Bandi sanjay: గ్యాస్‌ ధరలు తగ్గించిన పార్టీకే ఓటేస్తాం: బండి సంజయ్‌కి తేల్చి చెప్పిన గ్రామస్థులు

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో

Published : 09 Aug 2022 15:44 IST

చౌటుప్పల్‌: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. తాళ్లసింగారం గ్రామస్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు గ్రామస్థులు కొన్ని సమస్యలను బండి సంజయ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని.. అయితే ఇప్పటికీ తన బిడ్డకి ఉద్యోగం రాలేదని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదని, పింఛన్లు రావడం లేదని, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని పలువురు మహిళలు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ విషయంలో ప్రజలపై పెద్దగా భారం పడడం లేదని.. కేవలం నెలకు రూ.30 మాత్రమే భారం పడుతోందని సంజయ్‌ తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లే గ్యాస్‌ ధరలు పెరిగాయని గ్రామస్థులకు వివరించారు. కాగా, గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించిన పార్టీకే ఓటు వేస్తామని తాళ్లసింగారం గ్రామస్థులు తేల్చి చెప్పారు.

బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం నుంచి మీకు పంపిస్తున్న నిధులను కేసీఆర్ ఇవ్వకపోవడం వల్లే నిధులు మీ వరకు రావడం లేదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం తెలంగాణకు రెండు లక్షలకుపైగా ఇళ్లను మంజూరు చేసింది. వాటిని సీఎం కేసీఆర్ నిర్మించకపోవడంతోనే మీకు ఇళ్లు రాలేదు. మీకు ఇళ్లు ఇవ్వని పాపం కేసీఆర్‌దే.. ఇప్పటికైనా కేసీఆర్‌ను నిలదీయండి. భాజపాని గెలిపిస్తే.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్.. తన కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని