
అమెరికా వైపే విద్యార్థుల చూపు!
ప్రతిఏటా వెళ్తున్న వారిలో 20శాతం భారతీయులే
దిల్లీ: అమెరికాలో ఉన్నత చదువులపై భారతీయులకు ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతిఏటా లక్షల సంఖ్యలో భారత విద్యార్థులు అమెరికా పయణమవుతున్నారు. ఇలా 2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకున్నట్లు ‘ఓపెన్ డోర్స్ నివేదిక’ వెల్లడించింది. తాజాగా ఈ నివేదికను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసింది. ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా 10లక్షల మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్తుంటారు. వీరిలో 20శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని..గతకొంతకాలంగా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఓపెన్ డోర్స్ నివేదిక అభిప్రాయపడింది.
పది సంవత్సరాల్లో రెట్టింపు:
‘అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెలుతున్న భారతీయుల సంఖ్య గడిచిన పది సంవత్సరాల్లో రెట్టింపు అయ్యింది. ఉన్నత విద్యకు అమెరికానే ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత సాధించిందో మాకు తెలుసు. ఇక్కడ లభించే ప్రాక్టికల్ అప్లికేషన్, అనుభవంతో కూడిన ఉన్నత ప్రమాణాలే విద్యార్థులను అంతర్జాతీయ మార్కెట్లో ముందువరుసలో నిలబెడుతున్నాయి’ అని అమెరికా రాయబారి డేవిడ్ కెన్నడీ వెల్లడించారు. భారత్లోని దిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయిలో ఉన్న తమ సలహా కేంద్రాల ద్వారా అమెరికా విద్యపై భారతీయ విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు డేవిడ్ కెన్నడీ తెలిపారు.
అమెరికాలోని 4500 గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యావకాశాలపై కచ్చితమైన, సమగ్ర సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. వై-యాక్సిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ఎడ్యుకేషన్యూఎస్ఏ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలో ఉన్నత చదువులపై మరింత సమాచారం కోసం ‘ఎడ్యుకేషన్యూఎస్ఏ ఇండియా’ యాప్ను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అమెరికాలో విదేశీ విద్యార్థుల చదువులకు సంబంధించి ‘ఓపెన్ డోర్స్’ పేరుతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రతిఏటా నివేదిక రూపొందిస్తోంది.