చెన్నమనేని పౌరసత్వ వివాదంపై విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ..

Updated : 17 Dec 2020 00:51 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కుమార్‌ జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ హైకోర్టుకు నివేదించింది. జర్మనీ పౌరసత్వాన్ని 2023 వరకు ఆయన పొడిగించుకున్నారని వివరించింది. తన భారత పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని రమేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇవాళ విచారణ చేపట్టారు. చెన్నమనేని పౌరసత్వం వివరాలను కేంద్ర హోంశాఖ మెమో రూపంలో సమర్పించడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని మరోసారి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 20కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతకొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్రహోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని