కమల్‌ హాసన్‌తో జట్టుకట్టనున్న ఒవైసీ!

ఏఐఎంఐఎం తమిళనాడు ఎన్నికలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం....

Published : 15 Dec 2020 01:54 IST

తమిళ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతోన్న ఎంఐఎం

హైదరాబాద్‌: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ జోరు పెంచారు. పలు ఎన్నికల్లో ఓటు శాతాన్ని భారీగా పెంచుకున్న ఏఐఎంఐఎం తమిళనాడు ఎన్నికలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2021 ఏప్రిల్‌ లేదా మేలో జరిగే ఎన్నికల్లో 25 స్థానాలకు తగ్గకుండా ఎంఎంఐ పోటీ చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌ హాసన్‌తో జట్టుకట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని ఎంఐఎం నేతలతో సోమవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఒవైసీ భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర ఎన్నికలపై సదరు నేతలతో చర్చించినట్లు ఒవైసీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం అక్కడ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటి 44 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఊపుమీద ఉన్న ఎంఐఎం తమిళ ఎన్నికలపై దృష్టిసారించింది. తమిళనాడులో పలు ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పాల్గొనాలని ఒవైసీ యోచిస్తున్నారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ (కమల్‌ హాసన్‌ పార్టీ), నామ్ తమిళర్‌ వంటి పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. వెల్లూర్‌, రాణిపేట్‌, తిరుపత్తూర్‌, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నింటిల్లో పోటీ చేసేందుకు మజ్లిస్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి...

ఎవరైనా సంప్రదిస్తే చర్చించి చెప్తాం: ఒవైసీ

మతతత్వ పార్టీగా ముద్ర వేస్తున్నారు: అసదుద్దీన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని