Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం

Chidambaram: ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై భాజపా ఎంపీలు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందిస్తూ.. భాజపా అసహనానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వ్యాఖ్యానించారు.

Published : 10 Jun 2023 12:43 IST

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాశారు. దీన్ని కర్ణాటకకు చెందిన నలుగురు భాజపా ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. భాజపా ఎంపీల విమర్శలపై తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం (P Chidambaram) తీవ్రంగా స్పందించారు. భాజపా (BJP) ఎలాంటి విమర్శలను సహించలేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఖర్గే రాసిన లేఖకు ప్రతిస్పందనగా భాజపా ఎంపీలు విడుదల చేసిన లేఖలో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు.

సీబీఐ ఉన్నది నేరాలపై విచారణ జరపడానికని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రైలు ప్రమాద ఘటనలపై దర్యాప్తు చేయడం సీబీఐ పని కాదన్నారు. సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలను సీబీఐ తేల్చలేదన్నారు. అలాగే రైల్వే భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని విమర్శించారు. దీనిపై భాజపా ఎంపీలు తేజస్వీ సూర్య, పీసీ మోహన్‌, మునిస్వామి, సదానంద గౌడ ఘాటుగా స్పందించారు. వాట్సప్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన సమాచారంతో ప్రధానికి లేఖ రాయడం ఖర్గే స్థాయి నేతకు తగదని విమర్శించారు.

భాజపా ఎంపీల విమర్శలపై చిదంబరం స్పందిస్తూ.. ఇది భాజపా అసహనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ప్రధానికి లేఖ రాసే హక్కు ఖర్గేకు ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి లేఖలకు ప్రధాని స్వయంగా స్పందిస్తారని ప్రజలు ఆశిస్తారని అన్నారు. కానీ, మన ప్రజాస్వామ్యంలో మాత్రం ఇలాంటి లేఖలకు బదులివ్వడం తగదని ప్రధాని భావిస్తారని విమర్శించారు. పైగా దీన్ని భాజపా ఎంపీలు తమ భుజాలపై వేసుకొని స్పందించడం ఏమాత్రం సరికాదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని