Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

Valari Review: రితికా సింగ్‌ నటించిన హారర్‌ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 06 Mar 2024 17:28 IST

Valari Review; చిత్రం: వళరి; తారాగణం: రితికా సింగ్‌, శ్రీరామ్‌, ఉత్తేజ్‌, సుబ్బరాజు తదితరులు; సంగీతం: టీఎస్‌ విష్ణు; దర్శకత్వం: మ్రితికా సంతోషిణి; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

‘గురు’ ఫేమ్‌ రితికా సింగ్‌ (Ritika Singh), శ్రీరామ్‌ (Sri Ram) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వళరి’. మ్రితికా సంతోషిణి (Mritika Santhoshini) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6న విడుదలైంది. మరి, ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉంది? టైటిల్‌ అర్థమేంటి? (Valari Review)..

కథేంటంటే?: నవీన్‌ నాయుడు (శ్రీరామ్‌) ఇండియన్‌ నేవీ కెప్టెన్‌. అతని భార్య దివ్య (రితికా సింగ్‌). కుమారుడు మాదన్న. బదిలీ కారణంగా నవీన్‌ కుటుంబం చెన్నై నుంచి కృష్ణంపట్నం (నెల్లూరు) వెళ్తుంది. కొన్ని రోజులు కృష్ణపట్నంలోని నేవీ క్వార్టర్స్‌లో ఉండి, తర్వాత వెంకటాపురంలోని పాత బంగ్లాకు షిప్ట్‌ అవుతుంది. అందులో దెయ్యాలుంటాయనే ప్రచారం గురించి తెలిసినా నవీన్‌ ఎందుకు ఆ భవనంలో ఉండేందుకు ఇష్టపడ్డాడు? దానికి, దివ్యకు ఉన్న సంబంధమేంటి?ఒకప్పుడు ఆ భవనంలో ఏం జరిగింది? దాని యజమానిగా రామచంద్ర (ఉత్తేజ్‌) ఎందుకు చలామణీ అయ్యాడు? దివ్య గతమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Valari Review in Telugu).

ఎలా ఉందంటే?: తప్పు చేస్తే ఏదో విధంగా తప్పక శిక్ష అనుభవించాల్సిందేనన్న అంశాన్ని తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఓ సమస్య ఇతివృత్తంగా రాసుకున్న కథకు హారర్‌ టచ్‌ ఇచ్చారు. ఆలోచన బాగున్నా కొంతవరకే దాన్ని ప్రభావవంతంగా చూపించగలిగారు. ఓ చిన్నారి ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ పాప అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా తనే చేసిందా? దాని వెనుక మరో కోణం ఉందా? అనే ఉత్కంఠ వీడకముందే మరో స్టోరీ ప్రేక్షకుల ముందుకొస్తుంది. కథలోకి వెళ్లేకొద్దీ ఆడియన్స్‌ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. నవీన్‌ కుటుంబ పరిచయానికి అధిక సమయం తీసుకున్నారు. కెప్టెన్‌ ఫ్యామిలీ బదిలీపై కృష్ణపట్నం వెళ్లడం, తర్వాత వెంకటాపురానికి మారడం నుంచి కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ, భయపెట్టే ఘటనలైతే ఉండవు. ఆ బంగ్లా వివరాలు సేకరించే క్రమంలో దివ్యకు వళరి దొరకడం, దాని కారణంగా ఆమె రోడ్డు ప్రమాదానికి గురవడంతో కథ మలుపు తిరుగుతుంది. సైక్రియార్టిస్ట్‌ రుద్ర (సుబ్బరాజు) పాత్ర ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తుంది (Valari Review). 

ద్వితీయార్ధంలో దివ్య ఫ్లాష్‌బ్యాక్‌ను హైలైట్‌ చేశారు. దివ్య తల్లిగా రితికానే నటించడం విశేషం. మహిళలు.. మగవారికి ఏమాత్రం తీసిపోరని చాటిచెప్పే ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే కర్రసాము ఎపిసోడ్‌ ప్రధాన ఆకర్షణ. అక్కడే రామచంద్ర నిజ స్వరూపం కూడా బయటపడుతుంది. దీంతో, గతం తెలిసిన దివ్య.. రామచంద్రను ఏం చేస్తుందోనన్నది ఊహించొచ్చు. చిన్నారుల పాత్రలకు మాదన్న, అక్కన్న (ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ పాత్ర) పేర్లు పెట్టడం, వళరితోపాటు ప్రసాదిని, ప్రత్యేక ఐరన్‌ లాకర్‌.. ఇలా మన మూలాల గురించి ఈ తరం వారు తెలుసుకునేలా ఆసక్తి క్రియేట్‌ చేయడంలో దర్శకురాలికి మంచి మార్కులు పడతాయి. కానీ, రివెంజ్‌ స్టోరీకి హారర్‌ హంగులు అతకలేదు. ఇంతకీ వళరి అంటే ఓ ఆయుధం. తమిళనాడులో ఎక్కువగా వినియోగించేవారు (Valari Review).

ఎవరెలా చేశారంటే?: రెండు విభిన్న పాత్రల్లో రితికా సింగ్‌ ఒదిగిపోయారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో బాగా ఆకట్టుకుంటారు. నేవీ కెప్టెన్‌ నవీన్‌ నాయుడుగా శ్రీరామ్‌ సెటిల్డ్‌గా నటించారు. వ్యక్తిగత జీవితంలో మంచి భర్త, తండ్రిగా మెప్పించారు. రెండు పార్శ్వాలున్న రామచంద్ర క్యారెక్టర్‌కు ఉత్తేజ్‌ తగిన న్యాయం చేశారు. రుద్రగా సుబ్బరాజు, మాదన్న పాత్రధారి తదితరులు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించాయి. సినిమా నిడివి రెండు గంటలే ఉన్నా ఇంకాస్త ఎడిటింగ్‌ చేస్తే బాగుండేది. ‘నోట్లోకి ఏం వెళ్తున్నాయే (ఆహారం) కాదు.. నోటి నుంచి ఏం బయటకు వస్తున్నాయో (మాటలు) అది ముఖ్యం’, ‘నిజమంటే వినేది కాదు చూసేది’ వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ‘వానం’ (వేదం తమిళ రీమేక్‌) సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది(Valari Review).

ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?: కుటుంబమంతా కలిసి చూడొచ్చు. భయభ్రాంతులకు గురిచేసే ఘటనలు, హింసాత్మక సన్నివేశాలు, అసభ్య పదజాలం.. ఇలాంటివేవీ ఇందులో లేవు. పైగా చక్కని సందేశం ఉంది.

  • బ‌లాలు
  • + రితికా సింగ్‌, శ్రీరామ్‌ నటన
  • + సాంకేతిక బృంద పనితీరు
  • బ‌ల‌హీన‌త‌లు
  • -  కథనం
  • - అక్కడక్కడా సాగదీతగా సన్నివేశాలు
  • చివ‌రిగా: ‘వళరి’.. మరో రివెంజ్‌ స్టోరీ! (Valari Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని