ustaad movie review: రివ్యూ: ఉస్తాద్‌.. శ్రీసింహా నటించిన కొత్త మూవీ మెప్పించిందా?

ustaad telugu movie review: శ్రీసింహా, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఉస్తాద్’ ఎలా ఉందంటే?

Updated : 12 Aug 2023 18:57 IST

ustaad telugu movie review: చిత్రం: ఉస్తాద్‌; న‌టీన‌టులు: శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ. ర‌వి శివ తేజ‌, సాయి కిర‌ణ ఏడిద‌ తదిత‌రులు; ఎడిటింగ్‌: కార్తీక్ క‌ట్స్‌; సంగీతం: అకీవా.బి; ఛాయాగ్ర‌హ‌ణం:  ప‌వ‌న్ కుమార్ పప్పుల; ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ఫ‌ణిదీప్‌; నిర్మాత‌లు: ర‌జనీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు; విడుద‌ల తేదీ: 12-08-2023

‘మ‌త్తువ‌ద‌ల‌రా’ చిత్రంతో హీరోగా తొలి అడుగులోనే ఓ చ‌క్క‌టి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు శ్రీసింహా కోడూరి (sri simha koduri). ఆ త‌ర్వాత  జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేస్తూనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడాయ‌న ‘ఉస్తాద్‌’గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. (ustaad telugu movie review) మ‌రి ఈ ఉస్తాద్ క‌థేంటి? ఇది సినీప్రియుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది?

క‌థేంటంటే: మ‌న‌సుకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్లే కుర్రాడు సూర్య‌ (శ్రీసింహా). చిన్న‌ప్పుడే తండ్రి మ‌ర‌ణించ‌డంతో.. త‌ల్లే (అను హాస‌న్‌) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తుంది. సూర్య‌కు ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌యం. అలాగే విప‌రీత‌మైన కోపం. ఏ భావోద్వేగాన్నైనా అప్ప‌టిక‌ప్పుడే చూపించేయ‌డం త‌న నైజం. జీవితంపై ఏ స్ప‌ష్టతా ఉండ‌దు. డిగ్రీ చ‌దివే రోజుల్లో ఓ పాత కాలం నాటి బైక్‌ను ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కుంటాడు. దానికి ఉస్తాద్ అని పేరు పెట్టుకుంటాడు. అది జీవితంలోకి వ‌చ్చాక త‌న ఆనందం.. బాధ‌.. క‌ష్టం.. సుఖం.. ప్ర‌తిదీ దానితోనే పంచుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆ బైక్ వ‌ల్లే మేఘ‌న (కావ్యా క‌ల్యాణ్ రామ్‌) సూర్య జీవితంలోకి వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఆ త‌ర్వాత సూర్య‌కు పైల‌ట్ అవ్వాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌డుతుంది.  మ‌రి ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌య‌ప‌డే సూర్య పైల‌ట్ అవ్వాల‌న్న త‌న క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాడు? ఈ క్ర‌మంలో త‌న‌కెదురైన స‌వాళ్లేంటి? (ustaad telugu movie review) త‌న వ్య‌క్తిత్వం వ‌ల్ల ప్రేమ‌క‌థ‌లో వ‌చ్చిన చిక్కులేంటి?  వీట‌న్నింటినీ సూర్య ఎలా ప‌రిష్క‌రించుకున్నాడు? ఈ ప్ర‌యాణంలో ఉస్తాద్ అత‌ని జీవితాన్ని ఎలా ప్ర‌భావితం చేసింది? ఈ క‌థ‌లో బైక్ మెకానిక్ బ్ర‌హ్మం (ర‌వీంద్ర విజ‌య్‌), పైల‌ట్‌ జోసెఫ్ డిసౌజా (గౌత‌మ్ మేన‌న్‌) పాత్ర‌ల‌కున్న ప్రాధాన్య‌త ఏంట‌న్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే:  సూర్య అనే ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడి జీవిత క‌థ ఇది. పాతకాలం నాటి ఓ డొక్కు బైక్ అత‌ని జీవితాన్ని ఎలా ప్ర‌భావితం చేసింది.. ఎత్తైన ప్ర‌దేశాలు చూస్తే భ‌య‌ప‌డే ఆ కుర్రాడు ఆకాశంలో ఎగ‌రాల‌ని ఎందుకు అనుకున్నాడు? త‌న క‌ల‌ని నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఎదురైన స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాడు? అన్న‌ది క్లుప్తంగా ఈ చిత్ర క‌థాంశం. ఈ మొత్తం క‌థను మూడు ద‌శ‌ల్లో తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. సూర్య కాలేజీ జీవితం.. మేఘ‌న‌తో అత‌ని ప్రేమ ప్ర‌యాణంతో ప్ర‌ధ‌మార్ధం సాగుతుంది. ఆకాశంలో ఎగ‌రాల‌న్న త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు సూర్య ఏం చేశాడు..  త‌న ప్రేమ‌క‌థ‌ను ఎలా గెలిపించుకున్నాడ‌న్న‌ది ద్వితీయార్ధంలో చూపించారు. ఈ మొత్తం క‌థ‌ను ఓ బైక్‌తో ముడిపెట్టి భావోద్వేగ‌భ‌రితంగా చెప్పిన తీరు మెప్పిస్తుంది. అయితే చాలా నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది.(ustaad telugu movie review) సూర్య బాల్యం.. తండ్రితో ఉన్న అనుబంధాన్ని ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. అత‌ను కాలేజీలోకి అడుగు పెట్ట‌డం.. సీనియ‌ర్లు ర్యాగింగ్ చేయ‌డం.. వాళ్ల‌పై కోపంతో బైక్ నేర్చుకోవాల‌నుకోవ‌డం.. ఈ క్ర‌మంలో బండి నేర్చుకునేందుకు త‌ను ప‌డ్డ అవ‌స్థ‌ల‌తో తొలి 30నిమిషాలు సాగుతుంది. ఈత‌తంగ‌మంతా సాగ‌తీత వ్య‌వ‌హారమే. మేఘ‌న‌తో సూర్య ఎప్పుడైతే ప్రేమ‌లో ప‌డ‌తాడో.. అక్క‌డి నుంచే క‌థ‌లో కాస్త క‌ద‌లిక మొద‌ల‌వుతుంది. వీళ్లిద్ద‌రి ప‌రిచ‌యం.. ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌టం.. ఇద్ద‌రూ క‌లిసి చేసే ప్ర‌యాణం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.  ఈ ల‌వ్ ట్రాక్‌ను ఎంతో స‌హ‌జంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

ఇక మ‌ధ్య‌లో ఉస్తాద్‌కు.. బైక్ మెకానిక్ బ్ర‌హ్మంకు మ‌ధ్య వ‌చ్చే ఎపిసోడ్స్ కూడా మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. సూర్య‌కు ఆకాశంలో ఎగ‌రాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌డ్డాక క‌థ మ‌రో మ‌లుపు తిరుగుతుంది. విరామ స‌న్నివేశాలు ద్వితీయార్ధంపై ఆస‌క్తి పెంచేలా ఉంటాయి. ఓవైపు సూర్య పైల‌ట్ అవ్వ‌డం కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌డం.. మ‌రోవైపు మేఘ‌న తన తండ్రి ద‌గ్గ‌ర‌ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం.. ఒక్క‌సారిగా క‌థ ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. (ustaad telugu movie review) మేఘ‌న తండ్రితో సూర్య మాట్లాడే స‌న్నివేశాలు.. ఆ సంద‌ర్భంలో అత‌ను ప‌లికే సంభాష‌ణ‌లు యువ‌త‌రాన్ని మెప్పిస్తాయి. సూర్య - మేఘ‌న ప్రేమ‌క‌థ‌లో స‌మ‌స్య‌లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి క‌థ కాస్త గాడి త‌ప్పిన‌ట్లు అనిపిస్తుంది. మేఘ‌న ప్రేమ‌కు దూర‌మైన సంద‌ర్భంలో సూర్య ప‌డే ఆవేద‌న.. ఆ స‌మ‌యంలో అత‌ని  త‌ల్లి స్ఫూర్తినింపే తీరు ఆక‌ట్టుకుంటుంది. సూర్య పైల‌ట్‌గా మారే తీరు..  ఈ క్ర‌మంలో ఎదుర్కొన్న స‌వాళ్లు ఏమాత్రం ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు.

ఎవ‌రెలా చేశారంటే:  సూర్య పాత్ర‌లో శ్రీసింహా చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇది న‌టుడిగా త‌న‌ని మ‌రో మెట్టు పైకి ఎక్కించే పాత్ర‌. ఆ పాత్ర‌లోని మూడు కోణాల్ని ఆవిష్క‌రించ‌డానికి సింహా శ‌క్తిమేర‌కు కృషి చేశాడు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో క‌ట్టిప‌డేశాడు. మేఘ‌న పాత్ర‌లో కావ్యా కల్యాణ్ రామ్ ఎంతో స‌హ‌జంగా క‌నిపించింది. న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్రిది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్న తీరు బాగుంది. ఆమెకు.. సింహాకు మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు చాలా స‌హ‌జంగా ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుంది. హీరో త‌ల్లిగా అను హాస‌న్ త‌న‌దైన న‌ట‌న‌తో క‌ట్టిప‌డేస్తుంది. ఆ పాత్ర‌ను కూడా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తీర్చిదిద్దుకున్నాడు.(ustaad telugu movie review) బైక్ మెకానిక్ బ్ర‌హ్మం పాత్ర ప్రేక్ష‌కుల మ‌దిలో ప్ర‌త్యేకంగా గుర్తుండిపోతుంది. ఆ పాత్రను ముగించిన తీరు భావోద్వేగ‌భ‌రితంగా ఉంటుంది. గౌత‌మ్ మేన‌న్, వెంక‌టేష్ మ‌హా ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ద‌ర్శ‌కుడు త‌న నిజ జీవితంలోని అనుభ‌వాల ఆధారంగా ఈ క‌థ‌ను అల్లుకున్నారు. దాన్ని అనుకున్న‌ట్లుగా నిజాయితీగా తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. (ustaad telugu movie review) అయితే క‌థ‌ను చాలా నెమ్మ‌దిగా న‌డిపించ‌డం.. ద్వితీయార్ధం గాడి త‌ప్ప‌డం.. ఫ‌లితాన్ని దెబ్బ తీశాయి. క‌థ‌లోని మ‌హిళా పాత్ర‌ల్ని మ‌ల‌చిన తీరు మాత్రం ఎంతో మెప్పిస్తుంది. అకీవా నేప‌థ్య సంగీతం అక్క‌డ‌క్క‌డా మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. ప‌వ‌న్ కుమార్ ఛాయాగ్ర‌హణం బాగుంది. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + శ్రీసింహా, కావ్యా న‌ట‌న‌
  • + భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
  • - ముగింపు
  • చివ‌రిగా: ఓపిక‌గా కూర్చోగ‌లిగితే ‘ఉస్తాద్‌’ ప్ర‌యాణాన్ని ఆస్వాదించొచ్చు.(ustaad telugu movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని