Andhra News: వైకాపా వేధిస్తే చంద్రబాబు హెరిటేజ్‌ ఎలా నడుపుతున్నారు?: అమర్నాథ్‌

రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అమరరాజా గ్రూపు సంస్థలకు సంబంధించిన వారు ఎవరైనా చెప్పారా? అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు.

Updated : 03 Dec 2022 17:00 IST

విశాఖపట్నం: అమరరాజా గ్రూప్‌ ఏపీలో కాకుండా ఇంకెక్కడా పెట్టుబడులు పెట్టకూడదా? అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు. తెలంగాణలో పెట్టుబడి పెడితే ఏపీ నుంచి వెళ్లగొట్టినట్టా అని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే అమరరాజా సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలు ఉండకూడదని చూస్తే చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ నడిచేదా? అని ప్రశ్నించారు. జగన్‌ నాయకత్వంలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు. 

‘‘రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అమరరాజా గ్రూపు సంస్థలకు సంబంధించిన ఎవరైనా చెప్పారా? 2010లో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. 2019లో నోటీసు ఇచ్చే సమయానికి 252 ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. కేవలం 232 ఎకరాల్లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించారు. అందులో కూడా పొల్యూషన్ నిబంధనలు పాటించలేదు. అమరరాజా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల బ్లడ్‌ శాంపిల్స్‌లో లెడ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంది. అమరరాజా సంస్థ కంటే.. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం. అందుకే అన్ని అంశాలపై నోటీసు ఇచ్చాం. నోటీసుపై హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. 11.43 శాతం జీడీపీతో దేశం కంటే మన రాష్ట్రమే ముందుంది. పెట్టుబడులు ఏవిధంగా తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే.. ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నిర్వహించబోతున్నాం’’ అని మంత్రి అమర్నాథ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని