Updated : 12 Nov 2020 13:05 IST

ట్రంప్‌ ధోరణి చికాకు కలిగిస్తోంది

అయినా అధికార మార్పిడికి ఢోకా లేదు: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోవడం చికాకు కలిగిస్తోందంటూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇది అధ్యక్ష వారసత్వ సంప్రదాయానికి మంచి చేయదని అన్నారు. అయితే ట్రంప్‌ ధోరణి వల్ల తన అధికార బదిలీ ప్రణాళికపై ఎలాంటి ప్రభావమూ పడలేదని, ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలు తనకు అభినందనలు తెలుపుతున్నారని బైడెన్‌ పేర్కొన్నారు. అధికార బదిలీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, ట్రంప్‌ యంత్రాంగం అందుకు తిరస్కరించినా తమకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావని, ప్రమాణ స్వీకారం చేసే జనవరి 20 నాటికి అంతా సవ్యంగానే మారుతుందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అధికార మార్పిడి కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాదని అన్నారు. ఇప్పటికే వైట్‌హౌస్‌ యంత్రాంగం, కేబినెట్‌ కూర్పుపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. తనకు ఓటేసిన ప్రజలతో పాటు ట్రంప్‌ మద్దతుదారులూ ఏకతాటిపైకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరేడేళ్లుగా చూసిన భ్రష్ట రాజకీయాల నుంచి దేశానికి విముక్తి కల్పించి మళ్లీ అమెరికాకు గౌరవప్రదమైన స్థానాన్ని సాధిస్తామని ఉద్ఘాటించారు.  ఇదిలా ఉండగా ఎన్నికల్లో బైడెన్‌కు ప్రజలు స్పష్టమైన గెలుపును అందించారని ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే బైడెన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయన్నారు. ఆరోగ్య చికిత్స తమ ప్రాథమిక హక్కే తప్ప అదొక ‘ప్రత్యేక’ సౌకర్యం కాదు అని ప్రజలు తమ ఓట్ల ద్వారా స్పష్టం చేశారని కమల ట్వీట్‌ చేశారు. 

ప్రతినిధుల సభలో స్వల్ప మెజార్టీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు ప్రతినిధుల సభలోని 435 సీట్లకూ ఒకేసారి పోలింగ్‌ జరిగింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డెమొక్రటిక్‌ పార్టీ 218 స్థానాలు గెలవడంతో మరో రెండేళ్లు సభలో వారిదే ఆధిపత్యం కానుంది. అయితే వారి మెజార్టీ తగ్గనుంది. ఎన్నికల ముందున్న 232 సీట్లలో కనీసం 14 సీట్లు ఓడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్లు అనూహ్యంగా పుంజుకుని షాక్‌ ఇచ్చారు. అటు సెనేట్‌లోనూ వారిదే పైచేయి. ఈ పరిణామాలు చట్ట సభల్లో బిల్లుల అంగీకారానికి సంబంధించి బైడెన్‌ వర్గానికి ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

జార్జియాలో మరోసారి ఓట్ల లెక్కింపు
జార్జియాలో ఎన్నికల ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ రిపబ్లికన్‌ పార్టీ  ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ఓట్ల లెక్కింపును మొదట్నుంచి మళ్లీ చేతులతో లెక్కించేందుకు నిర్ణయించామని ఓ అధికారి తెలిపారు. 

బైడెన్‌ హయాంలో వలస విధానాల్లో కీలక మార్పులు 

వాషింగ్టన్‌: బైడెన్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వలస విధానాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.  ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే చట్టసభల్లో ఆయన పార్టీకి అంతంత మాత్రమే మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉండటంతో ట్రంప్‌ నిర్ణయాలను ఉపసంహరించుకోవడం అంత సులువు కాదని, అందుకే అవసరమైతే కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చే యోచనతో బైడెన్‌ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ద్వారా చిన్నతనంలో వలస వచ్చి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి ప్రభుత్వ రక్షణను కల్పించే ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌’ చట్టాన్ని పునరుద్ధరించడం బైడెన్‌ ప్రాధాన్యంశాల్లో ఒకటని తెలుస్తోంది.  దీంతోపాటు మెక్సికో నుంచి అక్రమ వలసలను అరికట్టడానికి సరిహద్దులో ట్రంప్‌ తలపెట్టిన భారీ గోడ నిర్మాణానికి రక్షణ శాఖ నిధులను వెచ్చించకుండా నిలుపుదల చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోకి ప్రవేశించకుండా 13 ముస్లిం మెజార్టీ దేశాల ప్రయాణికులపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని కూడా బైడెన్‌ రద్దు చేయడానికి సిద్ధమవుతున్నారు. 

న్యాయవాద వృత్తికి కమల భర్త స్వస్తి

వాషింగ్టన్‌: అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు అండగా నిలవడానికి భర్త డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ తన న్యాయవాద వృత్తిని వదులుకోవడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. కమల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యాక డగ్లస్‌ వృత్తి నుంచి విరామం తీసుకొని ప్రచారంలో ఆమెకు అండగా నిలిచారు. కమల ప్రమాణ స్వీకారం చేశాక డగ్లస్‌ సెకండ్‌ జెంటిల్‌మేన్‌ హోదాలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో కమలకు తన సహకారం అవసరమని భావించి న్యాయవాద వృత్తికి డగ్లస్‌ వీడ్కోలు పలకనున్నారని సమాచారం.

ట్రంప్‌ ఖాతాలో అలస్కా

అలస్కాలో ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 217కు పెరిగింది. మరోవైపు అదే రాష్ట్రంలోని సెనేట్‌ సీటును కూడా ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో 100 స్థానాలున్న ఆ సభలో రిపబ్లికన్‌ పార్టీ బలం 50 సీట్లకు పెరిగింది.

ట్రంపే అధ్యక్షుడిగా కొనసాగుతారు

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను గుర్తించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు అంగీకరించడం లేదు. ట్రంపే మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ధీమాలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన రెండో దఫా అధికారమార్పిడి ప్రక్రియ శాంతియుతంగా. సజావుగా ఎలాంటి అవరోధాలు లేకుండా జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ‘‘రెండో దఫా అధికార మార్పిడి కూడా ట్రంప్‌నకే జరగనుంది. ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. పగ్గాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు. మొత్తం ఓట్లన్నీ లెక్కిస్తాం’’అని పాంపియో తెలిపారు. 

 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని