Kishan Reddy: ‘ఏడేళ్లలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారు’

ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 20 Aug 2021 14:46 IST

తొర్రూరు జన ఆశీర్వాద ర్యాలీలో కిషన్‌రెడ్డి

తొర్రూరు: ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కిషన్‌రెడ్డి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తోందని.. రాష్ట్రం మాత్రం ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుర్చీ, కుటుంబం కోసం దేనికైనా తెగిస్తారని విమర్శించారు.

యాత్రలో ఉద్రిక్తత..

మరోవైపు పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ తెరాస నేతలతో పాటు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కిషన్‌రెడ్డి యాత్రను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

అనంతరం వర్ధన్న పేటలో నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే ముందున్నామని చెప్పారు. గతంలో పోలియో వస్తే వ్యాక్సిన్ మన దేశానికి రావడానికి 15 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. ‘‘ వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉంది. 57కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాం. కరోనా వ్యాక్సిన్ చివరి వ్యక్తి వరకు ఉచితంగా ఇస్తాం. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వమే అప్పులిస్తోంది. గ్రామాల్లోని రోడ్లు, వీధి దీపాలు, కార్మికుల జీతాల కోసం నిధులు కేటాయించారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు.తెలంగాణ తల్లి కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది. రెండు పడక గదుల ఇల్లు ఇస్తానని ఏడేళ్లు అవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లో 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా రాజ్యమేలుతున్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. కాషాయ జెండా ఎగరవేస్తాం’’ అని  కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని