Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

అవికా గోర్‌, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘వధువు’. ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 08 Dec 2023 18:35 IST

Vadhuvu web series Review; వెబ్‌సిరీస్‌: వధువు; నటీనటులు: అవికా గోర్‌, నందు, అలీ రెజా, రూపాలక్ష్మి, మాధవి ప్రసాద్‌, శ్రీధర్‌ రెడ్డి, సురభి దీప్తి తదితరులు; సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి; ఛాయగ్రహణం: రామ్‌ కె. మహేశ్‌; కూర్పు: అనిల్‌ కుమార్‌; నిర్మాతలు: శ్రీకాంత్‌ మొహ్తా, మహేంద్ర సోనీ; దర్శకత్వం: పోలూరు కృష్ణ; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+హాట్‌స్టార్‌.

కథ బాగుంటే పర భాష చిత్రాలనే కాదు వెబ్‌సిరీస్‌లను రీమేక్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా బెంగాలీ సిరీస్‌ ‘ఇందు’ (Indu)కు రీమేక్‌గా రూపొందిందే ‘వధువు’ (Vadhuvu). అవికా గోర్‌ (Avika Gor), నందు (Nandu), అలీ రెజా (Ali Reza) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Vadhuvu on Disney+ Hotstar)లో శుక్రవారం విడుదలైంది. మరి, ఈ వధువు కథేంటి?ఆకట్టుకుందా, లేదా? (Vadhuvu Review in Telugu) తెలుసుకుందాం..

కథేంటంటే: అంజూరి ఇందు (అవికా గోర్‌) తెలివైన అమ్మాయి. చదువులో టాపర్‌. తల్లి, తండ్రి చూసిన అబ్బాయిని వివాహం చేసుకునేందుకు అంగీకరిస్తుంది. అలా పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ‘ఇందు’కు తన చెల్లి ఓ షాక్‌ ఇస్తుంది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉండగా కాబోయే వరుడితో వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ బాధ నుంచి తేరుకున్న ఇందు మరోసారి పెళ్లికి రెడీ అవుతుంది. పలు అడ్డంకులు ఎదురైనా చివరకు ఆనంద్‌ (నందు)తో వివాహం జరుగుతుంది. అత్తారింటిలో అడుగుపెట్టగానే ‘ఇందు’కు ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరిది ఆర్య (అలీ రెజా) అప్పటికే పెళ్లి చేసుకున్నాడన్న విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు? తోడికోడలి వైష్ణవిని ఎందుకు ఇంట్లోంచి పంపించేశారు?తన ఆడపడుచుపై హత్యాయత్నం చేసిందెవరు?తోడికోడలే పెళ్లి ఆపే ప్రయత్నం చేసిందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది. మరి, ఇందు అనుమానాలు నిజమయ్యాయా? అసలు తన చెల్లి.. పెళ్లి విషయంలో అలా ప్రవర్తించడానికి కారణాలేంటి? మతిస్థిమితంలేని ఆనంద్‌, ఆర్యల పెద్దమ్మ కుమార్తెను ‘ఇందు’కు కనిపించకుండా ఉండేలా వారంతా ఎందుకు జాగ్రత్తపడ్డారు?.. తెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (Vadhuvu Web Series Review in Telugu)..

ఎలా ఉందంటే: టైటిల్‌ని బట్టి ఇది పెళ్లి ఇతివృత్తంగా సాగే కథ అని అనుకోవడం సహజం. ఇది వివాహం చుట్టూ అల్లుకున్న కథేగానీ ‘ఉమ్మెత్త’ ఆకు కాన్సెప్ట్‌ను ముడిపెట్టడం విభిన్నం. అనుమానం పెనుభూతం అని పెద్దలు అంటుంటారు. దాని వల్ల మనుషుల జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పేందుకు ఈ సిరీస్‌ ఓ ఉదాహరణ. ఇందు పెళ్లి తంతుతో సిరీస్‌ ప్రారంభమవుతుంది. పెళ్లి మండపానికి తీసుకెళ్లే క్రమంలో కాబోయే వధువును అలంకరించడం, ఆనందంతో కుమార్తె తల్లిదండ్రులు హడావుడి చేయడం, కట్‌ చేస్తే.. ‘అయ్యగారూ...’ అంటూ పనిమనిషో, ఇంకెవరో వచ్చి కాబోయే పెళ్లి కూతురు పేరెంట్స్‌కు జరిగిన విషయం చెప్పడం.. వాళ్లు షాక్‌ అవడం.. పెళ్లి ఆగిపోవడం... ఎన్నో సినిమాల్లో చూసిన ఈ ఫార్మాట్‌లోనే ఈ సిరీస్‌ ప్రారంభ సన్నివేశాలుంటాయి. కానీ, ఇందుకు కాబోయే వాడితో ఆమె చెల్లి వెళ్లిపోవడం ఇక్కడ ట్విస్ట్‌. కథలోకి వెళ్లేకొద్దీ ఎన్నో మలుపులు తారసపడతాయి. అయితే, ఒక్కో ఎపిసోడ్‌లోని చిక్కు ముడిని ‘తర్వాత ఎపిసోడ్‌లో రివీల్‌ చేస్తారేమో’ అని ప్రేక్షకుడు ఎదురుచూడగా కాస్త నిరాశే ఎదురవుతుంది. ఇందు చెల్లి ఎందుకలా చేసిందనే కొన్ని సంగతులు మినహా మేజర్‌ సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ను రివీల్‌ చేయకపోవడం కాస్త అసంతృప్తే (Vadhuvu Review in Telugu).

దాదాపు 20 నిమిషాల నిడివితో 7 ఎపిసోడ్లలో రూపొందీదీ సిరీస్. తొలి నాలుగు ఎపిసోడ్లు ఒకెత్తు.. చివరి మూడు ఎపిసోడ్లు ఒకెత్తు అన్నట్లుగా ఉంటుంది. ఆనంద్‌- ఇందుల పెళ్లికి ఆమె సోదరిరావడం నుంచే కథ కొత్త దారిలోకి వెళ్తుంది. అయితే, అక్కకు కాబోయే వాడిని తానెందుకు పెళ్లి పీటలపై నుంచి తీసుకెళ్లిందో ఇందు సోదరి చెప్పే కారణం కామెడీగా కనిపిస్తుంది. ఇందు అత్తారింటిలో చోటుచేసుకునే పరిణామాలు మాత్రం ఆకట్టుకుంటాయి. కానీ, అవి లాజిక్‌కు ఆమడ దూరంలో ఉంటాయి. ఇందు అత్తారింటికి సంబంధించిన సన్నివేశాల్లో తెరపై ప్రతి పాత్రా ప్రేక్షకుడిని సందిగ్ధంలో పడేస్తుంది. తోడికోడలు వైష్ణవి చేసిన తప్పేంటి? ఆమెను ఇంట్లోంచి గెంటేసిందెవరో తెలుసుకునేందుకు ఇందు చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఈ క్రమంలో.. ఒకానొక సమయంలో ఇందు భర్త ఆనంద్‌ని, మరోవైపు అతడి తమ్ముడు ఆర్యను విలన్‌ అని ప్రేక్షకుడు పొరపడే అవకాశం ఉంది. వాటికి సమాధానం లభించక ముందే ‘వైష్ణవి సూసైడ్‌’ తెరపైకి రావడంతో మరో ప్రశ్న తలెత్తుతుంది. వైష్ణవి కేసును ఛేదించే క్రమంలో ‘ఇందు’ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించే సన్నివేశాలూ మరిన్ని సందేహాలు రేకెత్తిసాయి. చివరి ఎపిసోడ్‌లోనైనా అన్నింటికీ సమాధానం ఇస్తారనుకుంటే.. మరో ట్విస్ట్‌తో ‘సీజన్‌ 2’ ఉందని హింట్‌ ఇచ్చారు. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అని ఐదో ఎపిసోడ్‌లో ఓ పాత్రతో డైలాగ్‌ చెప్పించారుగానీ.. అసలు కథ సీజన్‌2లో ఉండనుంది. ఆనంద్‌, ఆర్య పెద్దమ్మ కుమార్తె మతిస్థితిమం లేకుండా ఉండటానికి కారణమెవరు?వైష్ణవిది ఆత్మహత్యా? హత్యా?.. ఇలా సీజన్‌1లో మిగిలిన పలు ప్రశ్నలకు సీజన్‌ 2నే సమాధానం!

ఎవరెలా చేశారంటే: ఇప్పటికే వెండితెరపై పలు చిత్రాలతో అలరిస్తున్న అవికా గోర్‌ ఈ వధువు పాత్రలో కట్టిపడేస్తుంది. సమస్యలకు కుంగిపోకుండా తెగువ చూపే అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఆనంద్‌ పాత్రకు నందు న్యాయం చేశారు. అలీ రెజా.. ఆర్యగా ఒదిగిపోయారు. అలీ రెజా, అవికా గోర్‌లకే స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువ. ఇందు చెల్లి, తల్లి, తండ్రి, అత్తగారు, ఆడపడుచు, ఆడపడుచు భర్త పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి (Vadhuvu Review in Telugu).

సాంకేతికంగా ఎలా ఉందంటే: శ్రీరామ్‌ మద్దూరి అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బలం. ముఖ్యంగా, అత్తారింటిలో కొన్ని వస్తువులను చూసి అవికా అనుమానపడే సన్నివేశాల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుంది. రామ్‌ కె. మహేశ్‌ కెమెరా పనితీరు బాగుంది. 20నిమిషాలు, అంతకంటే తక్కువ నిడివితో క్రిస్పీగా ‘కట్‌’ చేసి బోర్‌ కొట్టకుండా చేయడంలో అనిల్‌ కుమార్‌ మంచి మార్కులు కొట్టేశారు. సహానా దత్తా రాసిన కథను ఇక్కడి నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు పోలూరు కృష్ణ విజయవంతమయ్యారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి (Vadhuvu Review in Telugu).

కుటుంబంతో కలిసి చూడొచ్చా: ఈ సిరీస్‌లో ఎలాంటి అసభ్య పదజాలం లేదు. అభ్యంతరకర దృశ్యాలు లేవు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.

  • బలాలు
  • + కథ, కథనం
  • + అవికా గోర్‌, అలీ రెజా నటన 
  • + నేపథ్య సంగీతం
  • బలహీనతలు
  • - పలు సన్నివేశాల్లో లాజిక్‌ మిస్‌ అవడం
  • ట్విస్ట్‌లు రివీల్‌ చేయకపోవడం
  • చివరిగా: ఈ ‘వధువు’ పెళ్లి తంతుకు థ్రిల్‌ అవ్వాల్సిందే (Vadhuvu Review in Telugu)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని