Goa Election Results 2022: గోవాలో మళ్లీ భాజపా సర్కారు!

నలభై స్థానాలున్న గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ భాజపా 20 స్థానాలు గెలుచుకొని మిత్రుల సాయంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2 స్థానాల్లో గెలిచిన మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు

Updated : 11 Mar 2022 06:07 IST

20 స్థానాల్లో కమల వికాసం

ఎంజీపీ, ముగ్గురు స్వతంత్రుల మద్దతు

పణజి: నలభై స్థానాలున్న గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ భాజపా 20 స్థానాలు గెలుచుకొని మిత్రుల సాయంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2 స్థానాల్లో గెలిచిన మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర విజేతలు ఆంటోనియో వాస్‌, చంద్రకాంత్‌ శెట్టి, అలెక్స్‌ రెజినాల్డ్‌ తమకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భాజపా గురువారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాల అనంతరం గోవా భాజపా చీఫ్‌ సదానంద్‌ తనావడే మీడియాతో మాట్లాడుతూ.. మిత్రుల నుంచి తమకు మద్దతు లేఖలు అందాయన్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. శుక్రవారం కొత్త శాసనసభ్యుల సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 11, ఇండిపెండెంట్లు 3, ఎంజీపీ 2, ఆప్‌ 2, ఆర్జీ 1, జీఎఫ్‌పీ 1 స్థానాల్లో గెలిచాయి. భాజపా 33.31 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌కు 23.46 శాతం ఓట్లు వచ్చాయి.

మూడు జంటల ఎన్నిక..

గోవా అసెంబ్లీకి ఎన్నికైన కొత్త జట్టులో భార్యాభర్తలైన ఆరుగురు శాసనసభ్యులు ఉన్నారు. గత ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె, ఆయన సతీమణి దివియ.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైఖేల్‌ లోబో, డెలీలాహ్‌ దంపతులు.. భాజపాకు చెందిన అతనాసియో మోన్‌సెరాటే, సతీమణి జెన్నిఫర్‌ తాజా ఎన్నికల్లో గెలిచారు. 

ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ భంగపాటు

గోవా ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు ఇద్దరూ కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతుల్లో ఓటమిని చవిచూశారు. మడ్‌గావ్‌ నుంచి పోటీ చేసిన మనోహర్‌ అజ్‌గాంవ్‌కర్‌ ప్రతిపక్ష నేత అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి  దిగంబర్‌ కామత్‌ చేతిలో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో డిప్యూటీ సీఎం చంద్రకాంత్‌ కవ్లేకర్‌ క్యూపేమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆల్టోన్‌ దకోస్తా చేతిలో ఓడిపోయారు.

ప్రమోద్‌ సావంత్‌ ఓ ఆయుర్వేద వైద్యుడు

మళ్లీ గోవా సీఎం పదవి చేపట్టే అవకాశాలున్న ప్రమోద్‌సావంత్‌ ఆయుర్వేద వైద్యుడు. ఈయన ఆరెస్సెస్‌ నుంచి ఎదిగారు. ఉత్తర గోవాలోని సంక్వెలిమ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మూడుసార్లు గెలిచారు. 2017 నాటి మనోహర్‌ పారికర్‌(భాజపా) ప్రభుత్వంలో స్పీకరుగా పనిచేశారు. పారికర్‌ మరణానంతరం 2019 మార్చిలో సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈయన శ్రీమతి సులక్షణ కూడా భాజపాలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని