review) అతన్ని చంపాల్సిన మిషన్‌లోకి టిల్లు ఎందుకొచ్చాడు? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: ‘డీజే టిల్లు’లో కథ కంటే ఎక్కువగా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరే. ఆ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పే సంభాషణలు.. అతని వ్యవహార శైలి.. పలికించే హావభావాలు అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ‘కథ.. కాకరకాయ’ అంటూ లాజిక్‌లు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా దాదాపు 2గంటల పాటు థియేటర్లలో హాయిగా పడి పడి నవ్వుకునేలా చేశాయి. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘టిల్లు స్క్వేర్‌’తో మరోసారి పునరావృతం చేయడం కోసం సిద్ధు తన కలం బలంతో.. నటనా ప్రతిభతో శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ సీక్వెల్‌ కథ కూడా తొలి భాగం తరహాలోనే సింపుల్‌ లైన్‌లో సాగిపోతుంది. కాకపోతే మరోసారి టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టేసింది.

ఈ కథ తొలి భాగంలో జరిగిన కథతో కొంత వరకు ముడిపడి ఉంటుంది. అందుకే చిత్ర బృందం టైటిల్‌ కార్డ్స్‌తోనే తొలి భాగం కథను క్లుప్తంగా మరోసారి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ‘డీజే టిల్లూ చూడూ’ రీమిక్స్‌ పాటతో సిద్ధు పరిచయమైన తీరు ప్రేక్షకులకు హుషారు తెప్పిస్తుంది. ఇక అక్కడి నుంచి తొలి భాగాన్ని గుర్తు చేసేలాగే మరోసారి టిల్లు లైఫ్‌ సాగుతుంది. లిల్లీ పాత్ర పరిచయ సన్నివేశాలు.. టిల్లు ఠక్కున ఆమె మాయలో పడిపోవడం.. ఒక్క రాత్రిలోనే ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఇలా అంతా రాధిక ఎపిసోడ్‌ మరోసారి లిల్లీ వెర్షన్‌లో పునరావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక టిల్లు తన బర్త్‌డే పార్టీని వదిలేసి లిల్లీని వెతుక్కుంటూ పాత రాధిక అపార్ట్‌మెంట్‌కే వెళ్లడం.. ఆరోజు చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ అదే సమస్యలోకి దిగడం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ కథలో కొత్త కోణం బయటకొస్తుంది. నిజానికి ఈ మధ్యలో సాగే తతంగమంతా కొందరికి పాత కథను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి కలిగించినా టిల్లు పాత్ర చేసే అల్లరితో అదంతా కొట్టుకుపోతుంది. దీనికి తోడు మధ్యలో టిల్లు-లిల్లీ మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు యువతరానికి కనుల విందుగా అనిపిస్తాయి. అలాగే ఆస్పత్రిలో టిల్లు ఫ్యామిలీకి.. లిల్లీ తండ్రికీ మధ్య జరిగే ఎపిసోడ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు గంగ చంద్రముఖిగా మారినట్లుగా లిల్లీ ఓ కొత్త అవతారంలో తెరపైకి వచ్చి పడుతుంది. అది మరీ అంత థ్రిల్‌ ఇవ్వకున్నా ఫర్వాలేదనిపిస్తుంది.

ఇక ద్వితీయార్ధం షేక్‌ మహబూబ్‌ అలీని పట్టుకునే మిషన్‌ నేపథ్యంలో సాగుతుంది. అంత పెద్ద క్రిమినల్‌ను చంపడానికి టిల్లులాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేయిస్తారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. నిజానికి ఆ ప్రయత్నం మరీ అంత థ్రిల్లింగ్‌గా సాగకున్నా ఎక్కడా బోర్‌ కొట్టించదు. ఇక ప్రీక్లైమాక్స్‌కు ముందు రాధిక పాత్ర కూడా కథలోకి దిగడంతో సినిమాలో వినోదం మరోసారి తారస్థాయికి వెళ్తుంది. (Tillu Square Review in telugu) ఈ క్రమంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ టిల్లు చెప్పే సంభాషణలు నవ్విస్తాయి. క్లైమాక్స్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినా.. అందులోని ట్విస్ట్‌ ఊహలకు అందేలాగే ఉంటుంది. ముగింపు సంతృప్తికరంగానే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనదైన నటనతో మరోసారి కట్టిపడేశాడు. తన పాత్ర కోసం రాసుకున్న వన్‌ లైనర్‌ డైలాగ్‌లన్నీ హిలేరియస్‌గా పేలాయి. అతను తెరపై కనిపిస్తున్నంత సేపూ మాటల్ని తూటాల్లా పేల్చుతూనే ఉంటారు. అవన్నీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పెద్దగా సంభాషణలు లేకున్నా.. హావభావాలతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడక్కడా వినిపించే కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు కాస్త ఇబ్బంది పెడతాయి. లిల్లీ పాత్రలో అనుపమ తెరపై చాలా హాట్‌గా కనిపించింది. లిప్‌లాక్‌ల విషయంలో మొహమాట పడకుండా నటించింది. టిల్లు తల్లిదండ్రుల పాత్రలూ నవ్వులు పంచాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి అతిథిలా తళుక్కున మెరిసింది. అలాగే ప్రియాంక జవాల్కర్‌ కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది. సినిమాలోని రెండు పాటలు తెరపైనా కనువిందు చేస్తాయి. భీమ్స్‌ నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. కూర్పు బాగా కుదిరింది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + టిల్లు పాత్రలో సిద్ధు అల్లరి
  • + అనుపమ అందచందాలు
  • + కథలోని వినోదం, కొన్ని ట్విస్ట్‌లు
  • బలహీనతలు
  • - సాధారణ కథ
  • - బోల్డ్‌ సీన్స్‌
  • చివరిగా: అట్లుంటది టిల్లుతోని.. డబుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘టిల్లు స్క్వేర్‌’
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని