Kejriwal: ఒకే ఒక్క అడుగు.. అది వేస్తే మనమూ సాధించినట్లే..!

ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. దేశవ్యాప్తంగా చొచ్చుకెళ్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP). ఈ క్రమంలో జాతీయ పార్టీ హోదాను దక్కించుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.

Updated : 22 Aug 2022 14:51 IST

దిల్లీ: ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. దేశవ్యాప్తంగా చొచ్చుకెళ్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP). ఈ క్రమంలో జాతీయ పార్టీ హోదాను దక్కించుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇదే విషయాన్ని తన పార్టీ కార్యకర్తలతో పంచుకున్నారు ఆప్‌ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌.

‘దిల్లీ, పంజాబ్ తర్వాత ఆప్ పార్టీ.. గోవాలో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ. మనం ఇంకొక్క రాష్ట్రంలో ఇదే గుర్తింపు పొందితే.. అధికారికంగా జాతీయ పార్టీ హోదా లభిస్తుంది. ఈ సందర్భంగా పార్టీ ఎదుగుదలకు కోసం శ్రమించిన కార్యకర్తలకు నా అభినందనలు. అలాగే ఆప్‌పై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆప్‌ను గోవాలో రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించిన పత్రాన్ని షేర్ చేశారు. 

2012లో అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత దీని నుంచే కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్‌ పార్టీ ఆవిర్భవించింది. 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీగా ఏర్పడి.. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అవినీతికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన జన్‌లోక్‌పాల్‌ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంతో ఆమోదం పొందలేకపోయింది. దాంతో 49 రోజుల్లో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2020లో ఈ విజయాన్ని పునరావృతం చేసింది. ఈ ఏడాది పంజాబ్‌లో సంప్రదాయ పార్టీలు కాంగ్రెస్‌, శిరోమణి అకాలీ దళ్‌ను మట్టికరిపించి.. మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గానూ 2 సీట్లు గెలుపొందింది. 

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..!

* ఏదేనీ నాలుగు రాష్ట్రాల్లో చివరగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓటు షేర్ ఉండాలి. దాంతో పాటుగా చివరగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సంపాదించాలి. 

* చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికలో కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఎంపీలు ఎన్నిక కావడంతో పాటుగా మొత్తం లోక్‌సభ స్థానాల్లో రెండు శాతం సీట్లు పొందాలి.

కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని