Published : 31 Oct 2020 17:23 IST

లాలూ ఇలాకాలో.. తేజస్వీ నెగ్గేనా?

సీఎం అభ్యర్థికి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేక పవనాలు

హజీపూర్‌: తండ్రి జైలుకెళ్లడంతో పార్టీ బాధ్యతలను భుజానకెత్తుకున్న తేజస్వీ యాదవ్‌.. బిహార్‌లో మళ్లీ ఆర్జేడీ(రాష్ట్రీయ జనతా దళ్‌) జెండా ఎగరేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఊరూరా తిరుగుతూ మహాకూటమికి మద్దతు కూడబెట్టే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. కానీ ఈ 31ఏళ్ల సీఎం అభ్యర్థికి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రత్యర్థికున్న అనుభవం, సీఎం నితీశ్‌ కుమార్‌కు భాజపా అండ.. తేజస్వీకి సవాల్‌ విసురుతున్నాయి. ఒకప్పుడు తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అధిక ప్రాబల్యం ఉన్న రాఘోపూర్‌ నియోజకవర్గంలో ఈసారి తేజస్వీ యాదవ్‌ గెలుపు నల్లేరు మీద నడకేం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అప్పుడు సునాయాసంగానే..

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తేజస్వీ యాదవ్‌.. 2015లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు ఏళ్ల నాటి వైరాన్ని పక్కనబెట్టి మరీ జేడీయూ-ఆర్జేడీ చేతులు కలిపాయి. కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో జయభేరీ మోగించాయి. కూటమి అండతో ఆ ఎన్నికల్లో రఘోపూర్‌ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్‌.. భాజపా అభ్యర్థి సతీశ్‌ కుమార్‌పై సునాయాసంగానే గెలిచారు. మొట్టమొదటి సారి అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 

ఆ తర్వాత రెండేళ్లకే 2017లో కూటమి కుప్పకూలింది. మహాకూటమికి గుడ్‌బై చెప్పిన నితీశ్‌.. ఆ తర్వాత భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తేజస్వీ ఉపముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. తాజా ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగి.. ‘చాచా’ అంటూ పిలిచిన సీఎం నితీశ్‌ కుమార్‌నే సవాల్‌ చేస్తున్నారు. 

ఒకప్పుడు లాలూ ఖిల్లా..

 రాఘోపూర్‌ నియోజకవర్గం లాలూ ఇలాకాగా పేరొందింది. యాదవులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి లాలూ ప్రసాద్‌ 1995, 2000 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు జయకేతనం ఎగురవేశారు. 2005లో లాలూ సతీమణి రబ్రీదేవి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన సతీశ్‌ కుమార్‌.. రబ్రీదేవిని ఓడించి రాఘోపూర్‌ సీటు కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ కూటమి బలంతో ఈ నియోజకవర్గం మళ్లీ లాలూ కుటుంబం చేతికొచ్చింది. 2019జనాభా లెక్కల ప్రకారం.. రాఘోపూర్‌లో 3,36,613 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.30లక్షల మందికి పైగా యాదవ వర్గానికి చెందినవారే. 

ప్రత్యర్థి బలం.. భాజపా బలగం

కాగా.. 2017లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మహాకూటమి నుంచి వైదొలిగిన జేడీయూ.. భాజపాతో చేతులు కలిపింది. దీంతో ఈ సారి తేజస్వీకి ప్రధాన ప్రత్యర్థి అయిన భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్‌కు అదనపు బలం చేకూరినట్లయింది. అటు సతీశ్ కూడా యాదవ వర్గానికి చెందినవారే. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. 

మరోవైపు ఆర్జేడీకి మద్దతు కూడబెట్టేందుకు తేజస్వీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు చేస్తూ సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండటం కూడా యువనేతకు ప్రతికూలాంశంగా మారుతోంది. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి కేవలం తేజస్వీ కేవలం రెండు మూడు సార్లే రాఘోపూర్‌లో పర్యటించారు. అటు భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్‌ మాత్రం నియోజకవర్గంపై గట్టిగా దృష్టిపెట్టి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఎన్డీయే కూటమికి చెందిన లోక్‌ జన్‌శక్తి(ఎల్జేపీ) పార్టీ ఈ సారి బిహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోంది. రాఘోపూర్‌లో ఎల్జేపీకి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో రాఘోపూర్‌ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారింది. ఎల్జేపీ రాకతో ఓట్లు చీలే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ సవాళ్లను దాటుకుని లాలూ ఇలాకాలో తేజస్వీ యాదవ్‌ విజయకేతనం ఎగురవేస్తారో లేదో వేచిచూడాలి..!

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని