Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే భాజపా పోటీ: బండి సంజయ్‌

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.  భాజపా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అయిందని.. కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు.

Updated : 01 Mar 2023 15:22 IST

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా.. లేరా? అనే సందేహం వస్తోందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన  మహిళా మోర్చా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలి. భాజపా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుందని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఆయనకు ట్విటర్ టిల్లు అని నామకరణం చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్‌కు సీబీఐ, పోలీసుల కంటే మహిళా మోర్చా అంటే భయం.  తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారు. హత్యలు, అత్యాచారాలకు ప్రధాన  కారణం మద్యం. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని