Jorugaa Husharugaa Review: రివ్యూ: జోరుగా హుషారుగా.. ‘బేబీ’ ఫేమ్‌ విరాజ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే..?

‘బేబీ’ ఫేమ్‌ విరాజ్‌ అశ్విన్‌, పూజిత పొన్నాడ నటించిన ‘జోరుగా హుషారుగా’ ఎలా ఉందంటే..?

Published : 15 Dec 2023 16:50 IST

Jorugaa Husharugaa చిత్రం: జోరుగా హుషారుగా; నటీనటులు: విరాజ్‌ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మాజీ, క్రేజీ కన్నా, చంద్ర, తదితరులు; సంగీతం: ప్రణీత్‌ మ్యూజిక్‌; ఛాయాగ్రహణం: పి.మహి రెడ్డి; నిర్మాత: నిరీష్‌ తిరువీధుల; దర్శకత్వం: అను ప్రసాద్‌; విడుదల తేదీ: 15-12-2023

‘బేబీ’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన నటుడు విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin). ఇప్పుడాయన హీరోగా అను ప్రసాద్‌ తెరకెక్కించిన చిత్రమే ‘జోరుగా హుషారుగా’ (Jorugaa Husharugaa Review). ప్రచార చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది జోరుగా హుషారుగా సాగిందా? లేదా?

కథేంటంటే: పోచంపల్లిలోని ఓ చేనేత కుటుంబానికి చెందిన కుర్రాడు సంతోష్‌ (విరాజ్‌ అశ్విన్‌). ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తానని పట్టుబట్టి.. తండ్రి చేత సొసైటీలో రూ.20లక్షలు అప్పు చేయించి, ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వస్తాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కట్టించుకున్న కన్సెల్టింగ్‌ కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడతాడు. దీంతో స్నేహితుడి సహాయంతో సాచీ మీడియా ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. తనకొచ్చే చాలీచాలని జీతంతో తండ్రి అప్పు తీర్చడం పెద్ద సమస్యగా మారుతుంది (Jorugaa Husharugaa Review). బ్యాంకులో లోన్‌ కోసం ప్రయత్నించగా తనకొచ్చే జీతానికి అంత పెద్ద మొత్తం అప్పు ఇవ్వడం కుదరదని చెబుతారు. దీంతో తన బాస్‌ ఆనంద్‌ (మధునందన్‌)ను మెప్పించి జీతం పెంచుకునేందుకు ఓ ప్రణాళిక రచిస్తాడు సంతోష్‌. 35ఏళ్లు వచ్చినా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న తన బాస్‌ను ఎలాగైనా పెళ్లి పీటలెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీస్‌లోనే ఉద్యోగానికి చేరుతుంది సంతోష్‌ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ). ఆఫీస్‌లో ఉన్న పరిస్థితుల వల్ల సంతోష్‌ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టొద్దని నిత్యకు చెబుతాడు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సంతోష్‌ ప్రేమ, ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది (Jorugaa Husharugaa Review). సంతోష్‌ తన ప్రేమను ఆఫీస్‌లో చెప్పకూడదని ఎందుకు అనుకున్నాడు? తన బాస్‌ వల్ల అతని ప్రేమకు ఎదురైన చిక్కులేంటి? తండ్రితో చేయించిన అప్పు తీర్చేందుకు సంతోష్‌ ఏం చేశాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా రూపుదిద్దుకుంది.

ఎలా సాగిందంటే: ఇదొక రొటీన్‌ ప్రేమకథా చిత్రం. దీనికి తండ్రి సెంటిమెంట్‌ను జోడించి భావోద్వేగభరితంగా నడిపించే ప్రయత్నం చేశారు. అటు ప్రేమకథలో కొత్తదనం లేకపోవడం.. ఇటు తండ్రీతనయుల అనుబంధాల్లోని ఎమోషన్‌ను సరిగ్గా చూపించలేకపోవడంతో ఇదొక వృథా ప్రయత్నంలా అనిపిస్తుంది. సంతోష్‌ ప్రపంచం.. అతని ప్రేమకథ.. ఆఫీస్‌ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా కాస్త రొటీన్‌గానే మొదలవుతుంది (Jorugaa Husharugaa Review). ఆ తర్వాత నిత్య అతని ఆఫీస్‌లో జాయిన్‌ అవ్వడంతో కథలో కాస్త వినోదం మొదలవుతుంది. తన ప్రేమకథను దాచి పెట్టి సంతోష్‌ ఆఫీస్‌లో పడే ఇబ్బందులు కాలక్షేపాన్నిస్తాయి. ఈ క్రమంలోనే అతను నిత్యకు తన పాత ప్రేమకథను వివరిస్తాడు. ఆ ఎపిసోడ్‌ బోరింగ్‌గా అనిపిస్తుంది. విరామానికి ముందు సుచిత్ర తన బాస్‌ ఆనంద్‌ను ప్రేమిస్తున్నట్లు సంతోష్‌కు చెప్పడం.. వాళ్లిద్దరిని కలపడం కోసం అతడు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో ఆనంద్‌.. సంతోష్‌కు ట్విస్ట్‌ ఇవ్వడంతో కథ ఆసక్తిగా మారుతుంది. 

ఇక ద్వితీయార్ధమంతా సంతోష్‌ తన ప్రేమను ఆనంద్‌ దగ్గర ఎలా బయటపెట్టాడు? నిత్యపై నుంచి అతని దృష్టి మళ్లించి సుచిత్రను ఎలా దగ్గర చేశాడు? తండ్రి అప్పు తీర్చడం కోసం ఏం చేశాడు? అన్న అంశాల చుట్టూ తిరుగుతుంది. ప్రథమార్ధంతో పోల్చితే ఈ ద్వితీయార్ధంలోనే కాస్త కాలక్షేపం దొరుకుతుంది. ఓవైపు ఆనంద్‌.. ప్రేమ పేరుతో నిత్య వెంటబడటం.. మరోవైపు తన ప్రేమను బయటపెట్టలేక సంతోష్‌ పడే ఇబ్బంది.. ఈ మధ్యలో సుచిత్ర తన ప్రేమను గెలిపించుకోలేక సతమతమయ్యే తీరు వినోదం పంచుతాయి (Jorugaa Husharugaa Review). ఊళ్లో సంతోష్‌ తండ్రిని అప్పు తీర్చమంటూ సొసైటీ పెద్దలు పంచాయితీ పెట్టడం.. ఈ క్రమంలో అతన్ని అవమానించడం.. దీంతో సంతోష్‌ అప్పు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టడంతో కథ కాస్త సీరియస్‌గా మారుతుంది. ఇక, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ఆనంద్‌ - సంతోష్‌ మధ్య జరిగే సంభాషణలు, సుచిత్ర ప్రేమను గెలిపించడం కోసం నిత్య-సంతోష్‌ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. ముగింపు ఊహలకు తగ్గట్లుగానే ఉన్నా ఫర్వాలేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: మధ్యతరగతి కుర్రాడిగా సంతోష్‌ పాత్రలో విరాజ్‌ చక్కగా ఒదిగిపోయాడు. ఇటు కామెడీ సన్నివేశాల్లో.. అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచాడు. పూజిత అందం, అభినయంతో ఆకట్టుకుంది. సోనూ ఠాకూర్‌ పాత్రకు కథలో అంత ప్రాధాన్యత లేదు. ఆమె ట్రాక్‌ కథకు స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డు తగిలింది (Jorugaa Husharugaa Review). విరాజ్‌ బాస్‌గా ఆనంద్‌ పాత్రలో మధునందన్, అలాగే ఫ్రెండ్‌గా రాజేష్‌ ఖన్నా పంచిన వినోదాలు అందర్నీ మెప్పిస్తాయి. బ్రహ్మాజీ, సాయికుమార్, సిరి హనుమంత్, రోహిణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు రాసుకున్న ప్రేమకథలో కొత్తదనం లేదు. అలాగే ఫాదర్‌ సెంటిమెంట్‌ను భావోద్వేగభరితంగా రాసుకోలేకపోయారు. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

  • బలాలు:
  • + విరాజ్‌ నటన
  • ద్వితీయార్ధంలో పండే వినోదం
  • బలహీనతలు:
  • - కొత్తదనం లేని కథ
  • - సాగతీత సన్నివేశాలు
  • - ప్రథమార్ధం

చివరిగా: ద్వితీయార్ధంలోనే ఆ జోరు.. హుషారు..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని