Goa Election 2022: ఆప్‌ కొత్త అడుగు.. గోవా అభ్యర్థులతో సంతకాలు చేయించింది..!

పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త అడుగువేసింది. అలాగే ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థులతో అఫిడవిట్‌పై సంతకం చేయించింది.

Published : 03 Feb 2022 02:23 IST

ఎందుకంటే..?

పనాజీ: పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త అడుగువేసింది. అలాగే ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థులతో అఫిడవిట్‌పై సంతకం చేయించింది. వారంతా పార్టీకి విధేయులుగా ఉంటారని, ఒకవేళ గెలిస్తే నిజాయతీతో పనిచేస్తారని ఈ అఫిడవిట్ ద్వారా హామీ ఇప్పించింది. తమ అభ్యర్థులంతా నిజాయతీపరులని, ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంది. 

‘నేతలు తరచుగా పార్టీలు ఫిరాయించడమే గోవా రాజకీయాల్లో అతిపెద్ద సమస్య. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మాకు ఓటు వేసే దానికంటే ముందే ఈ సమస్యను పారదోలాలనుకుంటున్నాం’ అంటూ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో భాగంగా వెల్లడించారు. తమ పార్టీ ఇక్కడ నిజాయతీతో కూడిన ప్రభుత్వాన్ని అందించేందుకు నిశ్చయంతో ఉందని, అందుకోసం ఈ ఫిరాయింపుల సమస్యను వదిలించుకోవాల్సి ఉందని చెప్పారు.  ఈ సందర్భంగా అభ్యర్థులు, వారి అఫిడవిట్లను ప్రజల ముందు ఉంచారు. వారు మాట తప్పితే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేజ్రీవాల్ ప్రస్తుతం గోవా పర్యటిస్తున్నారు. అక్కడ తన పార్టీని విస్తరించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఇక్కడ పోటీ చేసినప్పటికీ.. ఒక్క సీటు కూడా గెల్చులేకపోయింది. ఇదిలా ఉండగా.. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భండారీ వర్గానికి చెందిన అమిత్ పాలేకర్‌ను ఎంచుకుంది. ఆ ఓబీసీ వర్గం రాష్ట్ర జనాభాలో 35 శాతం వరకు ఉంటుంది. గోవాలో ఫిబ్రవరి 14 ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని