Akhilesh Yadav: భాజపా సీట్లు తగ్గుతాయని మేం నిరూపించాం: అఖిలేశ్ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోయినా.. గతంలో కంటే సీట్ల సంఖ్య పెరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌

Published : 11 Mar 2022 11:23 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోయినా.. గతంలో కంటే సీట్ల సంఖ్య పెరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శుక్రవారం స్పందించారు. ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూనే భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా సీట్ల సంఖ్య మరింత తగ్గుతుందని ఎద్దేవా చేశారు.

‘‘యూపీ ఎన్నికల్లో మా సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని 1.5 రెట్లు పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భాజపా సీట్లు తగ్గుతున్నాయని మేం నిరూపించాం. ఈ తగ్గుదల నిరంతరం కొనసాగుతుంది. ఆ పార్టీకి ఉన్న భ్రమలు సగానికి పైగా తొలగిపోయాయి. మరికొద్ది రోజుల్లో పూర్తిగా పోతాయి. ప్రజా ప్రయోజనాల కోసం మా పోరాటం కొనసాగుతుంది’’ అని అఖిలేశ్ ట్విటర్‌ వేదికగా భాజపాను విమర్శించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే కాషాయ పార్టీ సీట్ల సంఖ్య కాస్త తగ్గింది. గత ఎన్నికల్లో 300లకు పైగా సీట్లు సాధించిన భాజపా.. తాజా ఎన్నికల్లో 254 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా భాజపా కూటమి 273 స్థానాల్లో గెలిచింది. ఇక సమాజ్‌వాదీ కూటమి 125 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటే 111 స్థానాల్లో గెలుపొందింది. అంతక్రితం ఎన్నికల్లో 47 సీట్లకు పరిమితమైన అఖిలేశ్‌ పార్టీ.. ఈ సారి వందకు పైగా స్థానాలు సాధించడం విశేషం. భాజపా వ్యతిరేక ఓట్లలో ఎస్పీకే ఎక్కువగా పడ్డాయి. ఇక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అఖిలేశ్‌ యాదవ్.. కర్హాల్‌ నుంచి విజయం సాధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని