
నేటి ఎన్నికలో ఓటేసేది ఎందరు?
అగ్రరాజ్య ఎన్నికల వేళ మిలియన్ డాలర్ ప్రశ్న..
వాషింగ్టన్: అగ్రరాజ్యంలోని పలురాష్ట్రాల్లో ముందస్తు, పోస్టల్ ఓటింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం రాత్రి నాటికి 98 మిలియన్లకు పైబడి అమెరికన్ పౌరులు తమ ఓటుహక్కును నియోగించుకున్నారు. 2016 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్ల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. ‘యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్’ గణాంకాల ప్రకారం అమెరికాలోని అత్యధిక జనాభా గల పది రాష్ట్రాల్లో.. రెండింట మూడువంతుల మంది శనివారం నాటికే పోస్టల్ ఓటు వేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే అమెరికాలో గత వంద సంవత్సరాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో.. పోలింగ్ శాతం అరవైకి పైబడిన సందర్భాలు కేవలం నాలుగే అనేది నమ్మలేని నిజం. కాగా, పోస్టల్ ఓటింగ్ మాదిరి జోరు ప్రత్యక్ష ఓటింగులో కూడా కనిపిస్తే అది ఓ కొత్త రికార్డే అని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఈ అంశంపైనే రిపబ్లికన్ల ఆశలన్నీ ఉన్నాయనేది కూడా నిర్వివాదం. ఈ నేపథ్యంలో 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా ఓటు వేయాల్సింది ఎవరు? అనే కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇక దీని సమాధానమే అమెరికా 46వ అధ్యక్షుడిని నిర్ణయించనుంది అనటం అతిశయోక్తి కాదు.
వివిధ రాష్ట్రాల్లో పోస్టల్ ఓటింగ్..
టెక్సాస్, హవాయి, మోంటానా రాష్ట్రాల్లో ఇప్పటికే పోలైన పోస్టల్ ఓట్లు 2016 మొత్తం ఓట్లను మించిపోయాయి.ఇక ఎన్నికలకు అసలైన రణరంగంగా నిలిచే పెన్సిల్వేనియాలో ముందస్తు ఓటింగు 40 శాతానికి చేరింది. జార్జియాలో సుమారు నాలుగు మిలియన్ల ఓటర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలియచేశారు. 2016 మొత్తం ఓట్ల సంఖ్యతో పోలిస్తే ఒహైయోలో పోస్టల్ ఓట్లు 53శాతం, మిషిగన్‌లో 60 శాతం గా ఉంది. పోస్టల్ బ్యాలెట్ విధానంపై ట్రంప్ సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆయన మద్దతుదారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటర్లు స్వయంగా ఓటేయడానికే మొగ్గు చూపుతారు. దీనితో ఆయా రాష్ట్రాలు ఎన్నికల రోజు అత్యధిక రద్దీని చవిచూస్తాయని అంచనా. మిషిగాన్‌లో ప్రత్యక్ష ఓటింగు జోరుగా ఉంటుందని.. డెట్రాయిట్ తదితర నగరాల్లో బారులు తీరిన ఓటర్లే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.
పెండింగ్ ఓట్ల సంగతేంటి?
అయితే ఓటర్ల వద్ద ఇంకా పెండింగులో ఉన్న పోస్టల్ ఓట్లను గురించి ఎన్నికల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సోమవారం సాయంత్రం నాటికి సుమారు 29.9 మిలియన్ల బ్యాలెట్లు తిరిగి రావాల్సి ఉందని వారు వివరించారు. ఒక్క ఫ్లోరిడాలోనే 1.35 మిలియన్ బ్యాలెట్లు అందాల్సి ఉందని గణాంకాలు చెపుతున్నాయి. కాగా సౌత్ కరోలినాలో ఈ సంఖ్య 35 వేలు అని తెలిసింది. పౌరులు తమ వద్ద ఉన్న పోస్టల్ బ్యాలెట్లను వెంటనే దాఖలు చేయాలని అధికారులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వారు తమ ఓటు కచ్చితంగా పరిగణనలోకి వచ్చేందుకు వీలుగా.. వాటిని స్వయంగా హాజరై జమ చేయాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంగళవారం నాడు భారీ పోలింగు జరుగుతుందనే అంచనాల ప్రకారమే తాము సిద్ధమైనట్టు పలు రాష్ట్రాల ఎన్నికల అధికారులు ప్రకటించారు.
హామీ ఇచ్చిన అధికారులు
ఇదిలా ఉండగా నేటి ఎన్నికలు సురక్షితంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని పలు రాష్ట్రాల అటార్నీ జనరల్స్ హామీ ఇచ్చారు. న్యాయబద్దంగా వేసిన ఓట్లన్నీ లెక్కించే వరకూ ఎన్నికల ప్రక్రియ పూర్తికాదని వారు స్పష్టం చేశారు. ఎన్నికల రోజు తరువాత ఓట్ల లెక్కింపు కొనసాగరాదన్న ట్రంప్ వర్గం వాదనలు వీగిపోయాయి. మిషిగాన్తో సహా పలు రాష్ట్రాల్లో పోస్టల్ ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆయా చోట్ల సోమవారం బ్యాలెట్లు ఉన్న కవర్లను తెరచి వాటి నంబర్లను సరిపోలుస్తున్నారు.
పోస్టల్ విధానంలో తమ మద్దతుదారుల ఓట్లు భారీగా పోలయ్యాయని డెమొక్రాటిక్ పార్టీ సంబరపడుతోంది. బారులుతీరి ప్రత్యక్షంగా ఓటు వేయటమే తమ అభిమానుల పంధా అని రిపబ్లికన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏతావాతా పోరుసాగే రాష్ట్రాలైన నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల్లో ట్రంప్ మెజారిటీ ఓటర్లను ఆకర్షించగలరా అనే అంశంపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. మరి ఎవరి అంచనా నిజమైతుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకూ ఆగాల్సిందే!
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.