Published : 14/11/2020 10:35 IST

ట్రంప్‌ ఓటమిని ఒప్పుకుంటున్నారా..?

అధ్యక్షుడి నోట ఆసక్తికర వ్యాఖ్యలు 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోలేదంటూ భీష్మించుకు కూర్చున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన మొండిపట్టు వీడుతున్నట్లు కన్పిస్తోంది. ‘ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు’ అని గత కొన్ని రోజులుగా చెబుతున్న ట్రంప్‌.. తాజాగా తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం గమనార్హం. శ్వేతసౌధంలోని రోజ్‌ గార్డెన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ ఈ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. 

కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ట్రంప్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు అమెరికాలో మరోసారి లాక్‌డౌన్‌ తీసుకొచ్చే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. వైరస్‌ను అడ్డుకునేందుకు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జటిలం చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల రోజుకు 50 బిలియన్‌ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, వేలాది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్‌ తెలిపారు. తమ ప్రభుత్వం అయితే మరోసారి లౌక్‌డౌన్‌ను అమలుచేసే ఆలోచనలో లేదని వెల్లడించారు. 
ఈ సందర్భంగా తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది తెలియదంటూ ఎన్నికల్లో ఓటమి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను తీసుకురాదు. అయితే భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చు. వచ్చేది ఏ ప్రభుత్వమో ఎవరికి తెలుసు? దానికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే మేం మాత్రం లాక్‌డౌన్‌కు వెళ్లం’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. 

నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఫలితాలు వెలువడి వారం గడిచినా ఓటమిని అంగీకరించట్లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోన్న ట్రంప్‌.. ఫలితాలపై న్యాయపోరాటానికి దిగారు. తన ఓట్ల దొంగలించారంటూ పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అగ్రరాజ్యాన్ని వణికించిన కరోనా తాజాగా రెండోసారి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో కోటి మందికి పైగా కరోనా బారిన పడగా.. 2,44,302 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని, ట్రంప్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ మాత్రం కరోనాను తక్కువ చేసి చూస్తుండటం గమనార్హం. 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని