‘నితీశ్‌ సీఎం ఎలా అవుతారు?’

బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ను ప్రకటించిన కొద్దిగంటలకే ప్రతిపక్ష ఆర్జేడీ నీతీశ్‌పై విమర్శలు గుప్పించింది. కేవలం 43 అసెంబ్లీ సీట్లు సాధించిన పార్టీ నేత ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించింది...

Updated : 16 Nov 2020 01:24 IST

విమర్శలు గుప్పించిన ఆర్జేడీ

పాట్న: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ను ప్రకటించిన కొద్దిగంటలకే ప్రతిపక్ష ఆర్జేడీ ఆయనపై విమర్శలు గుప్పించింది. కేవలం 43 అసెంబ్లీ సీట్లు సాధించిన పార్టీ నేత ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించింది. రాష్ట్రంలోని అధిక శాతం ప్రజలు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా కోరుకోవడం లేదని విమర్శించింది. ‘40 స్థానాలు మాత్రమే సాధించిన ఓ వ్యక్తి సీఎం ఎలా అవుతారు? ఇది ప్రజల అభిష్టానికి వ్యతిరేకం. బిహార్ అధికారంలో మార్పు తథ్యం. అది వారంలో జరగొచ్చు. పది రోజుల్లో జరగొచ్చు. లేదా నెల రోజులు పట్టొచ్చు’ అని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ సైతం ఎన్డీఏ కూటమిపై విమర్శలు చేసింది. ఎన్డీఏలో నితీశ్‌ కుమార్‌కు స్వయం ప్రతిపత్తి ఉండదని కాంగ్రెస్‌ నేత తారిఖ్‌ అన్వర్‌ దుయ్యబట్టారు. ‘ఇదివరకు నితీశ్ కుమార్ బిహార్‌లో ఉత్తమ ఎన్డీఏ నేతగా ఎదిగారు. కానీ ఈసారి అలా ఉండదు. ఆయన్ను బలహీనం చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతుంది. నితీశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన్ను నియంత్రించే రిమోట్ ఇతరుల చేతిలో ఉంటుంది’ అని అన్వర్‌ అన్నారు. ఎన్నికలకు ముందే ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీతీశ్‌కుమార్‌ను ప్రకటించింది. ఆదివారం పాట్నాలోని నీతీశ్‌ ఇంట్లో సమావేశమైన కూటమి నేతలు ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఆయన వరుసగా నాలుగోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. సుశీల్‌ మోదీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కూటమిలో భాజపా 74 సీట్లు సాధించినప్పటికీ, 40 స్థానాల్లో గెలుపొందిన జేడీ(యూ) నేతకే సీఎం పీఠాన్ని కట్టబెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని