Mamata Banerjee: నన్నూ జైల్లో పెడతారేమో.. మమత ఆసక్తికర వ్యాఖ్యలు

Mamata Benerjee| సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతోనే ప్రతిపక్షాలను అధికార భాజపా భయపెడుతోందని, ఇబ్బందులకు గురి చేస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

Published : 01 Feb 2024 21:37 IST

శాంతిపుర్‌: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను (Hemanth Soren) ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా (BJP) నేతలు ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. తనను జైల్లో పెట్టినా అశ్చర్య పోనవసరం లేదన్నారు. కేవలం విజయ కాంక్షతోనే ప్రతిపక్షాలను భాజపా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. నదియా జిల్లాలోని శాంతిపుర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

‘‘ మీరు అందర్నీ భయపెట్టొచ్చు. నన్ను కూడా జైల్లో పెట్టొచ్చు. కానీ, కచ్చితంగా బయటకు వస్తాను. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న కోరికతోనే అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు’’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికలకు ముందే పశ్చిమబెంగాల్‌లో జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోనని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపైనా కేంద్రం అసత్యాలు చెబుతోందని విమర్శించారు. ఇవన్నీ వాళ్ల రాజకీయ ఎత్తుగడల్లో భాగమేనని, ప్రజలను విభజించేందుకే ఇలాంటి కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని భావించినప్పటికీ.. తమ ప్రతిపాదనను ఆ పార్టీ తిరస్కరించిందని మమత అన్నారు. అందుకే బెంగాల్‌లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్‌ సహా, ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వివిధ పథకాల అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం కోల్‌కతాలో 48 గంటల దీక్షను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని