అమెరికాలో లక్ష్మీకటాక్షం, సరస్వతీ భాగ్యం

అమెరికాలో భారత్‌ ప్రభ వెలిగిపోతోంది. అటు లక్ష్మీకటాక్షం, ఇటు సరస్వతీ భాగ్యంతో భారతీయులు సత్తా చాటుతున్నారు. సంపాదనలోనూ, ఉన్నత చదువుల్లోనూ అమెరికన్లను సైతం వెనక్కి నెట్టేస్తున్నారు.

Updated : 26 Aug 2021 10:23 IST

సంపాదన, ఉన్నత విద్యలో భారతీయుల సత్తా

జాతీయ సగటు కన్నా మనోళ్ల వాటా అధికం

వాషింగ్టన్‌: అమెరికాలో భారత్‌ ప్రభ వెలిగిపోతోంది. అటు లక్ష్మీకటాక్షం, ఇటు సరస్వతీ భాగ్యంతో భారతీయులు సత్తా చాటుతున్నారు. సంపాదనలోనూ, ఉన్నత చదువుల్లోనూ అమెరికన్లను సైతం వెనక్కి నెట్టేస్తున్నారు. జానాభా గణనపై తాజాగా విడుదలైన ఓ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నివేదికను విశ్లేషిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం అమెరికాలోని కుటుంబ జాతీయ సగటు ఆదాయం 63,922 డాలర్లు. దానికన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో భారతీయ కుటుంబాల సగటు ఆదాయం (1,23,700 డాలర్లు) ఉండడం గమనార్హం. ఈ విషయంలో అమెరికాలోని ఆసియన్లందరిలో భారతీయులే ముందున్నారు. 97,129 డాలర్లతో తైవాన్‌, 95 వేల డాలర్లతో ఫిలిప్పీన్స్‌ దేశాల వారు 2, 3 స్థానాల్లో ఉన్నారు. 40 వేల డాలర్ల కన్నా తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాల జాతీయ సగటు 33 శాతం కాగా, భారతీయ కుటుంబాల సగటు 14 శాతం మాత్రమే. అలాగే విద్యలోనూ మనవాళ్లు దూసుకెళ్తున్నారు. అమెరికాలో గ్రాడ్యుయేట్ల జాతీయ సగటు 34 శాతం కాగా, భారతీయ అమెరికన్‌ గ్రాడ్యుయేట్ల సగటు ఏకంగా 79 శాతం ఉండడం విశేషం. కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్థిక వ్యవహారాలు, వైద్యం లాంటి కీలక రంగాల్లో అత్యధిక వేతనాలు ఉండే ఉద్యోగాలను భారతీయులే గణనీయంగా దక్కించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అమెరికాలోని వైద్యుల్లో 9 శాతం భారతీయులేనని వెల్లడించింది.

ఆసియన్‌ అమెరికన్ల సంఖ్య మూడింతలు

అమెరికాలో ఆసియన్ల సంఖ్య గత 3 దశాబ్దాల్లో దాదాపు మూడింతలైంది. జనాభా పరంగా అమెరికాలోని నాలుగు ప్రధాన జాతుల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నది ఆసియన్లే. అమెరికాలో ప్రస్తుతం 40 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో 16 లక్షల మంది వీసా ఉన్నవారు. 14 లక్షల మంది నివాస హోదా ఉన్నవారు, 10 లక్షల మంది అక్కడే పుట్టినవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని