Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

అఘోరాగా విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్‌ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం.

Updated : 08 Mar 2024 14:55 IST

Gaami movie review: చిత్రం: గామి, నటీనటులు: విశ్వక్‌ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక, దయానంద్‌ రెడ్డి, మహమ్మద్‌ సమద్, శాంతి రావు, మయాంక్‌ పరాక్, శ్రీధర్‌ తదితరులు.. కూర్పు: రాఘవేంద్ర, సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ, రచన, దర్శకత్వం: విద్యాధర్‌ కాగిత, నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌, విడుదల తేదీ: 08-03-2024

ఈ మహా శివరాత్రికి బాక్సాఫీస్‌ బరిలో సందడంతా చిన్న బడ్జెట్‌ చిత్రాలదే. వాటిలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సినిమాల్లో ‘గామి’(Gaami) ఒకటి. విశ్వక్‌ సేన్‌ (vishwak sen) హీరోగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో అంగీకరించిన చిత్రమిది. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. మరి ఈ ‘గామి’ కథేంటి? థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది?

కథేంటంటే: శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఈ జ్ఞాపకాలేం అతడికి గుర్తుండవు. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడుగా భావించి... ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాలి (Gaami movie review).

ఎలా సాగిందంటే: ‘కొత్తదనం నిండిన కథలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సంతృప్తినిస్తుంది’.. అని ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో విశ్వక్‌ చెప్పిన మాటలివి. తెరపై సినిమా చూస్తున్నంత సేపు నిజంగా ప్రేక్షకులకు అదే అనుభూతి కలుగుతుంది. దర్శకుడు కథను ఆరంభించిన తీరు.. దాన్ని మూడు జీవిత కథలుగా సమాంతరంగా చూపిస్తూ ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లిన విధానం.. ఆఖర్లో వాటన్నింటినీ ఒకదానితో ఒకటి ముడిపెట్టిన పద్ధతి.. ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ముగింపు సన్నివేశాలను చూసినప్పుడు కచ్చితంగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ గుర్తుకు వస్తుంది.

శంకర్‌గా విశ్వక్‌ను పరిచయం చేస్తూ సినిమాను ఆరంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. తోటి అఘోరాలంతా తనపై దాడికి ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే కుస్తీ పోటీ.. దాంట్లో తలపడే క్రమంలో మానవ స్పర్శ తగిలినప్పుడు తన శరీరంలో వచ్చే మార్పులు.. ఇవన్నీ శంకర్‌ గతంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి. ఆ వెంటనే దేవదాసి దుర్గ కథ తెరపైకి వస్తుంది. ఈ ఎపిసోడ్‌లో దేవదాసి వ్యవస్థను చూపించిన తీరు కూడా మెప్పిస్తుంది. దుర్గ కూతురు ఉమ కథే ఈ చిత్రానికి మూలం. వీళ్ల జీవితాల్లోని సంఘర్షణ కూడా ప్రేక్షకుల మదిని బలంగా తాకుతుంది. ఇక మనుషులపై జరిగే అక్రమ వైద్య ప్రయోగాల నేపథ్యంలో వచ్చే కథ కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. సీటీ 333పై జరిగే ప్రయోగాలు.. అతడిని బంధించి ఉంచిన ప్రపంచం.. అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ద్రోణగిరి పర్వత శ్రేణులకు చేరుకునే క్రమంలో శంకర్‌ - జాహ్నవి చేసే సాహసోపేతమైన ప్రయాణం ఆకట్టుకుంటుంది. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై అంచనాలు పెంచుతాయి. ఆ తర్వాత కథ పెద్దగా ముందుకు సాగనట్లు అనిపిస్తుంది. ఉమను బలవంతంగా దేవదాసిగా మార్చేందుకు ఊరి సర్పంచ్‌ వేసే ఎత్తుగడ.. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ఆ పాప చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్‌ ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే: అఘోరా పాత్రలో విశ్వక్‌ ఒదిగిపోయారు. భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. సీటీ333 పాత్రలో మహమ్మద్‌, ఉమ పాత్రలో హారిక నటన కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. జాహ్నవి పాత్ర కోసం చాందిని పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ నటన మనసుల్ని హత్తుకుంటుంది. దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దిన తీరు.. తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. అయితే.. కథలోని కొన్ని అంశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. మనుషులపై జరుగుతున్న అక్రమ వైద్య పరిశోధనల నేపథ్యంలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్‌ ఏమాత్రం అర్థం కావు. విశ్వనాథ్‌ తన ఛాయాగ్రహణంతో సినిమాకు ప్రాణం పోశారు. నరేష్‌ కుమారన్‌ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ‘‘శివమ్‌’’ పాటను చూపించిన తీరు బాగుంది. పరిమిత బడ్జెట్‌లోనే మంచి గ్రాఫిక్స్‌ వర్క్‌ను చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

 బలాలు:

+ కథ, స్క్రీన్‌ప్లే

+ విశ్వక్‌ నటన

+ విజువల్‌ ఎఫెక్ట్స్, విరామ.. పతాక సన్నివేశాలు

బలహీనతలు:

- నెమ్మదిగా సాగే కథనం

- లాజిక్‌ లేని కొన్ని సీన్స్‌

చివరిగా: ‘గామి’.. కనువిందు చేసే భిన్నమైన ప్రయత్నం!  

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని