Parkash Singh Badal: 94 ఏళ్ల వయసులో ఎన్నికలకు సై.. బరిలో బాదల్‌..

పంజాబ్‌ (Punjab)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2022) సందడి జోరుగా సాగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నేత

Published : 31 Jan 2022 23:52 IST

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2022) సందడి జోరుగా సాగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ (Prakash Singh Badal) సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన లాంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, 94 ఏళ్ల బాదల్‌.. దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన అత్యంత పెద్ద వ్యక్తిగా నిలవడం విశేషం.

బాదల్‌ కంటే ముందు కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌.. ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత పెద్ద వయస్కులుగా ఉన్నారు. ఆయన తన 92 ఏళ్ల వయసులో 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఈ అరుదైన రికార్డు సాధించిన వ్యక్తి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కావడం విశేషం. 

బాదల్‌.. రికార్డుల్‌

ఎన్నికల చరిత్రలో బాదల్‌ ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. 1947లో పంజాబ్‌లోని బాదల్‌ అనే గ్రామానికి ఈయన సర్పంచిగా గెలిచారు. అప్పట్లో అత్యంత చిన్న వయసులో సర్పంచి పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక, 1970లో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా గెలిచారు. అప్పుడు బాదల్‌ వయసు 43ఏళ్లు కాగా.. అప్పటివరకు అత్యంత పిన్క వయస్కులైన సీఎం ఆయనే. అంతేనా.. 2012లో మరోసారి పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 84 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన అత్యంత పెద్ద వయస్కులుగా మరో రికార్డు దక్కించుకున్నారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1997 నుంచి లాంబీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంజాబ్‌కు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1995 నుంచి 2008 మధ్య శిరోమణి అకాలీదళ్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని