Amit Shah: అదంతా ఓ ఫొటో సెషన్‌.. విపక్షాల భేటీపై అమిత్‌ షా వ్యంగ్యాస్త్రాలు

Opposition meet: 2024 ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే లక్ష్యంతో.. బిహార్‌ రాజధాని పట్నాలో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. దీనిపై భాజపా వ్యంగ్యంగా స్పందించింది.

Published : 23 Jun 2023 14:26 IST

దిల్లీ: బిహార్‌(Bihar) రాజధాని పట్నాలో శుక్రవారం జరుగుతోన్న విపక్షాల భేటీ(Opposition meet)పై భాజపా(BJP) నేతలు విమర్శలు గుప్పించారు. అదొక ఫొటో సెషన్ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎద్దేవా చేశారు. (Opposition Patna meet)

‘ఈ రోజు పట్నాలో ఫొటో సెషన్ జరుగుతోంది. వారు ప్రధాని మోదీ, ఎన్‌డీఏను సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు. అది కూడా 300 పైగా సీట్ల మెజార్టీతో’ అని అమిత్‌ షా(Amit Shah) పేర్కొన్నారు. ‘అత్యయిక పరిస్థితి వేళ ప్రజాస్వామ్య హననాన్ని చూసిన నేతలు ఇప్పుడు  కాంగ్రెస్ నేతృత్వంలో కలిసిరావడం చిత్రంగా ఉంది. వారంతా కలిసి తాము భాజపాను ఒంటరిగా ఓడించలేమని ఈ సమావేశంతో వెల్లడి చేస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఆ పార్టీకి ఇతరుల సహాయం అవసరం. 1984 అల్లర్లు, అత్యయిక పరిస్థితి వంటివి కాంగ్రెస్ ప్రేమకు నిదర్శనం కాదా..? అని మరోసారి అడగాలనుకుంటున్నాను’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) విరుచుకుపడ్డారు.

‘2024 సార్వత్రిక ఎన్నికల నిమిత్తం పట్నాలో నీతీశ్‌ కుమార్ ఒక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పెళ్లి కుమారుడు (ప్రధాని అభ్యర్థిని ఉద్దేశించి) ఎవరు..? అక్కడ ప్రతి ఒక్కరు తమను తాము అభ్యర్థులుగానే భావిస్తున్నారు’అని భాజపా సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విపక్ష నేతలకు ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోయినా.. ప్రజలు వారిని ఇష్టపడాలని కోరుకుంటున్నారని కమలం పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఇది వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి, అవినీతిని అనుసరిస్తోన్న నేతల సమావేశమని వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని