Gujarat Polls: గుజరాత్‌లో పాగా వేయడం పక్కా.. జనవరి నుంచే ఓపీఎస్‌ అమలు: కేజ్రీవాల్‌

గుజరాత్‌లో అధికారం చేపడితే పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌)ను పునరుద్ధరిస్తామని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. ఆప్‌ విజయానికి ఉద్యోగులంతా కృషి చేయాలని కోరారు.

Published : 27 Nov 2022 23:23 IST

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ, పంజాబ్‌ ఎన్నికల్లోని ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతమవుతాయన్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సూరత్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆప్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 31 నుంచి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు.

అధికార భాజపాకు భయపడి ఆప్‌కు బహిరంగంగా మద్దతు తెలిపేందుకు ప్రజలు భయపడుతున్నారని కేజ్రీవాల్‌ అన్నారు. 27 ఏళ్ల భాజపా పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందని, ఆ పార్టీకి అభ్యర్థులందరికీ విశ్రాంతినివ్వాలని గుజరాత్ ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘పాత పింఛను విధానాన్ని(ఓపీఎస్‌) అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నోసార్లు ఆందోళన చేపట్టారు. కానీ, ఇప్పటి ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా వ్యవహరించింది. ఈసారి ఆప్‌ అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జనవరి నుంచే పాత పింఛను విధానం (ఓపీఎస్‌) అమలు చేస్తాం. ఇది మాటలకే పరిమితం కాదు. పంజాబ్‌లో ఇప్పటికే దీనికోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ఉద్యోగులందరి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీని గెలిపించడానికి ఉద్యోగులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తాజా ఎన్నికల్లో భాజపాకు ఓటమి భయం వెంటాడుతుండగా.. ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రస్తావనే లేకుండా పోయిందని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.‘‘27 ఏళ్లలో తొలిసారి భాజపా భయపడుతోంది. అనుమానముంటే ఎవరికి ఓటు వేస్తారో.. ప్రజల్ని మీరే అడగండి.. కచ్చితంగా వాళ్లు ఆప్‌కే వేస్తామని చెబుతారు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించామని, కానీ, గుజరాత్‌లో వస్తోన్నంత స్పందన ఇంకెక్కడా రాలేదని కేజ్రీవాల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని